Telangana Legislative Assembly | కేంద్ర బడ్జెట్‌లో అన్యాయంపై అసెంబ్లీలో వాడీ వేడి చర్చ ,సీఎం రేవంత్‌రెడ్డి .. కేటీఆర్ మాటల యుద్ధం

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ శాసన సభలో జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డికి, బీఆరెస్ ఎమ్మెల్యే కేటీఆర్‌లకు మధ్య మాటల యుద్ధం సాగింది.

Telangana Legislative Assembly |  కేంద్ర బడ్జెట్‌లో అన్యాయంపై అసెంబ్లీలో వాడీ వేడి చర్చ ,సీఎం రేవంత్‌రెడ్డి .. కేటీఆర్ మాటల యుద్ధం

కేసీఆర్ రాకపోవడాన్ని తప్పుబట్టిన సీఎం రేవంత్‌రెడ్డి
మీకు మేంచాలు..మాకు సమాధానం చెబితే చాలన్న కేటీఆర్‌
మీలా తండ్రి పేరు చెప్పుకుని మేనేజ్‌మెంట్ కోటాలో రాలేదన్న రేవంత్‌
మీరు పేమేంట్ కోటా అనోచ్చా అని కేటీఆర్ కౌంటర్‌
కేంద్రంపై బీఆరెస్ పోరాటం అబద్దమన్న రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రయోజనాలపై రాజీలేదని కేటీఆర్ స్పష్టీకరణ

విధాత, హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ శాసన సభలో జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డికి, బీఆరెస్ ఎమ్మెల్యే కేటీఆర్‌లకు మధ్య మాటల యుద్ధం సాగింది. సభలో తీర్మానం పెట్టకుండా చర్చ పెట్టారని, సీఎం రేవంత్‌రెడ్డి మంత్రిగా పనిచేయకుండా నేరుగా సీఎం కావడంతో ఆయనకు సరైన అవగాహాన లేనట్లుందన్న వ్యాఖ్యలతో మొదలైన యుద్ధం పదేళ్ల బీఆరెస్ పాలనలో కేంద్రంతో కాంగ్రెస్‌, బీఆరెస్‌లు వివిధ సందర్భాల్లో వ్యవహారించిన అంశాలను ఉటంకిస్తూ పోటాపోటీగా ఆరోపణలు..ప్రత్యారోపణలు చేసుకున్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కీలక చర్చ జరుగుతుంటే సభకు మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్‌ సభకు వస్తే ప్రధాని మోదీకి కోపం వస్తుందనే కేసీఆర్ రాలేదని ఆరోపించారు. బీఆరెస్‌ నేతలు ఢిల్లీ వెళ్లి చీకట్లో బీజేపీతో ఒప్పందం చేసుకుని వచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీకు కేసీఆర్ అవసరం లేదని, మేం చాలని మాకు జవాబు చెప్పండి చాలు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తనను మంత్రిగా కాకుండానే నేరుగా సీఎం అయ్యారంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడిన సీఎం రేవంత్‌రెడ్డి తండ్రి పేరు చెప్పుకొని నేను మంత్రిని కాలేదని, కింది స్థాయి నుంచి ఎదిగి ముఖ్యమంత్రిని అయ్యానని, కేటీఆర్‌దిమేనేజ్మెంట్ కోటా అనుకున్నా. అంతకంటే దారుణమన్నారు. ఆ వెంటనే కేటీఆర్ స్పందిస్తూ ‘రేవంత్ పేమెంట్ కోటాలో సీఎం అయ్యారని మేమూ అనొచ్చు’ అని వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ, రాజీవ్‌గాంధీ కూడా మేనేజ్‌మెంట్ కోటా అని ప్రశ్నించారు. మేనేజ్మెంట్ కోటాలో మంత్రి అయ్యానని సీఎం అనొచ్చా..? సభా నాయకుడు అలా విమర్శలు చేయవచ్చా అని ప్రశ్నించారు.

యాచిస్తే ఏమీ రాదు.. శాసించి సాధించుకోవాలి: కేటీఆర్

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణకు యాచిస్తే కేంద్రం నుంచి ఏమీ రాదని, శాసించి సాధించుకోవాలనన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంతో బంధాలు, అనుబంధాలు, సత్సంబంధాలు కొనసాగిస్తామని ప్రధాని మోడీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు బడే భయ్యా..చోటే భయ్యా అంటూ అన్నదమ్ముళ్ల అనుబంధం సినిమా చూపించారన్నారు. కేసీఆర్ గతంలో అనవసరంగా కేంద్రంతో పంచాయితీ పెట్టుకున్నారన్నారు. ఇప్పుడేమో కేంద్రం కక్ష చూపించింది, వివక్ష చూపించింది అంటున్నారని, మేము ఇన్ని రోజులు చెప్పింది అదే.. మీ దాకా వస్తే కానీ తత్వం బోధపడలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ పేరు తియ్యకుంటే ముఖ్యమంత్రికి బతుకుదెరువు లేదా అని, మోదీ పేరు తీసుకొని మాట్లాడడానికి సీఎం రేవంత్‌రెడ్డికి అంత భయం ఎందుకని ప్రశ్నించారు. రెండు జాతీయ పార్టీలకు 8సీట్ల చొప్పున ఇస్తే తెలంగాణ పదం వినిపించకుండా పోయిందని, అదే 16మంది బీఆరెస్ ఎంపీలుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన చర్చను మేం సమర్థిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. విభజన సమయంలో తెలంగాణ హక్కుల కోసం ఎంతో పోరాడామని, మోదీ సర్కారుపై తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేశామని, రాష్ట్ర హక్కులు ఎవరు హరించినా వారి మెడలు వంచుతామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది ఎంపీలు ఉన్నా తెలంగాణకు తెచ్చింది గుండు సున్న అన్నారు. బడ్జెట్‌లో పంజాబ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వాళ్ల ఎంపీలు రోడ్డెక్కారని, అక్కడ కాంగ్రెస్ ఎంపీలు కోట్లాడకుండా, ఇక్కడ అసెంబ్లీలో చర్చ పెట్టారన్నారు. 21 సార్లు ఢిల్లీకి వెళ్లిన ట్రిప్పులు వేస్ట్ అయ్యాయాని, కాబట్టి ప్రజల్లో ఎం చెప్పాలో తెలియక, అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్ మీద చర్చ పెట్టారన్నారు. ఖచ్చితంగా మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రంతో కొట్లడటానికి మేము సహకరిస్తామని, ఎవ్వరితో ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం మాకు లేదని కేటీఆర్ పేర్కోన్నారు. ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన బ్రహ్మండంగా ఇక్కడే ఉంటాం, గొంతు విప్పుతాం, మిమల్ని ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలు అమలు చేసేదాకా అడుగడుగునా ఎండగడతామన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ లేదని, మా పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమన్నారు. మా పార్టీకి, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధి మా జెండా ఎజెండా తెలంగాణమేనని స్పష్టం చేశారు. మీరు 99మంది ఎంపీలున్నారని, మా వాళ్లు రాజ్యసభలో నలుగురున్నారని మేం తెలంగాణ హక్కుల సాధన పోరాటల్లో మీతో కలిసి వస్తామన్నారు.

మోదీపై పోరాటాలపై బీఆరెస్ అబద్ధాల ప్రచారం : సీఎం రేవంత్ రెడ్డి

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చపెడితే పదేళ్లలో బీఆరెస్ కేంద్రంపై పోరాటాలు చేసిందని సభ ద్వారా ప్రజలను కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని సీఎం రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. 2018లో పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెడితే మోదీకి మద్దతుగా నిలిచేందుకు బీఆరెస్ సభ నుంచి వాకౌట్ చేసిందన్నారు. 2019లో ప్రవేశపెట్టిన ఆర్టీఐ సవరణ చట్టానికి మద్దతుగా బీఆరెస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ ప్రత్యేక విమానంలో వెళ్లి ఓటింగ్ లో పాల్గొన్నది నిజం కాదా? అని, అసెంబ్లీ సాక్షిగా నోట్ల రద్దును కేసీఆర్ స్వాగతించలేదా అని, గొప్ప నిర్ణయమని పొగడ్తలతో ముంచెత్తింది మీరు కాదా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో, జీఎస్టీ బిల్లు, 376బిల్లు, త్రిపుల్ తలాక్ బిల్లులలో, సాగు చట్టాలలో బీజేపీకి అండగా నిలబడింది బీఆరెస్ కాదా? అని, అన్నింట్లో మద్దతు పలికి ఇప్పుడు పోరాటాలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు కాదు.. మోదీ ప్రేమ ఉంటే చాలు అని ఆనాడు తెలంగాణ ప్రజల సాక్షిగా కేసీఆర్ మాట్లాడారని, ఆదానీ, అంబానీలతో చీకట్లో కుమ్మక్కు అయ్యే అవసరం మాకు లేదని, సభ నిర్వహించేది గాలి మాటలు మాట్లడటానికి కాదన్నారు. రాష్ట్రం దివాళా తీయడానికి కారణం బీఆరెస్ పదేళ్ల పాలన అని, ప్రతీ శాఖలో బిల్లులన్నీ పెండింగ్ పెట్టారని, మీరేం చేశారో చూసే ప్రజలు తీర్పు ఇచ్చారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఇంకా అహంకారంతో ఇతరులను కించపరిచేలా మాట్లాడటం మంచిది కాదని, ఎంపీ ఎన్నికల్లో గుండుసున్నా వచ్చినా మీ బుద్ధి మారకపోతే ఎలా? ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ముందుకు రావాలని కోరుతున్నానన్నారు. అయితే రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై కేటీఆర్ స్పందిస్తూ సామాజిక అంశాల నేపథ్యంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆరెస్ గతంలో వ్యవహారించిందని, ఎన్డీఏకు వ్యతిరేకంగా యశ్వంత్‌సిన్హాను రాష్ట్రపతిగా నిలబెట్టిన సందర్భంలో మద్దతునిచ్చామని వివరణ ఇచ్చారు.