Jurala Project | జూరాల వద్ద కృష్ణమ్మ సవ్వడి.. ప్రాజెక్ట్‌కు భారీ వరద
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటితో కల కలలాడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నిండుకుండలా మారడం తో అధికారులు ఐదు క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు

ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
జూరాల విద్యుత్ కేంద్రంలో 393 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
ప్రస్తుత నీటి నిలువ 7.49 టీఎంసీ లు
ఇన్ ఫ్లో 70 వేల క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో : 56,865 క్యూసెక్కులు
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటితో కల కలలాడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నిండుకుండలా మారడం తో అధికారులు ఐదు క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణానది ఎగువ ప్రాంతం లో కురిసిన భారీ వర్షాలకు నది నిండుగా ప్రవహిస్తోంది.జూరాల ప్రాజెక్టు కు భారీ గా వరద నీరు చేరడం తో ప్రాజెక్టు అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక్కడి నుంచి విడుదల చేసిన నీరు శ్రీశైలం ప్రాజెక్టు కు చేరుతుంది.
ప్రస్తుతం ఇన్ ఫ్లో 70 వేల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 56,865 క్యూసెక్కులు ఉంది.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 317.420 మీటర్లు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీ లు ఉండగా ప్రస్తుత 7.498 టీఎంసీ ల నీటిని అధికారులు నిలువ ఉంచి మిగతా నీటిని దిగువ కు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఎగువ,దిగువ జల విద్యుత్ కేంద్రాలలో 10 యూనిట్లలో 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.
జూరాల ప్రాజెక్టు
జోగులాంబ గద్వాల జిల్లా కు 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న ధరూర్ మండలంలోని రేవులపల్లి గ్రామం సమీపంలో ఈ ప్రాజెక్టు ఉంది.ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు లక్ష ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది . కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ప్రాజెక్టు ఆయకట్టు కు నీరు అందిస్తారు.ప్రాజెక్టు కుడి కాలువ ను సోమనాద్రి అని నామకారణంగా పిలుస్తారు. ఈ కాలువ సుమారు 51 కిలో మీటర్లు ప్రవహించి గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలోని 37700 ఎకరాలకు సాగునీరును అందుతుంది. ప్రాజెక్టు ఎడమ కాల్వను ఎన్టీఆర్ కాలువ గా పిలుస్తారు.
ఈ కాలువ ద్వారా ఆత్మకూరు, వనపర్తి , కొల్లాపూర్ నియోజకవర్గాలలోని 64,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇక్కడ 240 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందే అప్పటి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు విద్యుత్ గురించి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో సగభాగం కర్ణాటక రాష్ట్రానికి ఇవ్వాలని 1976 ఆగస్టు 4 న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పంద సంతకాలు చేశారు. విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు లో సగ భాగం కర్ణాటక రాష్ట్రం భరించాల్సి ఉంటుందని ఒప్పందం లో ఉంది.అప్పటి నుంచి ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను కర్ణాటక కు సరఫరా చేస్తున్నారు.