Hyderabad | హైద‌రాబాద్ : ఆ దంప‌తుల‌కు వివాహమై 18 ఏళ్లు అవుతుంది. కానీ సంతానం క‌ల‌గ‌లేదు. ఎన్నో ఆస్ప‌త్రుల చుట్టూ తిరిగిన‌ప్ప‌టికీ వారి ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. 18 ఏళ్లుగా సంతానం నిరీక్షించిన వారు.. చివ‌ర‌కు రూ. 1.70 ల‌క్ష‌ల‌కు ఓ మ‌గ‌శిశువును అక్ర‌మంగా కొనుగోలు చేసి, క‌ట‌క‌ట‌లాపాల‌య్యారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన మ‌ధుసూద‌న్, మీనా దంప‌తుల‌కు 18 ఏళ్ల క్రితం పెళ్లైంది. సంతానం కోసం ప్ర‌య‌త్నించారు కానీ ఫ‌లించ‌లేదు. దీంతో వారు ఓ మ‌గ శిశువు కోసం అన్వేషిస్తూ.. జియ‌గూడ‌కు చెందిన పోత‌రాజు సురేశ్‌ను సంప్ర‌దించారు. సురేశ్ త‌న‌కున్న స‌మాచారంతో మ‌ధ్య‌వ‌ర్తులైన ప‌ద్మ పాల్దియా, ఆమె భ‌ర్త గోపి పాల్దియాల‌ను సంప్ర‌దించాడు.

మోహ‌న్, సంధ్య‌తో బేరసారాలు ఆడి..

మొత్తానికి ఈ ముగ్గురు క‌లిసి.. మ‌గ‌బిడ్డ‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. మే 28న తుక్కుగూడ‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో ఓ గ‌ర్భిణి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇక 12 రోజుల అనంత‌రం ప‌సిబిడ్డ త‌ల్లిదండ్రులు మోహ‌న్, సంధ్య‌తో బేరసారాలు ఆడి.. ఆ శిశువును రూ. 1.70 ల‌క్ష‌ల‌కు విక్ర‌యించేందుకు ఒప్పించారు.

శిశు సంక్షేమ శాఖ అధికారుల‌కు ప‌క్కా స‌మాచారం

మధ్యవర్తి సురేష్‌ సమక్షంలో తండ్రి మోహన్‌, సంధ్య దంపతులు కొత్తూర్‌ మండలం జేపీ దర్గా వద్ద బాలుడిని మధుసూదన్‌, మీనా దంపతులకు రూ.1.70 లక్షలకు విక్రయించారు. ఈ ఘ‌ట‌న‌పై శిశు సంక్షేమ శాఖ అధికారుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మై విచార‌ణ చేయ‌గా గుట్టుర‌ట్టు అయింది. 12 రోజుల ప‌సిబిడ్డ‌ను హైద‌రాబాద్‌లోని శిశు విహార్‌కు త‌ర‌లించారు.

దత్తతకు చట్టపరమైన విధానాలు పాటించాకుండా

కాగా దత్తతకు చట్టపరమైన విధానాలు పాటించాకుండా ఈ లావాదేవీలు జరిగినట్లు తెలిసింది. కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాగా, ఘటన స్థలం నందిగామ పోలీస్‌స్టేసన్‌ పరిధిలోకి రావడంతో కేసును నందిగామ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేసినట్లు తెలిపారు. బాలుడిని నగరంలోని శిశు విహార్‌కు తరలించి, కేసులో ఎవరెవరు ఉన్నారో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.