ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్

హుజురాబాద్ బీఅరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు మంగళవారం హౌస్ అరెస్ట్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఇటీవల పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణల కు కౌంటర్ గా హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడిదల ప్రణవ్ బాబు ప్రత్యారోపణలు చేశారు

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్

విధాత : హుజురాబాద్ బీఅరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు మంగళవారం హౌస్ అరెస్ట్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఇటీవల పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణల కు కౌంటర్ గా హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడిదల ప్రణవ్ బాబు ప్రత్యారోపణలు చేశారు. కౌశిక్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి అని.. మానుకోటలో ఉద్యమకారులపై రాళ్లు విసిరిన ద్రోహి అని,ఎమ్మెల్యేగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రణవ్ ఆరోపించారు. మా ఆరోపణలు అబద్ధం అయితే చిల్పూర్ హనుమాన్ దేవాలయం లో ప్రమాణానికి రావాలని ప్రణవ్ బాబు సవాల్ విసిరారు. సవాల్ ను స్వీకరించిన పాడి కౌశిక్ రెడ్డి తాను హనుమాన్ ఆలయానికి వస్తానని ప్రకటించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పాడి కౌశిక్ రెడ్డి వీణవంకలోని తన స్వగృహం నుంచి హుజురాబాద్ మండలం చెల్పూరు గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే మోహరించిన పోలీసులు అడ్డుకొని ఆయనను గృహనిర్బంధం చేశారు. దీంతో ఆయన అక్కడే స్నానం చేసి తడి బట్టలతో దేవుడి ఫోటో పై తాను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ బొగ్గు బూడిద అక్రమ రవాణాలో 100కోట్ల అవినీతి చేయలేదని పొన్నం ప్రభాకర్ కూడా స్వయంగా ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. తాను ప్రమాణం చేసి ఎలా నిజాయితీని నిరూపించుకున్నానో అలాగే పొన్నం కూడా నిరూపించుకోవాలన్నారు. మంత్రి పొన్నం ప్రమాణం చేస్తే తాను క్షమాపణ చెప్తానన్నారు. అటు ప్రణవ్ ను కూడా హౌస్ అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఏ పార్టీ వారు కూడా చెల్పూరు రావద్దని.. వస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.