సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ థీమ్‌తో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ 2.0ని నిర్వహించాలని.. స్టార్టప్, పరిశ్రమలు సాధించిన విజయాలపై ప్రదర్శన ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. గత ఏడాది కంటే ఘనంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని, ఇందుకోసం కమిటీలు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్‌ను మార్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న మౌలిక వసతుల కల్పనను ఈ సమ్మిట్‌లో ప్రధానంగా ప్రదర్శించనున్నారు.
తెలంగాణలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా, ఐటీ, డేటా, గ్రీన్ ఎనర్జీ, మాన్యుఫాక్చరింగ్ వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడుల సమీకరణకు, తెలంగాణకు చెందిన స్టార్టప్‌లు, స్థానిక పరిశ్రమలు సాధించిన రికార్డు విజయాలను, వినూత్నంగా రూపొందించిన కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు ప్రత్యేక ఎగ్జిబిషన్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో తీర్మానించినట్లుగా సమాచారం.
రాష్ట్రంలో 22-ఏ నిషేధిత భూములు, మెట్రో రైలు విస్తరణ వంటి కీలక అంశాలపై కేబినెట్ లో కీలక చర్చలు, నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సంక్షేమ పథకాల విస్తరణ, కొత్త లబ్ధిదారుల ఎంపిక, కొత్త ల్యాండ్ పూలింగ్ విధానం, చేయూత పింఛన్లు, స్మార్ట్ రేషన్ కార్డులు, హిల్ట్ పాలసీ, ఆహారకల్తీ వంటి అంశాలపై కేబినెట్ చర్చించింది. చట్టసభల్లో పోటీకి కనీస వయసును 21ఏళ్లకు తగ్గించే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసే విషయంపై కూడా చర్చించింది. కేబినెట్ నిర్ణయాలపై అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.
