Kavitha : ఏప్రిల్ 25న కొత్త పార్టీ ప్రకటన కవిత

కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 25న కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్నారు. మేడ్చల్‌లో జరిగే సభలో పార్టీ పేరు, జెండా, ఎజెండా వెల్లడించనున్నారు.

Kavitha : ఏప్రిల్ 25న కొత్త పార్టీ ప్రకటన కవిత

విధాత, హైదాబాద్ : తన కొత్త రాజకీయ పార్టీని ఏప్రిల్ 25న అధికారికంగా ప్రకటించబోతున్నట్లుగా తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. శుక్రవారం నిజామాబాద్ రఘునాథ ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 25న మేడ్చల్ లో మునిర్ బాద్ ఎగ్జిట్ 6 అద్వయ కన్వెన్షల్ హాల్ వేదికగా ఉదయం 8గంటలకు కొత్త రాజకీయ పార్టీ ప్రకటన ఉంటుందని కవిత తెలిపారు. పార్టీ పేరు, జెండా, ఎజెండా అన్ని కూడా అక్కడే వెల్లడిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో మార్పు కోరుతూ పెట్టబోతున్న మా పార్టీలో యువత, మహిళలు, బీసీలకు, ఉద్యమకారులు పెద్దపీట వేస్తామన్నారు. ఆయా వర్గాలతో పాటు దళిత, గిరిజన, ఆదివాసీ, మైనార్టీలు, ఉద్యమకారులు అంతా కూడా ఊరూరా తరలిరావాలని కోరారు.

మా పార్టీ ఏ రాజకీయ పార్టీకి బీ పార్టీగా ఉండబోదని, తెలంగాణ రాజకీయాల్లో మాదే నెంబర్ వన్ గా ఎదుగబోతుందన్నారు. ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్న అంశంపై పార్టీ ఏర్పాటు పిదప కేడర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో లాబీ చేస్తా.. గల్లీలో పనిచేస్తానని.. గతంలో నిజామాబాద్ పెద్దపల్లి రైల్వేలైన్ ను ఇదే పద్దతిలో సాధించి చూపానన్నారు. అవసరమైతే నిజామాబాద్ జిల్లా నుంచే పోటీ చేస్తానన్నారు. మా పార్టీ తెలంగాణకు దారిదీపంగా నిలవబోతుందన్నారు. తెలంగాణలో ఇప్పుడు ప్రాంతీయ పార్టీ లేదని, మా పార్టీనే తెలంగాణ ప్రాంతీయ పార్టీగా 95శాతం రాష్ట్ర ప్రయోజనాలు, హక్కుల కోసం పనిచేస్తుందని, 5శాతం దేశీయ రాజకీయాలు, సమస్యలపై స్పందిస్తుందన్నారు. బీఆర్ఎస్ కేడర్ కూడా మా పార్టీతోనే నడవబోతుందని కవిత ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

తెలంగాణ ఉద్యమకారులకు కార్పోరేషన్, 200గజాల ఇంటి స్థలం డిమాండ్ అమలుకు మా పార్టీ ప్రధానంగా కృషి చేస్తుందని కవిత స్పష్టం చేశారు. పార్టీ ఏర్పాటు సందర్భంగా పార్టీ ఎజెండాను, లక్ష్యాలను ప్రకటిస్తామని తెలిపారు. పార్టీ ప్రకటనకు ముందు గంగాస్నానం, కాశీలో మహాశివుడికి అభిషేకాది పూజలు నిర్వహించబోతున్నామని తెలిపారు.

పార్టీ ఎజెండా ఖరారులో యువత, మహిళలు, మేధావులు, నిపుణులు తమ సలహాలను మేం ఇచ్చే వాట్సాప్ నెంబర్ కు పంపించవచ్చని తెలిపారు. అన్ని వర్గాల ప్రతినిధులతో భేటీ అవుతామని వెల్లడించారు. నిజామాబాద్ ప్రజలు గతంలో నన్ను ఎంపీగా గెలిపించి నాకు దేశవ్యాప్తంగా గుర్తింపు కల్పించారని, నా కొత్త పార్టీని కూడా ఆశీర్వదించాలని కోరారు. ప్రజలు ఇన్నాళ్లుగా మగవాళ్లు నడిపిన రాజకీయ పార్టీలను చూశారని…ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయని, ఇకమీదట ఆడబిడ్డలు నడిపే పార్టీలు చూడబోతున్నారన్నారని తెలిపారు. ప్రతి ఊరు నుంచి ఆడబిడ్డలు అంతా కొత్తా పార్టీ ప్రకటన కార్యక్రమానికి తరలిరావాలని కోరారు.

ఇవి కూడా చదవండి :

Suyodhana Review: ప్రియదర్శి.. ‘సుయోధన’ సినిమా రివ్యూ!
Bandi Sanjay : సింగర్ గా మారిన కేంద్ర మంత్రి బండి సంజయ్