నీట్ లీకేజీలో కేంద్ర మంత్రుల ప్రమేయం,27న పార్లమెంటు ముట్టడి … యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి

నీట్ పరీక్ష రద్దు చేసి, పేపర్ లీకేజీ నిందితులను శిక్షించడంతో పాటు తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తలపెట్టిన బీజేపీ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది

నీట్ లీకేజీలో కేంద్ర మంత్రుల ప్రమేయం,27న పార్లమెంటు ముట్టడి … యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి

విధాత, హైదరాబాద్ : నీట్ పరీక్ష రద్దు చేసి, పేపర్ లీకేజీ నిందితులను శిక్షించడంతో పాటు తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తలపెట్టిన బీజేపీ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. గాంధీ భవన్ వద్ద నుంచి బీజేపీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన యూత్ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలను పోలీసులు గాంధీభవన్ వద్దే అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట సాగింది. బారికేడ్లను తోసుకుంటూ బీజేపీ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయా సంఘాల నేతలను పోలీసులు నిలువరించి అరెస్టు చేశారు.

నీట్ లీకేజీల కేంద్ర మంత్రుల ప్రమేయం : యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి
నీట్ లీకేజీ వ్యవహారంలో 14 మంది కేంద్ర మంత్రుల ప్రమేయం ఉందని, వారి పిల్లల కోసం పేపర్ లీకేజీ చేయించారని, విచారణ జరిపితే బీజేపీ నేతల బండారం బయటపడుతుందని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. యూత్ కాంగ్రెస్ చేపట్టిన బీజేపీ కార్యాలయం ముట్టడి ఆందోళనలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రుల పిల్లల భవిష్యత్ కోసం నీట్ పేపర్ లీకేజ్ చేసి 24లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టారన్నారు. అసలు నిజాలు బయటపడితే.. కేంద్ర ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నారు. అందుకే నీట్ పరీక్ష రద్దు చేసేందుకు కేంద్రం వెనకడుతుందని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్య శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ రద్దు చేసి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ బీజేపీ ఎంపీలను రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు. అలాగే ఈ నెల 27 వ తేదీన యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపడతామని తెలిపారు.