జాకెట్ కుట్టమని ఇచ్చిన చీరను పాడుచేశారు..లక్ష జరిమానా!

జాకెట్ కుట్టమని ఇచ్చిన చీరను అడ్డదిడ్డంగా కట్ చేసిన వివాదంలో వినియోగదారురాలికి రూ. 1లక్ష పరిహారం, రూ.10వేలు కేసు ఖర్చులకు చెల్లించాలంటూ హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-1 సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జాకెట్ కుట్టమని ఇచ్చిన చీరను పాడుచేశారు..లక్ష జరిమానా!

విధాత, హైదరాబాద్ : జాకెట్ కుట్టమని ఇచ్చిన చీరను అడ్డదిడ్డంగా కట్ చేసిన వివాదంలో వినియోగదారురాలికి రూ. 1లక్ష పరిహారం, రూ.10వేలు కేసు ఖర్చులకు చెల్లించాలంటూ హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-1 సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముషీరాబాద్‌ నియోజకవర్గం గాంధీనగర్‌కు చెందిన కె.అమృత వర్షిణి తన సోదరుడి పెళ్లి నేపథ్యంలో బహుమతిగా వచ్చిన ఆడపడుచు చీర(కంచి పట్టుచీర)ను బ్లౌజ్‌ మెటీరియల్‌తోపాటు స్టిచింగ్‌ కోసం 2025 జనవరి 25న బంజారాహిల్స్‌లోని ‘బీ డిజైన్‌ ఫర్‌ యూ’ దుకాణంలో ఇచ్చారు. ఫిబ్రవరి 12 సాయంత్రంలోగా డెలివరీ చేయాలని కోరుతూ అడ్వాన్స్‌గా రూ.2,500 చెల్లించారు. ఫిబ్రవరి 5న ఆమెకు ఫోన్‌ చేసిన ప్రతివాద సంస్థ సిబ్బంది.. బ్లౌజ్‌ మెటీరియల్‌ను తప్పుగా కట్‌ చేశాం క్షమించాలని, ఎవరూ కనిపెట్టలేని విధంగా మగ్గం వర్క్‌ చేసి రీజాయిన్‌ చేసిస్తామంటూ హామీ ఇచ్చారు. అయితే ఆమెకు చెప్పిన విధంగా ప్రతివాద సంస్థ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. పెళ్లికి ధరించలేని స్థితిలో బ్లౌజ్‌ ఉండటంతో ఆమె ఆవేదనకు, అగ్రహానికి లోనయ్యారు.

కానుకగా వచ్చిన తన చీరను పాడు చేసినందుకు పరిహారంగా కొత్త చీర ఇవ్వాలని, లేదంటే దాని ధర చెల్లించాలని డిమాండ్‌ చేశారు. చీరకు పరిహారంగా డబ్బులిస్తామని చెప్పిన ‘బీ డిజైన్‌ ఫర్‌ యూ’ దుకాణం నిర్వాహకులు ఆ తర్వాత స్పందించలేదు. దీంతో బాధితురాలు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. వాట్సప్‌ చాట్, ఫొటోలు, చీర, రసీదులను ఆధారాలుగా సమర్పించగా.. పరిహారం, కేసు ఖర్చులు చెల్లించాలని కమిషన్‌ తీర్పు వెలువరించింది.ఇది సేవాలోపంతోపాటు అనైతిక వ్యాపారంగా నిర్ధారిస్తూ, వినియోగదారురాలిని మానసికంగా ఇబ్బంది పెట్టినందుకు మొత్తంగా రూ.లక్ష పరిహారం, రూ.10 వేలు కేసు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది.