Musi River | మూసీ కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Musi River | మూసీ నది( Musi River ) ప్రక్షాళనలో భాగంగా ఆ పరివాహక ప్రాంతంలో చేపట్టిన సర్వేపై హైడ్రా( HYDRAA ) కమిషనర్ రంగనాథ్( Ranganath ) స్పందించారు. ఆ సర్వేలో హైడ్రా భాగం కాలేదని, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మొద్దని ఆయన సూచించారు.

Musi River | హైదరాబాద్ : కూకట్‌పల్లి( Kukatpally )లోని యాదవ బస్తీలో గుర్రాంపల్లి బుచ్చమ్మ అనే మహిళ హైడ్రా( HYDRAA ) భయంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్న ఘటనపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్( AV Ranganath ) స్పందించారు. యాదవ బస్తీలో హైడ్రా ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. బుచ్చమ్మ ఆత్మహత్యపై తాను కూకట్‌పల్లి పోలీసులతో మాట్లాడినట్లు తెలిపారు. శివయ్య, బుచ్చమ్మ దంపతుల కూతుర్లకు రాసిచ్చిన ఇళ్లు కూకట్‌పల్లి చెరువు( Kukatpally Pond )కు సమీపంలోనే ఉన్నప్పటికీ ఎఫ్‌టీఎల్( FTL ) పరిధికి దూరంగా ఉన్నాయి. కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లను కూలుస్తారనే భయంతో ఆమె కూతుళ్లు బుచ్చమ్మను ప్రశ్నించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై బుచ్చమ్మ సూసైడ్ చేసుకుంది. అంతేకానీ ఆమె ఆత్మహత్యతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని రంగనాథ్ పేర్కొన్నారు.
ఇక రాష్ట్రంలో పలు చోట్ల జరుగుతున్న కూల్చివేతలను హైడ్రాకు ఆపాదించడం సరికాదన్నారు రంగనాథ్. కూల్చివేతలకు సంబంధించి మూసీ నది( Musi River ) పరిధిలో చేపట్టిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదని స్పష్టం చేశారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో శనివారం భారీగా ఇండ్లను కూల్చేస్తున్నట్లు సోషల్ మీడియా( Social Media )లో వస్తున్న వార్తలను నమ్మొద్దని సూచించారు. హైడ్రా కూల్చివేతల గురించి అనవసర భయాలు వద్దు.. పేదలు, మధ్య తరగతి ప్రజలు కూల్చివేతల వల్ల ఇబ్బందులు పడొద్దని, దీనికి సంబంధించి ప్రభుత్వం కచ్చితమైన సూచనలు జారీ చేసిందని రంగనాథ్ తెలిపారు.