బీఆరెస్‌వి మేనేజ్ గెలుపులు..కేసీఆర్‌పై మాజీ మంత్రి జూపల్లి ఫైర్
అహంకారానికి మారుపేరే ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు.

- బీజేపీ అభ్యర్థితో మేనేజ్ చేసుకోమన్నడు
- ప్రత్యర్థిని మేనేజ్ చేసుకునే ఖర్మ నాకు లేదు
- ఆనాటి నుంచే బీజేపీతో టచ్‌లో కేసీఆర్
- అహంకారి ముఖ్యమంత్రి కేసీఆర్
- అందుకే ధర్నా చౌక్ ఎత్తివేసిండు
- కమ్యనిస్టులను తోక పార్టీలన్నడు
- ప్రగతిభవన్‌లోకి మంత్రులకు నో ఎంట్రీ
- బానిస బతుకులు బతకాలా?
- మేనేజ్‌మెంట్ బతుకులు మీవి
విధాత, హైదరాబాద్: అహంకారానికి మారుపేరే ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. బీఆరెస్ బీఫాంల పంపిణీ సందర్భంగా కేసీఆర్ తన పేరును ప్రస్తావించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ అహంకారి అని మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడున్నరేళ్లు మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉంటూ రాజీనామా చేశానన్నారు. నిజంగా అహంకారం ఉన్నోళ్లు రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తరువాత వందకు వందశాతం అహంకార పూరితంగా మాట్లాడుతూ వచ్చింది కేసీఆరేనని స్పష్టం చేశారు. ఆ అహంకారంతోటే వేల కోట్లు పోగేసుకున్నారని, మేనేజ్ చేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. తాను బీఆరెస్‌లో ఉన్నప్పుడు తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిని మేనేజ్ చేసుకోవాలని కేసీఆర్ సూచించారని ఆయన వెల్లడించారు. అంటే ఆ రోజుల్లోనే కేసీఆర్ బీజేపీతో టచ్‌లో ఉన్నట్టేనని అన్నారు. మాట్లాడితే బుద్ధి ఉండాలన్న జూపల్లి.. తాను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మేనేజ్ చేయడానికి, మీ లాగ అవినీతికి పాల్పడటానికి కాదని చెప్పారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థితో మేనేజ్ చేసుకునే ఖర్మ తనకు పట్టలేదన్నారు. నీ బిడ్డ కవిత మేనేజ్ చేయలేకనే ఓడిపోయిందా? అని ప్రశ్నించారు.
దుర్మార్గంగా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. అహంకారంతో ఏ ఒక్క రోజు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయలేదని ఆరోపించారు. అహంకారంతోటే ఏ ఒక్క అమరవీరుల కుటుంబానికీ వెళ్లి పరామర్శించలేదన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. ఈ అహంకారంతోనే ఆమె నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆయన అహంకారం వల్లే మంత్రులకు సైతం ప్రగతి భవన్ గేట్లు తెరుచుకోవటం లేదని మండిపడ్డారు. ఇదే అహంకారం, అధికార మదం, డబ్బుమదంతో ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీలను కూడా కలువడం లేదని ఆరోపించారు. అడ్డగోలుగా కోట్ల రూపాయలు సంపాదించిన మీకు డబ్బు, పదవులు ఉండవచ్చు కానీ నా కాలి గోటికి కూడా సరిపోరని తేల్చి చెప్పారు.
నువ్వు వస్తవా? నీ కొడుకు వస్తడా? నీ అల్లుడు వస్తడా? ఎక్కడి వస్తరో రండి. ఏ విషయంలో గొప్పోళ్లో చర్చకు సిద్ధం అని జూపల్లి సవాలు విసిరారు. అవినీతిలో, మాటలు మార్చడం గొప్పోళ్లని మండిపడ్డారు. ఏ ఒక్క విషయంలో కూడా తనను వేలు పెట్టి చూపించే అర్హత కేసీఆర్‌కు లేదని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ధర్నా చౌక్‌ను అహంకారంతోనే ఎత్తి వేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో సహకరించిన కమ్యూనిస్టు పార్టీలను అహంకారంతో, డబ్బు మదంతోనే తోకపార్టీలని అంటున్నారని విమర్శించారు. తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియాకు కృతజ్ఞతలు చెప్పి, అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని చూశారని కేసీఆర్‌పై జూపల్లి మండిపడ్డారు. కాంగ్రెస్‌ను లేకుండా చేయడం కేసీఆర్ వల్ల కాదని చెప్పారు. ఇప్పటికే ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు.
మ్యానిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని మాట్లాడిన కేసీఆర్.. నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఏమైపోయే? అని ప్రశ్నించారు. పగటి వేషగాడి మాదిరిగా ఎన్నికలు వచ్చినప్పుడల్లా మాటలు మారుస్తున్నామని మండి పడ్డారు.
ప్రగతిభవన్‌లోనే బానిస బతుకులు
కేటీఆర్ ఢిల్లీ గులాములని మాట్లాడుతున్నాడన్న జూపల్లి.. ప్రగతి భవన్ బానిస బతుకుల కంటే అక్కడ ఎవరు పోయినా మాట్లాడే అవకాశం ఉందని తెలిపారు. దేశ పార్టీ అధ్యక్షుడు, సోనియా, ఇతర నాయకులు ఎవరైనా సరే.. వెళ్లి కలిస్తే.. మాట్లాడి పంపిస్తారని, కానీ ఇక్కడ మంత్రులకు కూడా ప్రగతి భవన్ గేట్లు తెరువరని విమర్శించారు. అవసరానికి వాడుకొని వదిలేస్తారన్నారు. కేసీఆర్ నోరు తెరుస్తే అబద్ధాలు మాట్లాడుతారని ఆరోపించారు. ప్రజలకు కేసీఆర్ మీద విశ్వసనీయత పోయిందన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఉద్యోగాలిస్తానని ఉద్యమ సమయంలో జోగులాంబ దేవాలయంలో చెప్పి, పాలమూరు రంగారెడ్డి నిర్వాసితులపై చర్చ సందర్భంగా ఈ విషయాన్ని గుర్తు చేస్తే 35 సంవత్సరాల తరువాత ఉద్యోగాలు ఎలా ఇస్తారని కేసీఆర్ ప్రశ్నించారని, దీనికి హరీష్‌రావు సాక్ష్యమన్నారు. ఆనాడు మీరే ఈ విషయాన్ని చెప్పారని గుర్తు చేస్తే.. నేనెప్పుడు మాట్లాడిన? అన్నారని తెలిపారు.
అధికారం కోసం అర్రాజ్ పాట
అధికారం కోసం కేసీఆర్ అర్రాజ్ పాట పాడుతున్నారని జూపల్లి విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ప్రకటించిన తరువాత బీఆరెస్ మ్యానిఫెస్టోలో ఒక్కో వేయి రూపాయలు ఎక్కువ ప్రకటించాంటే ఓట్లను అర్రాజ్ పాడుతున్నట్లే గదా? అని ప్రశ్నించారు. చేసిన ప్రతి పనిలో కమీషన్లు తీసుకున్నారని జూపల్లి ఆరోపించారు. రూ.1.80 లక్షల కోట్ల కాంట్రాక్ట్‌ల్లోనూ మేనేజ్ చేశారని ఆరోపించారు. తనను బీజేపీ క్యాండిడేట్‌ను మేనేజ్ చేసుకోవాలని చెప్పిన కేసీఆర్‌కు.. అదే అలవాటని ఫైర్ అయ్యారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌లో ఎవరికైనా టికెట్ రాకపోతే.. డబ్బులిస్తం, పదవులిస్తం రండి అంటూ మేనేజ్ చేస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలను మరోసారి నమ్మి మోస పోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కేసీఆర్‌కు రెండు సార్లు అవకాశం ఇచ్చారని, ఈ సారి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలన్నారు.