పది రోజులు విదేశాల్లో తిరిగి ఉత్త చేతులతో వచ్చాడని ఎద్దేవా
తెలుగు రాష్ట్రాల సీఎంలు గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్‌కు రావాలి
అప్పుడే భారీగా పెట్టుబడులు వస్తాయని వ్యాఖ్యలు
KA PAUL | పెట్టుబడుల సాధన లక్ష్యంతో పది రోజులతో పాటు అమెరికా, దక్షిణ కొరియాలలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి చివరకు ఉత్త చేతులతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ ఎద్దేవా చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలు ఆర్థిక సమస్యల్లో ఉన్నాయని, రెండు రాష్ట్రాల సీఎంలను అమెరికా తీసుకుపోతానని గతంలో రేవంత్ రెడ్డికి చెప్పానని, ఇప్పటికే సీఎంలతో అనేక మీటింగ్‌లు పెట్టానన్నారు. అమెజాన్, టెస్లా సీఈవోలను కలుద్దామని చెప్పానని, వారం రోజుల్లో ఆస్టిన్, డల్లాస్, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్‌తో పాటు మరిన్ని నగరాలకు వెళ్దామని మాట కూడా ఇచ్చానన్నారు. అయితే సీఎం రేవంత్‌రెడ్డి జనవరి నుంచి ఇప్పటి వరకు నాతో కలిసి రాలేదని, ఇప్పుడు ఎన్ని ట్రిప్పులు వేసినా రాజకీయ నాయకులను ఎవరు నమ్మరని రేవంత్ రెడ్డికి ఇప్పుడు అర్థమైందని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. అమెరికాలో కొన్ని వేల కంపెనీలు ఉంటాయని,. ఒక్క కంపెనీ అయినా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందా..? అంటే లేదని, కేవలం రేవంత్ రెడ్డి ఖాళీ చేతులతో తిరిగొచ్చారన్నారు. అక్టోబర్ 1,2,3 తేదీల్లో లాస్ ఎంజెల్స్‌లో గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ జరుపుతున్నామని, కాంగ్రెస్ పార్టీల సహా 18 పార్టీలు మద్దతు పలికాయని, ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలను పిలిచానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ కు మద్దతిస్తున్నట్టు ప్రకటించారని గుర్తుచేశారు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేక పోతున్నానని ఏపీ సీఎం చంద్రబాబు కూడా బాధ పడ్డారని, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, రాష్ట్రం కోసం చంద్రబాబుతో కలిసి పని చేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు. నన్ను కలవడానికి చంద్రబాబు సిద్ధమా? అంటూ పాల్ ప్రశ్నించారు. సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ కు వస్తే అనేక మంది పారిశ్రామిక వేత్తలను కలిపిస్తానని కేఏ పాల్ వెల్లడించారు. హైకోర్టులో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ఇవ్వలేదని పిల్ దాఖలు చేశానని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా వస్తే మనకు రాయతీలు వస్తాయన్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి ఏమీ ఇవ్వలేదని, అమరావతి కి 15వేల కోట్లు అప్పు ఇస్తామని అంటుందని, అప్పు మనకెందుకని ప్రశ్నించారు. ఏపీ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే చంద్రబాబు అమెరికా రావాలని సూచించారు. లక్ష కోట్లు పెట్టుబడులు తీసుకొని వస్తానని, తీసుకరాకపోతే ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టనని కేఏ పాల్ ప్రకటించారు.