Hailstorms | రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదు అవుతున్నప్పటికీ, రాత్రి వేళ మాత్రం అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఏప్రిల్ 2వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, నల్లగొండ, సూర్యాపేట్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరి ధాన్యంతో పాటు ఇతర పంటలను కాపాడుకోవాలని సూచించారు. బలమైన ఈదురుగాలులకు మామిడి కాయలే రాలే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
