Saina Nehwal : రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్.. కారణం ఇదే..?
తీవ్రమైన మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ కారణంగా భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆటకు వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని పాడ్‌కాస్ట్‌లో స్వయంగా వెల్లడించింది.
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆటకు వీడ్కోలు పలికారు. ఈ విషయాన్ని సైనా ఓ పాడ్‌కాస్ట్‌లో అధికారికంగా ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశారు. తీవ్రమైన మోకాళ్ల నొప్పుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
సైనా గత రెండేండ్లుగా ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చాలా సార్లు చెప్పారు కూడా. మోకాలు సరిగా లేదని, ఆర్థరైటిస్ ఉందని, కార్టిలేజ్ కూడా చాలా బలహీనంగా మారిందని, 8 లేదా 9 గంటలు ప్రాక్టీస్ చేయడం కష్టంగా ఉన్నట్లు గతంలో వెల్లడించారు. ఈ క్రమంలోనే గత కొన్నేళ్లుగా ఆటకు దూరంగానే ఉన్న సైనా.. తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు.
కథ ముగిసినట్లే.. అందుకే రాకెట్ వదిలేశా..
‘నేను రెండేళ్ల కిందటే ఆడటం ఆపేశాను. నా అంతట నేను ఆటలోకి వచ్చా. ఇప్పుడు నా అంతట నేను నిష్క్రమిస్తున్నా. ఇంకెంతమాత్రం ఆడగలిగే సామర్థ్యం లేనప్పుడు కథ ముగిసినట్లే. నా రిటైర్మెంట్‌ను ప్రకటించడం అంత పెద్ద విషయమని నేను అనుకోలేదు. అందుకే చెప్పలేదు. ఆటకు గుడ్‌బై చెప్పే సమయం ఇదే అని నాకు అనిపించింది. ఎందుకంటే మునుపటిలా నా మోకాళ్లు సహకరించడం లేదు. ఆర్థరైటిస్ వచ్చింది.. కార్టిలేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది.
గతంలోలాగా ఎక్కువ సమయం తీవ్రమైన శిక్షణను తట్టుకోలేకపోయాను. అందుకే ఈ నిర్ణయం తప్పనిసరి అయింది. ఇక నేను ఆ స్థాయిలో ఆడలేనని నా తల్లిదండ్రులు, కోచ్‌లకు చెప్పాల్సి వచ్చింది. గతంలో రోజుకు 8 నుంచి 9 గంటలు శిక్షణ తీసుకునేదాన్ని. ఇప్పుడు గంట, రెండు గంటల్లోనే మోకాలు వాపు వచ్చేస్తోంది. తీవ్రమైన నొప్పితో కాలు కదపడం ఇబ్బంది అనిపిస్తోంది. అప్పుడు అనిపించింది.. ఇక చాలు. ఇంతకంటే నేను కష్టపడలేను అని. అందుకే ఆటకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాను’ అని సైనా చెప్పుకొచ్చింది.
చివరగా 2023లో సింగపూర్ ఓపెన్‌లో
9 ఏళ్ల వయసులో బ్యాడ్మింటన్ ఆడడం ప్రారంభించింది సైనా. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. చివరి సారిగా 2023 సింగపూర్ ఓపెన్‌లో ఆడింది. ఆ తర్వాత నుంచి మోకాళ్ల నొప్పులతో పూర్తిగా విశ్రాంతిలో ఉన్నారు. 2016 రియో ఒలింపిక్స్‌లో ఎదురైన మోకాలి గాయం ఆమె కెరీర్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిందనే చెప్పాలి. అయినప్పటికీ, 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచి సత్తా చాటింది. కానీ ఆ తర్వాత కూడా గాయాలు వెంటాడుతూనే వచ్చాయి. 2024లోనే ఆర్థరైటిస్ వచ్చిందని సైనా చెప్పుకొచ్చింది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన సైనా.. ఆటకు వీడ్కోలు పలికినా ఆమె స్ఫూర్తి మాత్రం తరతరాలకు మార్గదర్శకంగా నిలవనుంది.
భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ చూస్తే అసూయ వేస్తోంది..
ఆరేండ్లుగా అంతర్జాతీయ పోటీలకు దూరైమైన సైనా.. ఇటీవలే క్రికెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ చూస్తే అసూయ వేస్తోంది’ అంటూ ఆమె విమర్శల పాలైంది. క్రికెట్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ‘టెన్నిస్, బ్యాడ్మింటన్ కంటే క్రికెట్ ఏమంత కష్టమేమీ కాదు. మనదేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ చూస్తే అసూహ వేస్తుంది. ఎందుకంటే.. క్రికెట్‌కు మాత్రమే క్రేజ్ ఉంటే భారత్ క్రీడా దేశం ఎలా అవుతుంది?. ఒలింపిక్స్‌లో చైనాతో పోటీ పడి పతకాలు ఎలా గెలవగలం’ అని అంది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. ఆమె ప్రతిభను, కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడారు.
కశ్యప్‌తో విడాకులు..
ప్రొఫెషనల్ లైఫ్‌కే కాదు.. వివాహ బంధానికి కూడా సైనా ఇటీవలే ముగింపు పలికిన విషయం తెలిసిందే. సహచర షట్లర్ పారుపల్లి కశ్యప్ (Parupalli Kashyap)తో 2018లో సైనాకు వివాహం జరిగింది. అయితే, వీరి భార్యభర్తల బంధం ఎక్కువరోజులు నిలవలేదు. పలు కారణాలతో ఇద్దరూ విడిపోయారు. ఏడేండ్ల వివాహ బంధానికి, 20 ఏండ్ల స్నేహానికి గతేడాది ముగింపు పలికారు. ఎంతో ఆలోచించి, చర్చించిన తర్వాత తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పరస్పర అవగాహనతో సహృద్భావ వాతావరణంలో విడాకులు తీసుకుంటున్నామని సైనా ప్రకటించారు. గతకొన్నేళ్లుగా ఆటకు దూరంగా ఉన్న సైనా.. విడాకుల తర్వాత తన ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. తల్లిదండ్రులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ.. విదేశీ టూర్లకు వెళ్తూ చిల్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు.
ఇవి కూడా చదవండి :
China Birth Rate : చైనాలో జనాభా సంక్షోభం.. భారీగా తగ్గిన జననాల రేటు.. 1949 తర్వాత ఇదే తొలిసారి
silver all time high| దూసుకపోతున్న వెండి ధర..ఒక్క రోజునే రూ. 12వేల పెంపు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram