IAS officer Rizvi Vs Minister Jupally : సీనీయర్ ఐఏఎస్ రిజ్వీ వీఆర్ఎస్..ఆయనపై మంత్రి జూపల్లి ఫిర్యాదు
ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేయగా సీఎస్ ఆమోదించారు. అంతకుముందు మంత్రి జూపల్లి కృష్ణారావు రూ. 1800 కోట్ల నష్టంపై రిజ్వీపై విచారణకు లేఖ రాశారు. కాగా కేటీఆర్ స్పందిస్తూ రూ. 500 కోట్ల టెండర్ గొడవలో ఇరుక్కునే రిజ్వీ వీఆర్‌ఎస్ తీసుకున్నారని ఆరోపించారు.

విధాత, హైదరాబాద్ : సీనీయర్ ఐఏఎస్,ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆయన వీఆర్ఎస్ అభ్యర్థనను సీఎస్ రామకృష్ణరావు ఆమోదించారు. అయితే అంతకుముందు రిజ్వీ వైఖరిని తప్పుబడుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎస్ రామకృష్ణా రావుకు రాసిన లేఖ సంచలనగా మారింది. ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ నిర్ణయాలపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రిజ్వీ చేసిన అవినీతిపై విచారణ చేపట్టాలని ఈ నెల 11న సీఎస్ కు లేఖ రాశారు. 2023 నుంచి 2025 వరకు రిజ్వీ తీసుకున్న నిర్ణయాలవల్ల ప్రభుత్వానికి రూ. 1800 కోట్లకు పైన నష్టం జరిగిందని జూపల్లి ఆరోపించారు. హోలోగ్రామ్ లేబుల్ స్టిక్కర్ టెండర్ 11ఏళ్లుగా ఒకే కంపెనీకి కట్టబెట్టారని, ప్రభుత్వ నిర్ణయాలను రిజ్వీ ఏమాత్రం పాటించలేదన్నారు. అతని అవకతవకలపై నిజాలు తెలిసేవరకు అతన్ని సర్వీసులో నుంచి తీసివేయవద్దని లేఖలో మంత్రి జూపల్లి కోరారు. దీంతో రిజ్వీ పై అంతర్గత విచారణ జరుపుతున్నారు.
ఇదిలా ఉండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రిజ్వీ నిజాయితీపరుడైన అధికారి. నిజాయితీ పరులైన అధికారులపై కాంగ్రెస్ నేతలు రౌడీయిజం, గుండాయిజం చేస్తున్నారని విమర్శించారు.. ఐఏఎస్ ఐపీఎస్ లను కూడా బెదిరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రూ. 500 కోట్ల టెండర్ పంచాయతీ వల్లనే రిజ్వీ వీఆర్ఎస్ కు అప్లై చేసుకున్నారని… రేవంత్ రెడ్డి అల్లుడు, జూపల్లి కొడుకు మధ్య టెండర్ పై గొడవ జరిగిందని, ఆ విషయంలోనే నలిగిపోయి రిజ్వీ వీఆర్ఎస్ కు అప్లై చేసుకున్నారని తెలిపారు.