New Ration Cards | త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు.. కొత్తగా పెళ్లైన దంపతులు రేషన్ కార్డు పొందడం ఎలా..?
తెలంగాణ(Telangana)లోని లక్షలాది మంది కొత్త రేషన్ కార్డు( Ration Cards )ల కోసం ఎదురుచూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt ) పదేండ్ల కాలంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా జారీ చేయలేదు.

New Ration Cards | తెలంగాణ(Telangana)లోని లక్షలాది మంది కొత్త రేషన్ కార్డు( Ration Cards )ల కోసం ఎదురుచూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt ) పదేండ్ల కాలంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా జారీ చేయలేదు. కొత్త రేషన్ కార్డులను రేపోమాపో జారీ చేస్తామన్న ప్రకటనలకే బీఆర్ఎస్ ప్రభుత్వం పరిమితమై పోయింది. పదేండ్ల పాటు ఇదే ప్రకటనలు. కానీ అర్హులైన లబ్దిదారులకు మాత్రం కొత్త రేషన్ కార్డులు జారీ చేయనేలేదు. కొత్త రేషన్ కార్డుల కోసం డిమాండ్లు వచ్చినప్పటికీ కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
ఇక మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి.. అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ( Congress Party ) కూడా ఎనిమిది నెలల పాటు కొత్త రేషన్ కార్డుల జారీపై కాలయాపన చేసింది. కానీ ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డుల జారీకి కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఆ కేబినెట్ సబ్ కమిటీ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు కావాల్సిన మార్గదర్శకాలను రూపొందించింది. ఆ నివేదికను ప్రభుత్వానికి కూడా అందజేసింది కేబినెట్ సబ్ కమిటీ.
గురువారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధ్యక్షతన మంత్రి వర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ఉపకమిటీ నివేదికపై చర్చ జరుగుతుంది. మరికాసేపట్లో కొత్త రేషన్ కార్డుల జారీ( Ration Cards Guidelines )కి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ రేషన్ కార్డుల కోసం తెలంగాణలోని లక్షలాది మంది వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ కొత్త రేషన్ కార్డు పొందాలంటే ఏం చేయాలి..? మరి ముఖ్యంగా ఈ పదేండ్ల కాలంలో కొన్ని లక్షల మందికి పెళ్లిళ్లు అయ్యాయి. అలాంటి వారు కొత్త రేషన్ కార్డు ఎలా పొందాలో తెలుసుకుందాం..
కొత్తగా పెళ్లైన దంపతులు కొత్త రేషన్ కార్డు అవసరమా..?
కొత్తగా పెళ్లైన దంపతులు( Married Couple ) కొత్త రేషన్ కార్డు ఎందుకు తీసుకోవాలి..? తల్లిదండ్రులకు సంబంధించిన రేషన్ కార్డులోనే కోడలి( Daughter in Law ) పేరు చేర్చితే సరిపోతుంది కదా అనే సందేహం రావొచ్చు. కానీ కాంగ్రెస్ సర్కార్( Congress Govt ) ప్రతి ప్రభుత్వ పథకానికి రేషన్ కార్డును ప్రామాణికం చేసింది. అర్హులైన పేదలు ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డును కలిగి ఉండాల్సిందే. కాబట్టి కొత్తగా పెళ్లైన దంపతులు ఈ పద్ధతిని అనుసరించి కొత్త రేషన్ కార్డును పొందొచ్చు.
మరి కొత్త రేషన్ కార్డు పొందడం ఎలా..?
1. మొదటగా పెళ్లైన యువకుడు తన తల్లిదండ్రుల రేషన్ కార్డులో నుంచి తన పేరును తొలగించుకోవాలి. ఇందుకు మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. తమ వెంట రేషన్ కార్డు తీసుకెళ్లాలి. తహసీల్దార్ ఆఫీసులో ఉండే కంప్యూటర్ ఆపరేటర్‌కు చెప్పి.. తల్లిదండ్రుల రేషన్ కార్డులో నుంచి పేరును తొలగించుకోవాలి.
2. ఆ తర్వాత తన భార్య పేరును కూడా వారి తల్లిదండ్రుల రేషన్ కార్డులో నుంచి తొలగించాలి. సదరు మహిళ ఏ మండల పరిధిలోకి వస్తే ఆ మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీసులోనే ఈ ప్రక్రియను పూర్తి చేయించాలి.
3. ఇక అటు భర్త, ఇటు భార్య పేర్లు తమ తమ కుటుంబ సభ్యుల రేషన్ కార్డుల నుంచి తొలగించబడ్డాయో లేదో నిర్ధారించుకోవాలి. ఇద్దరి పేర్లు తొలగిపోయాయని నిర్ధారణ అయితే.. తహసీల్దార్ కార్యాలయాల వద్ద లభించే రేషన్ కార్డు దరఖాస్తులను తీసుకోని, వాటిని తప్పుల్లేకుండా నింపాలి.
కొత్త రేషన్ కార్డులకు ఏయే డాక్యుమెంట్స్ అవసరం..?
కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు నింపిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఆ దరఖాస్తుకు జతపరచాలి. అవి ఏంటంటే.. భార్యాభర్తల ఆధార్ కార్డులు, పుట్టిన తేదీ ధృవీకరణ కోసం స్టడీ సర్టిఫికెట్, తమ పేర్లు కలిగిన ఉన్న పాత రేషన్ కార్డులు, మ్యారేజ్ సర్టిఫికెట్( Marriage Certificate )తో పాటు ఇద్దరి ఫొటోలను జతపరిచి, మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలి.
అధికారులు తమ దరఖాస్తును పరిశీలించి, అన్ని సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత తమకు కొత్త రేషన్ కార్డును జారీ చేస్తారు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వారైతే.. తహసీల్దార్ కార్యాలయాలను కాకుండా జోనల్ సర్కిల్ ఆఫీసులను సంప్రదించి, తమ పేర్లను తొలగించుకోవాల్సి ఉంటుంది.