Kavitha Fires On Hydra Demolition | పెద్దోళ్లను వదిలి పేదలపై ప్రతాపమా? : హైడ్రాపై కవిత మండిపాటు

హైడ్రా కూల్చివేతలపై మండిపడిన కవిత.. పెద్దోళ్లను వదిలి పేదలపై ప్రతాపమా? పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్.

Kavitha Fires On Hydra Demolition | పెద్దోళ్లను వదిలి పేదలపై ప్రతాపమా? : హైడ్రాపై కవిత మండిపాటు

విధాత, హైదరాబాద్ : ప్రభుత్వ భూములు ఆక్రమించారంటూ కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా పెద్దోళ్లను వదిలి పేదలపై ప్రతాపం చూపడం ఏమిటని..కోర్టు చెప్పినా సరే ఆదివారం ఇళ్లు కూల్చుతారా? అని బీఆర్ఎస్ బహిష్కృత ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. పేదల ఉసురు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం గాలిపోచమ్మ బస్తీలో హైడ్రా కూల్చివేతల బాధితులను పరామర్శించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ హైడ్రా కూల్చేవేత బాధితులైన పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రూ. 50 వేలు సాయం అందించాలని డిమాండ్ చేశారు. మళ్లీ హైడ్రా బుల్డోజర్ వస్తే నేనే అడ్డుగా నిలుచుంటానన్నారు. ముందు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాలలో కబ్జాలు తొలగించాలని డిమాండ్ చేశారు. కూలీ చేసుకొనే వాళ్ల ఇళ్లను కూల్చేస్తూ హీరోయిజం చూపిస్తున్నారా? అని మండిపడ్డారు. వెంచర్లు చేసి అమ్మటంతో చాలా మంది లక్షలు పెట్టి కొనుక్కున్నారని, వాళ్లకు ప్రభుత్వం డబ్బులు తిరిగి చెల్లించాలని, ఎకరాల కొద్దీ పెద్దవాళ్లు చేసిన కబ్జాలు ప్రభుత్వానికి కనబడటం లేదా? అని..ముందు వాటిని కూలగొట్టండని కవిత డిమాండ్ చేశారు. పేదవాళ్ల భూములు మాత్రమే ప్రభుత్వానికి కనబడుతున్నాయా? అని నిలదీశారు. పేదలకు అన్యాయం చేస్తే ప్రభుత్వానికి ఉసురు తాకుందన్నారు.

సెలవు దినాల్లో కూల్చివేతలతో కోర్టు ధిక్కారం

స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వైఎస్ ప్రభుత్వంలో భూములు ఇచ్చారని..ఆనాడే కంచె వేసి ఉంటే ఈ భూములు కబ్జా అయ్యేవి కాదు అని కవిత పేర్కొన్నారు. పోచమ్మ బస్తీ చుట్టు పక్కల ఉన్న దాదాపు 4 వందల ఎకరాల్లో కబ్జాలు జరిగాయని, చాలా ప్రభుత్వాలు మారినప్పటికీ భూముల రక్షణను పట్టించుకోలేదు అన్నారు.
ఇప్పుడు హైడ్రా హడావుడిగా వచ్చి పెద్ద వాళ్ల జోలికి పోకుండా…పేదల ఇళ్లను రాత్రికి రాత్రికి కూలగొట్టటం దారుణం అని కవిత తప్పుబట్టారు. చిన్న పిల్లలను.. మరోపక్క పండుగ ఉండగా.. ఈ సమయంలో వారి ఇళ్లు కూలగొట్టటం అమానుషం అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రాకు గతంలోనే కోర్టు శని, ఆదివారాలు ఎవరి జోలికి వెళ్లవద్దని స్పష్టంగా చెప్పింది అని, వాళ్లకు న్యాయం కోసం కోర్టుకు వచ్చే అవకాశం ఇవ్వాలని కోరింది అని కవిత తెలిపారు. అయినప్పటికీ ఆదివారం రోజు ఇళ్లను కూలగొట్టి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారన్నారు. గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్లు ఉన్న వాళ్ల ఇళ్లను కూడా కూలగొట్టారని.. పిల్లలు, ముసలి వాళ్లు ఉన్న కూడా పట్టించుకోలేదన్నారు. పైగా నోటీసులు ఇచ్చామంటూ అబద్దాలు చెబుతున్నారని కవిత మండిపడ్డారు. పండుగ పూట పేదల ఉసురు తీసుకోకండని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండని సీఎం

మళ్లీ ఈ నెల 6 లోపు హైడ్రా వాళ్లు వస్తామని చెప్పారని..ఆ లోపు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఇక్కడ మొత్తంగా 200 లోపు కుటుంబాలు మాత్రమే ఉన్నాయని. వారందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని కోరారు. 6 వ తేదీ లోపు బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. లేదంటే హైడ్రా బుల్డోజర్ కు అడ్డంగా నేను నిలుచుంటానన్నారు. బాధితులతో కలిసి వారి వివరాలు తీసుకొని నేనే వస్తానని.. ఎక్కడకి రమ్మంటారో చెప్పండి అని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే మున్సిపల్ మంత్రిగా ఉండి గడీలో ఉంటున్నాడని..ఆఫీస్ కు, సెక్రటేరియేట్ కు రావడం లేదని..ప్రజలు ఎక్కడ తమ బాధలు చెప్పుకోవాలి అని కవిత ప్రశ్నించారు. ప్రజా పాలన పేరుతో సమస్యలు చెప్పుకోవాలని అంటున్నారని..రెండేళ్లలో ముఖ్యమంత్రి ఒక్కసారి మాత్రమే ప్రజాపాలన వద్దకు వచ్చాడని కవిత గుర్తు చేశారు.