CPI | జీఎస్టీ కుంబకోణంపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి … సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి
తెలంగాణ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన కాలంలో సోమేశ్ కుమార్ రూ. 1400 కోట్ల మేర జీఎస్టీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయని, ఇంత జరిగినా కేసీఆర్ తన ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై స్పందించడం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు

విధాత, వరంగల్ ప్రతినిధి : తెలంగాణ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన కాలంలో సోమేశ్ కుమార్ రూ. 1400 కోట్ల మేర జీఎస్టీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయని, ఇంత జరిగినా కేసీఆర్ తన ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై స్పందించడం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. అవినీతి, అక్రమాలలో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ మాజీ సీఎం కేసీఆర్ కు పెద్ద కొడుకు లాంటి వాడని అన్నారు. మంగళవారం హనుమకొండ సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎస్ గా రిటైర్ అయిన సోమేశ్ కుమార్ ను తన ప్రభుత్వ సలహాదారుగా కేసీఆర్ నియమించాడని అన్నారు. సోమేశ్ కుమార్ వ్యవహారంపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
– రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన అవసరం
భూ ప్రక్షాళన జరుగాలంటే ముందుగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరుగాలని, సర్వే నెంబర్ల వారీగా సమగ్రంగా సర్వే చేపట్టాలని చాడ అన్నారు. కాళేశ్వరం మేడిగడ్డ వ్యవహారంతో పాటు విద్యుత్ ప్లాంట్ల విషయంలో విచారణ జరుగుతున్నదని అన్నారు. కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోడీ ప్రభుత్వం ఇండియా కూటమిలోని ప్రభుత్వాల పట్ల మళ్లీ అదే పక్షపాత దోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. బడ్జెట్ కేటాయింపులలో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలున్న రాష్ట్రాలరై వివక్ష చూపారని, ముఖ్యంగా తెలంగాణకు ఘోరమైన అన్యాయం చేశారని అన్నారు. దీనిపై ఇక్కడి బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు.
– ఆగష్టులో సీపీఐ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు
సీపీఐ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలను ఆగస్టు 22,23,24 తేదీలలో హనుమకొండ లోని హరిత కాకతీయ హోటల్ లో నిర్వహించనున్నట్లు చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాలలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ పై చర్చిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా మాజీ కార్యదర్శి సిరబోయిన కరుణాకర్, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, సీనియర్ నాయకులు మోతె లింగారెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు ఎన్ అశోక్ స్టాలిన్, జిల్లా కార్యవర్గ సభ్యులు కర్రె లక్ష్మణ్, మునిగాల బిక్షపతి, బాషబోయిన సంతోష్, కొట్టెపాక రవి తదితరులు పాల్గొన్నారు.