కవిత మాటలపై ట్రోలింగ్.. వెంటాడుతున్న బీఆర్ఎస్ మాటలు!

తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత చెబుతున్న మాటలకు..గతంలో ఆమె బీఆర్ఎస్ నాయకురాలిగా, కేసీఆర్ బిడ్డగా మాట్లాడిన మాటలకు లింక్ పెడుతూ సోషల్ మీడియాలో సాగుతున్న ట్రోలింగ్ ఆసక్తికరంగా సాగుతుంది

కవిత మాటలపై ట్రోలింగ్.. వెంటాడుతున్న బీఆర్ఎస్ మాటలు!

విధాత : తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత చెబుతున్న మాటలకు..గతంలో ఆమె బీఆర్ఎస్ నాయకురాలిగా, కేసీఆర్ బిడ్డగా మాట్లాడిన మాటలకు లింక్ పెడుతూ సోషల్ మీడియాలో సాగుతున్న ట్రోలింగ్ ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి నా సస్పెండ్ కు ప్రధాన కారణాలలో కాళేశ్వరం అవినీతిని ప్రశ్నించడమే అని టీఆర్ఎస్ వ్యవస్థాపకురాలిగా కవిత చెబుతూ వస్తుంది. అయితే కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు కవిత మాట్లాడిన మాటలను ఆమె రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.  తెలంగాణ హక్కు 200టీఎంసీలను కాపాడుకునేందుకు కేసీఆర్ కాళేశ్వరం కట్టి నాలుగేళ్లుగా ప్రతి ఏడాది 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నందుకు..తెలంగాణను కోటీ ఎకరాల మాగాణి చేసినందుకు చూసి ఓర్వలేక..  నోటిసులిచ్చారా అంటూ మండిపడ్డారు.

నిన్న మీట్ ది ప్రెస్ లో టీఆర్ఎస్ అధినాయకురాలిగా కవిత మాట్లాడుతూ కేసీఆర్ లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేకపోయారని, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేకపోయారని దీంతో తెలంగాణ హక్కు జలాలను రాష్ట్రం వినియోగించుకోలేపోతుందంటూ విమర్శించారు. అలాగైతే కవిత బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ లోకి మారిపోయిన నెలల వ్యవధిలోనే కాళేశ్వరం ఆయకట్టులో 19లక్షలు ఎకరాల తేడా ఎలా వచ్చిందంటూ ఆమె ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
ఇన్ని అబద్దపు మాటలు మాట్లాడి కవిత ఏం రాజకీయం చేస్తారంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.

టీజీఐఐసీ భూములపై నాడు గగ్గోలు..నేడు ఊసులేదెందుకో..

గతంలో ఏడాది క్రితం బీఆర్ఎస్ లో ఉన్న కవిత పెద్ద బాంబు పేలుస్తున్నానంటూ పరిశ్రమల స్థాపన కోసం TSIIC (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) ద్వారా 1.75 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకును కేసీఆర్ సిద్ధం చేశారని చెప్పుకొచ్చారు. ఈ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకుంటుందని, తాకట్టు పెట్టి వేల కోట్ల అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో కాంగ్రెస్ 16 నెలల పాలనలో రేవంత్ రెడ్డి రూ.1.8 లక్షల కోట్ల అప్పు తీసుకున్నప్పటికీ, అనేక సంక్షేమ పథకాలను అమలు చేయలేదని కవిత ఆరోపించారు. ఆ డబ్బును అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా ఉపయోగించలేదని ఆమె అన్నారు.

గతంలో అప్పుగా తీసుకున్న డబ్బులో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేవలం రూ.80,000 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించారని, మిగిలిన రూ.1 లక్ష కోట్లను పెద్ద కాంట్రాక్టర్లకు పంచిపెట్టారని, ఇందులో రేవంత్ రెడ్డి భారీ కమీషన్లు జేబులో వేసుకున్నారని ఆమె ఆరోపించారు. మరి ఆనాటి తన ఆరోపణలపై ఇప్పుడు టీఆర్ఎస్ అధినాయకురాలిగా కవిత ఇప్పటిదాక మాట్లాడలేదని..దీనిపై ఏం మాట్లాడుతారో వేచి చూడాల్సి ఉందని..ఆమె ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు.

కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తులం బంగారం, జాబ్‌ క్యాలెండర్‌ అమలును విస్మరించారని తాజాగా ఆరోపించిన కవిత.. రాష్ట్రం అంతటా తిరిగి 1,000 రోజుల్లో కచ్చితంగా రేవంత్‌ సర్కారును గద్దె దించుతాం అన్నారు. మరి కేసీఆర్ గతంలో ప్రకటించిన కేజీ టూ పీజీ ఉచిత విద్య, దళిత సీఎం, మూడెకరాల భూమి, బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్ల హామీలు, ఇంటికో ఉద్యోగం హామీలపై బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కవిత ఏనాడు మాట్లాడలేదని..మరి ఇప్పుడు వాటిపై ఆ పార్టీని నిలదీస్తారా అని కాంగ్రెస్ వాదులు ప్రశ్నిస్తున్నారు.