22ఏ నిషేధిత భూముల జాబితాలో లక్షల కోట్ల విలువైన ప్రైవేటు భూములు, ప్రజల ఆస్తులను చేర్చిడంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొరపాటు జరిగిందని క్షమాపణలు చెబితే సరిపోదని, నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు డిమాండ్ చేశారు. మల్కాజ్‌గిరిలో నిర్వహించిన 22ఏ బాధితుల సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. నిషేధిత జాబితాలో ప్రజల ఆస్తులను చేర్చి అధికారులు తప్పు చేశారని మంత్రి పొంగులేటి తప్పించుకోచూస్తున్నారని ఆరోపించారు. ఇంకోవైపు మంత్రి చెబితేనే తాము ఆ భూములను నిషేధిత జాబితాలో పెట్టామని అధికారులు చెబుతున్నారని, అసలు 22ఏలో ఆ భూములను చేర్చమన్నది ఎవరో తేల్చాల్సి ఉందని హరీశ్ రావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇల్లుకూడా నిషేధిత జాబితాలో పెట్టారని, అందుకే రేవంత్ రెడ్డికి పొంగులేటి క్షమాపణ చెప్పాడే తప్ప ప్రజలకు కాదని..తన ఇల్లు నిషేధిత జాబితాలో నుండి తీసేయాలని రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసాడా? మరి ప్రజలు ఎందుకు దరఖాస్తు చేసుకోవాలి? అని హరీశ్ రావు నిలదీశారు. తప్పు చేసింది మంత్రి పొంగులేటి అయినందునా..తప్పులు సరిదిద్దాల్సిన బాధ్యత కూడా ఆయనదేనన్నారు.
రాష్ట్రంలో 22ఏ సెక్షన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా భూములను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను తీవ్ర గందరగోళానికి, అయోమయానికి గురిచేస్తోందని విమర్శించారు. ఎవరి భూమి 22ఏ జాబితాలో ఉందో, ఎవరిది లేదో తెలియక రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా 1999లోనే అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని రద్దు చేశారు. మన రాష్ట్రంలో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ చట్టాన్ని పూర్తిగా ఎత్తేశారు అని గుర్తు చేశారు. కానీ ఆనాడు సీలింగ్ పరిధి నుంచి బయటపడి, క్లియర్ అయిన భూములను కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చి సీలింగ్ యాక్ట్ కింద 22ఏ జాబితాలో పెట్టడం ఏ రకమైన న్యాయం అని, ఈ ప్రభుత్వానికి కనీస అవగాహన, పాలనపై పట్టు లేదనడానికి ఇదే నిదర్శనం అని హరీశ్ రావు విమర్శించారు.
బీఆర్ఎస్ భారీ ఉద్యమం
22ఏ నిషేధిత జాబితాలో పెట్టిన ప్రజల భూములు, ఆస్తులను తొలగించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఉద్యమం చేపడతాం అని హరీశ్ రావు ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్ పని చేయకపోయినా, మా జనతా గ్యారేజ్ (తెలంగాణ భవన్) తలుపులు మీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని, మీ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించే వరకు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని, మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఎవడు మిమ్మల్ని 30% కమీషన్ అడిగినా మీకు అండగా జనతా గ్యారేజ్, మా పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేసిన తప్పుకు ప్రజలు శిక్ష అనుభవించాలా? 20 ఏళ్ల నుండి లేని సమస్య రాత్రికి రాత్రి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం భూములను 22ఏ నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టింది? 60 ఏళ్ల నుండి ఉంటున్న ఇల్లును 22ఏ నిషేధిత జాబితాలో పెట్టారని హరీశ్ రావు నిలదీశారు. ముందు అడ్డగోలుగా భూములను 22ఏలో వేయడం, ఆ తర్వాత దాన్ని సరిచేయడానికి జీవోలు తెస్తాం, రివ్యూలు చేస్తాం అని డ్రామాలు ఆడటం ఎందుకని ప్రశ్నించారు.
తప్పు జరిగినప్పుడు తక్షణమే ఆ భూములను 22ఏ నుంచి తొలగించాలి కానీ.. ఈ రివ్యూల పేరుతో కాలయాపన చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? కమీషన్ల కోసమేనా అని హరీశ్ రావు నిలదీశారు. అసలు ఈ ప్రాపర్టీలను 22ఏలో ఎవరు పెట్టారు? కమీషన్లు తీసుకుని ఎవరు తొలగిస్తున్నారు? దీనిపై తక్షణమే విచారణ జరగాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 7, 2023 నుంచి భూములను ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో పెట్టిన వివరాలు ప్రభుత్వం వెంటనే వైట్ పేపర్ విడుదల చేసి నిజాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు. అప్పటిలోగా ఈ ఆస్తులన్నింటినీ 22ఏపరిధి నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు.
