విధాత : హైదరాబాద్ మహానగరాన్ని అత్యాధునిక సాంకేతికతతో డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకురావడానికి హెచ్ఎండీఏ( HMDA) కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్‌ను పూర్తిస్థాయి 3డీ ‘డిజిటల్ ట్విన్ సిటీ’గా మార్చేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలను తెరపైకి తెచ్చింది. డ్రోన్లు, 3డీ స్కానర్లు, హెలికాప్టర్లు, హై-రిజల్యూషన్ కెమెరాల సహాయంతో ప్రతి ప్రాంతాన్ని సవివరంగా మ్యాపింగ్ చేయనున్నారు. భవనాలు, రోడ్లు, నీటి-విద్యుత్ లైన్లన్నీ రియల్ టైమ్‌లో వీక్షించేలా డిజిటల్ మోడల్ రూపొందించనున్నారు. అత్యవసర స్పందన, ట్రాఫిక్, అక్రమ నిర్మాణాల నియంత్రణకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తిచేసేలా త్వరలో ఏజెన్సీని ఎంపిక చేయనున్నారు. ప్రపంచంలోని పలు ఆధునిక నగరాల్లో ఇప్పటికే డిజిటల్ ట్విన్ సాంకేతికత అమల్లో ఉంది. అదే తరహాలో హైదరాబాద్‌ను కూడా స్మార్ట్, డేటా ఆధారిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. ప్రాజెక్టు అమలుకు ఎంపికయ్యే ఏజెన్సీ దాదాపు రెండేళ్లలో డిజిటల్ ట్విన్ వ్యవస్థను రూపొందించనుంది. అనంతరం కొంతకాలం నిర్వహణ బాధ్యతలు కూడా అదే సంస్థ చేపట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలోని భవనాలు, రహదారులు, పార్కులు, చెట్లు, విద్యుత్ స్తంభాలు తాగునీటీ పైప్ లైన్లు, అండర్ గ్రౌండ్ కేబుల్స్, ప్రజా స్థలాలు వంటి భౌతిక నిర్మాణాలన్నింటినీ త్రీడీ రూపంలో రియల్ టైమ్‌లో వీక్షించే అవకాశం ఉంటుంది. సాధారణ మ్యాప్‌లతో పోలిస్తే మరింత స్పష్టమైన దృశ్య సమాచారాన్ని ఇది అందిస్తుంది. హెచ్ఎండీఏ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్‌తో పాటు ప్యూర్ అర్బన్ రీజియన్‌ను కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా డిజిటల్ మోడల్‌గా రూపొందించనున్నారు. మొత్తం మహానగరాన్ని ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 2,053 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రాంతాన్ని పూర్తిస్థాయి 3డీ ‘డిజిటల్ ట్విన్ సిటీ’గా రూపొందించనున్నారు.
డిజిటల్ ట్విన్ ప్రక్రియలో కొత్త రహదారి నిర్మాణం, పైపులైన్ మార్పులు లేదా ఇతర మౌలిక వసతుల పనులు ప్రారంభించే ముందు వాటిని డిజిటల్ ట్విన్‌లో పరిశీలించే అవకాశం ఉంటుంది. ఒక శాఖ చేపట్టే పనులపై మరో శాఖకు ముందుగానే సమాచారం అందేలా వ్యవస్థ పనిచేస్తుంది. అత్యవసర పరిస్థితులు, అగ్నిప్రమాదాలు, వరదలు లేదా ట్రాఫిక్ జామ్‌ల సమయంలో ఈ సాంకేతికత కీలకంగా ఉపయోగపడనుంది. పరిస్థితిని రియల్ టైమ్‌లో అంచనా వేసి, ఏ శాఖ ఎలా స్పందించాలనే అంశంపై వేగంగా నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది. దీంతో వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం మరింత సులభమవుతుంది. అక్రమ నిర్మాణాలు, ఫుట్‌పాత్ ఆక్రమణలు, ట్రాఫిక్ సమస్యలు వంటి అంశాలను కూడా అధికారులు కార్యాలయం నుంచే డిజిటల్ మోడల్‌లో పరిశీలించే వసతి ఏర్పడుతుంది.
