మరో నాలుగు రోజులు భారీ వర్షాలే: వాతావరణ శాఖ హెచ్చరిక

రాగల నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

మరో నాలుగు రోజులు భారీ వర్షాలే: వాతావరణ శాఖ హెచ్చరిక

విధాత: రాగల నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, కామారెడ్డి జిల్లాల్లో గంటలకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. గురువారం నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది.

శుక్రవారం నుంచి ఆదివారం వరకు పలుజిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. ఇప్పటికే బుధవారం రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. గడిచిన రెండు రోజులు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదవ్వగా.. మరికొన్ని జిల్లాలో భారీ వర్షాపాతం రికార్డయ్యింది.