విధాత : సీఎం రేవంత్ రెడ్డి రైతుల సమస్యల మీద రివ్యూ ఎందుకు చేయడం లేదు..పైసలు రావనా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్ రావు ప్రశ్నించారు. భూములు, కాంట్రాక్టులు, కమిషన్ల మీద రివ్యూలు చేస్తారు తప్ప రైతాంగం సమస్యల మీద రివ్యూ చేసే సమయం మీకు దొరకదా.? అని నిలదీశారు. పంట దిడుబడుల కొనుగోళ్లు ఆగిపోయాయన్న కనీస సమాచారం మీ ఇంటెలిజెన్స్ మీకు చెప్పడం లేదా? చెప్పినా రైతులే కదా అని చిన్న చూపు చూస్తున్నావా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు గల్లీకి తక్కువ.. ఢిల్లీకి ఎక్కువ అన్నట్లుగా తయారయ్యారన్నారు. గాలి మోటార్లలో తిరుగుతూ కేరళ, ఢిల్లీ పర్యటనల్లో ఉన్న బిజీలో వారికి రైతుల కష్టాలు పట్టడం లేదు అని, వారికి భూమి మీద తిరుగుడు తక్కువైపోయి గాలి మోటార్ల తిరుగుడు ఎక్కువైపోయిందని ఆరోపించారు. విద్యుత్తు సాయంత్రం 4 గంటలకు పోయి పొద్దున 8 గంటలకు కరెంట్ వస్తుందని, పంటల కొనుగోలు సాగడం లేదని రైతులు చెబుతున్నారని.. ముఖ్యమంత్రి ఢిల్లీ, కేరళ టూర్లు ఆపి రైతుల కష్టాల మీద రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు.
సంగారెడ్డి నియోజకవర్గం, సదాశివపేట రైతు సేవా కేంద్రంలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోలు కోటా అయిపోయిందంటూ కొనుగోళ్లు నిలిపివేయడంతో వారం రోజులుగా అక్కడే పడిగాపులు కాస్తున్న రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎందుకు కొనుగోలు చేయడం లేదని అధికారులను నిలదీశారు.
మద్దతు ధరతో శనగలు కొనుగోలు చేయాలి
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు ఏటిగడ్డ సంఘం తదితర గ్రామాల రైతులు తమ శనగలు కొనడం లేదని మా దృష్టికి తీసుకురావడంతో, ఇక్కడి డీసీఎంఎస్ సెంటర్ కు రావడం జరిగిందని,. రైతులను, నిర్వాహకులను అడిగితే కోటా అయిపోయిందని చెబుతున్నారని తెలిపారు. సదాశివపేటలో కొత్తగా శనగలు కొనకపోగా, ఇప్పటికే కొన్న శనగలను కూడా బిల్లులు కావడం లేదని బస్తాలు ఖాళీ చేసి రైతులకే వెనక్కి ఇచ్చేస్తున్నారని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నామని మొగలయ్య లాంటి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలన్నారు.
మార్కెటింగ్ శాఖ మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి, ముఖ్యమంత్రి ఎక్కడికి పోయారు? అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 60 వేల క్వింటాళ్ల శనగలు రైతుల దగ్గర ఉన్నాయి. వెంటనే రూ. 5870 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులు బయట అమ్ముకుని క్వింటాల్ కు రూ. 1000 చొప్పున, ఎకరానికి పది వేల రూపాయలు నష్టపోతారు అని పేర్కొన్నారు.
శనగల కొనుగోలు ఆగిపోయింది..జొన్నల కొనుగోలుపై నిర్ణయం లేదు
రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో మక్కజొన్న పండితే, సగం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదు అని, సంచులు లేవని, టోకెన్లు ఆపేశారని, మద్దతు ధర రూ. 2400 ఉంటే రూ. 1600-1700 కే అమ్ముకుని రైతులు మోసపోతున్నారు అని హరీశ్ రావు ఆరోపించారు. జొన్నల కొనుగోలుపై ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయమే తీసుకోలేదు. ఆరుగాలం కష్టపడ్డ రైతులు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి సగం ధరకే జొన్నలు అమ్ముకునే దుస్థితి వచ్చింది. వడ్లు కూడా రోడ్ల మీదనే ఉన్నాయని విమర్శించారు. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ లో ప్రతి పంటకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్.. ఇప్పుడు బోనస్ ఎగ్గొట్టి ఆ మాటను బోగస్ చేసిందని హరీశ్ రావు ఆరోపించారు. మక్కలు, కందులు, శనగలు, జొన్నలకు బోనస్ ఇవ్వడం లేదు. కనీసం సన్న వడ్లకైనా ఈ యాసంగిలో బోనస్ ఇస్తారా లేదా స్పష్టం చేయాలి. గత యాసంగి బోనస్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మీ ప్రభుత్వం రైతుల కోసమా? లేక కాంట్రాక్టర్లు, దళారుల కోసమా?
కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వలేకపోతోందన్నారు. సకాలంలో రైతుబంధు ఇవ్వకపోగా.. కనీసం పండిన పంటను మద్దతు ధరకు కొనే పరిస్థితిలో కూడా లేదు. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని విమర్శించారు. కరెంటు ఇవ్వరు, రైతుబంధు వేయరు, బోనస్ ఇవ్వరు, పండిన పంటను మద్దతు ధరకు కొనరు.. మీ ప్రభుత్వం రైతుల కోసమా? లేక కాంట్రాక్టర్లు, దళారుల కోసమా? అని హరీశ్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి జొన్నలు, సన్ ఫ్లవర్, వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, కోటా పేరుతో ఆగిపోయిన శనగల కొనుగోలును వెంటనే తిరిగి మొదలుపెట్టాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
డీలిమిటేషన్ పై.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
