Onion Price | ఘాటెక్కిన ఉల్లి ధరలు.. హైదరాబాద్‌లో కిలో రూ. 60 పైనే
హైదరాబాద్ మహా నగరంలో ఉల్లి ధరలు ఘాటెక్కాయి. సామాన్యులకు ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమవుతున్న సామాన్యుడు.. అమాంతం పెరిగిన ధరలతో ఉల్లిని కొనలేని పరిస్థితి ఏర్పడింది

హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరంలో ఉల్లి ధరలు ఘాటెక్కాయి. సామాన్యులకు ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమవుతున్న సామాన్యుడు.. అమాంతం పెరిగిన ధరలతో ఉల్లిని కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఉల్లి లేని వంట వండటం అసాధ్యం. దీంతో గృహిణులు కూడా ఆందోళనకు గురవుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉల్లి ధర కిలో రూ. 60పైనే పలుకుతోంది. ఒక వేళ రెండు కిలోలు తీసుకునే వారికి.. కిలో రూ. 50 చొప్పున విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లో గత వారం రోజుల నుంచి ఉల్లి ధరలు పెరిగాయి. అంతకుముందు రూ. 100కు నాలుగు కిలోల ఉల్లిని విక్రయించారు. ఇప్పుడు ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో.. సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది.
వాస్తవానికి మహారాష్ట్రలోని లాసల్‌గావ్ మార్కెట్‌లో ఉల్లి టోకు ధర సగటున 30 శాతం నుంచి 50 శాతం వరకు పెరగటంతో దేశంలో భారీగా ధరల పెరుగుదల కొనసాగుతోంది. గిరాకీ, సరఫరా మధ్య అంతరం పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో అవసరానికి అనుగుణంగా ఉల్లి సరఫరా కావడం లేదు. ఇటీవలి రోజుల్లో ఉల్లి ధరలు 30 నుండి 50 శాతం పెరిగాయి. లాసల్‌గావ్ మండిలో బుధవారం సగటు ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.2130గా పలికింది. జూన్ 15 నాటికి ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.2250 వరకు పెరగవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మండీలకు ఉల్లి రాక తగ్గడంతో ధరలపై ప్రభావం పడింది. అంతేకాకుండా బక్రీద్ పండుగ కారణంగా ధరలు కూడా పెరిగాయని తెలుస్తోంది.
గతంలో లాసల్‌గావ్ మండికి రోజుకు 12 నుండి 15 వేల క్వింటాళ్ల ఉల్లి వచ్చేది. అయితే ప్రస్తుతం అది 6 వేల క్వింటాళ్లకు తగ్గటం మార్కెట్లో వేగంగా ధరలను పెంచుతోంది.దీంతో గత నాలుగు రోజులుగా ధరలపై ప్రభావం పడింది. కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వేడి, అకాల వర్షాల కారణంగా ఈ పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఇది కూడా ధరల పెరుగుదలకు దారితీసింది. దీంతో సరఫరాపై ప్రభావం పడింది. జూలై నెలాఖరు వరకు ఎలాంటి ఉపశమనం ఉండదని వ్యాపారులు చెబుతున్నారు.