ప్రజల మైండ్ వాష్ చేసేందుకే స్మార్ట్ మీటర్లపై డెమో: కవిత ఫైర్

కేంద్రం తెచ్చిన కొత్త పథకంపై సంతకం పెట్టి రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తోంది అని, అదానీ వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు, ప్రజలకు నష్టం చేసేందుకు ఈ స్మార్ట్ మీటర్లను తెస్తున్నారని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు

విధాత, హైదరాబాద్ : కేంద్రం తెచ్చిన కొత్త పథకంపై సంతకం పెట్టి రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తోంది అని, అదానీ వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు, ప్రజలకు నష్టం చేసేందుకు ఈ స్మార్ట్ మీటర్లను తెస్తున్నారని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. దీనికి సంబంధించి ప్రజల మైండ్ వాష్ చేసేందుకు నెక్లెస్ రోడ్ లో డెమో కార్యక్రమం కూడా నిర్వహిస్తుందని మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో టీజీఎస్ఎస్డీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవర్ ఎక్స్ పో – 2026ను సందర్శించి స్మార్ట్ మీటర్ల డెమో కార్యక్రమాన్ని పరిశీలించారు.

ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి సర్కార్ పేదల పక్షాన కాకుండా పెద్దల పక్షాన ఉన్నది మరోసారి నిరూపించుకుందని విమర్శించారు. కార్పొరేట్లతో కుమ్మకై విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టి పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీ ఎత్తేయాలని కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లి వాళ్లు తీసుకొస్తున్న తలా తోక లేని విధానాలను సమర్థిస్తోందని, అదానీలకు కొమ్ముకాస్తూ స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తుందని కవిత విమర్శించారు. గృహ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా వ్యతిరేకిస్తోందని కవిత స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్ల విధానాన్ని తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ప్రజల తరపునా పోరాడుతుందని తెలిపారు.

 

Latest News