BC Reservations | రిజర్వేషన్లు 50 శాతం మించొద్దు.. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లొచ్చు

BC Reservations | గడువు తీరిన స్థానిక సంస్థలకు పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలకు వెళ్లవచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని హైకోర్టు సూచించింది.

  • By: raj |    telangana |    Published on : Oct 12, 2025 2:00 AM IST
BC Reservations | రిజర్వేషన్లు 50 శాతం మించొద్దు.. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లొచ్చు

స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
జీవోలు 9,41,42లపై స్టే విధింపు

BC Reservations | హైదరాబాద్, అక్టోబర్ 10 (విధాత ప్రతినిధి) : గడువు తీరిన స్థానిక సంస్థలకు పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలకు వెళ్లవచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని హైకోర్టు సూచించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 వాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9తో పాటు 41, 42 జీవోలపై కూడా స్టే విధించింది. స్థానిక సంస్థల కాల పరిమితి గడువు మించిపోతే ట్రిపుల్ టెస్టును రాష్ట్రంలో నిర్వహించే పరిస్థితులు లేకపోతే ఆ దామాషాను ఓపెన్ కేటగిరి సీట్లుగా పరిగణించి ఎన్నికలకు వెళ్లవచ్చని 2022లో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ రమేశ్ వాగ్ కేసులో జారీచేసిన విషయాన్ని హైకోర్టు తన స్టే ఆర్డర్ లో ప్రస్తావించింది.

రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 జారీ చేయకముందు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 50 శాతం ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంతో రిజర్వేషన్లు 67 శాతానికి చేరాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండవద్దని వికాశ్ కిషన్ రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే ముందు ట్రిపుల్ టెస్ట్ ను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాల వంటి వాటి ప్రత్యేక విషయంలో రిజర్వేషన్లు 50 శాతం మించితే అభ్యంతరం లేదని ఎంఆర్ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను హైకోర్టు గుర్తు చేసింది. సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలించిన మీదట రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకుండా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అదే సమయంలో రాజ్యాంగంలోని 243 ఓ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9 ని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన బి.మాధవరెడ్డితో పాటు మరికొందరు వేర్వేరుగా తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై అన్ని వర్గాల వాదనలు విన్న హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై స్టే ఇచ్చింది. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై పిటిషనర్లు సుప్రీంకోర్టులో కూడా కేవియట్ దాఖలు చేశారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వవద్దని కోరారు.