KCR Roars in Jagtial: ‘First Signature Will Remove HYDRA’, Launches Fierce Attack on Congress
విధాత తెలంగాణ డెస్క్ | 20 ఏప్రిల్ 2026 | హైదరాబాద్:
KCR Roars in Jagtial: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కేసీఆర్ గొంతు ఖంగున మోగింది. కొంతకాలం నిశ్శబ్దంగా కనిపించిన బీఆర్ఎస్ అధినేత, జగిత్యాల వేదికగా ఉద్యమకాలం నాటి దూకుడు, పదునుతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, రైతుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి వర్గం ఇబ్బందుల్లో ఉందన్నారు. ముఖ్యంగా హైడ్రా వ్యవస్థపై మండిపడిన ఆయన, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే తొలి సంతకంతోనే దాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ యాసలో, చురకలతో, సామెతలతో, సెటైర్లతో నిండిన కేసీఆర్ ప్రసంగం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
హైడ్రాపై కేసీఆర్ ఫైర్.. పేదోళ్ల కొంపలు కూల్చడమేనా?
జగిత్యాల సభలో కేసీఆర్ ప్రధానంగా హైడ్రా అంశాన్ని ప్రస్తావించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చడం, వారిని భయాందోళనలకు గురిచేయడం దారుణమని మండిపడ్డారు. “ఈ అందానికి బోడి ముండ హైడ్రాను తీసుకొచ్చిన్రు.. మీకేం కావాలి.. పేదోళ్ల కొంపలు కూల్చడమేనా?” అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో హైడ్రా ఉందని, నిజామాబాద్‌కు నిడ్రా తీసుకొస్తామంటున్నారని, రేపు జగిత్యాలకు జిడ్రా అంటరేమో అంటూ సెటైర్లు వేసి జనాలను నవ్వుల్లో ముంచెత్తారు. మూసీని అభివృద్ధి చేయడం ఎవరూ వ్యతిరేకించరని, కానీ వేల ఇళ్లు కూల్చడం ఎలా న్యాయం అవుతుందని నిలదీశారు. మూసీ సుందరీకరణ పేరుతో జరుగుతున్నది రియల్ ఎస్టేట్ దందా తప్ప అభివృద్ధి కాదన్నారు.
బీఆర్ఎస్ వచ్చుడు ఖాయం.. హైడ్రాను పీకేసుడు ఖాయం
జగిత్యాల సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి నిర్ణయం హైడ్రా రద్దేనని స్పష్టం చేశారు. “మేం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే హైడ్రాను ఎత్తి అవతల పడేస్తం.. తొలి సంతకంతోనే పీకేసి చెరువులో పడేస్తం” అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలతో సభా ప్రాంగణం నినాదాలతో మార్మోగింది. గతంలో తమ ప్రభుత్వం 46 వేల చెరువులను అభివృద్ధి చేసిందని, కానీ ఒక్క గుడిసె కూడా కూల్చలేదని చెప్పారు. పేదల జీవితాలతో ఆటలాడే పాలనకు తెలంగాణ ప్రజలు సరైన బుద్ధి చెబుతారని అన్నారు.
రైతుబంధుకు రాంరాం, దళితబంధుకు జైభీం … ఎవరు సక్కగున్నరు?
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతు ఆగమాగం, ఉద్యోగి ఆగమాగం, విద్యార్థి ఆగమాగం, రిటైర్డ్ ఉద్యోగి ఆగమాగం అని పేర్కొన్నారు. “ఎవరు సక్కగున్నరు చెప్పండి.. సంతృప్తిగా ఎవరు ఉన్నరు?” అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని, ఒక్క కొత్త స్కీమ్ కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. “వచ్చినోళ్లు మంచిగా పని చేయాలిగా.. చిల్లర మాటలు తప్ప ఒక్క నిర్మాణాత్మక పథకం చేపట్టిండ్లా?” అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణను రెండున్నర ఏళ్లలో ఆగం చేశారని, కరెంట్ సమస్యలు పెరిగాయని, రైతుల పొలాలు ఎండిపోతున్నాయని ఆరోపించిన కేసీఆర్, రైతుబంధుకు రాంరాం అన్నరు, దళితబంధుకు జైభీం అన్నరని విమర్శించారు. రుణ మాఫీ మాటల్లోనే మిగిలిపోయిందన్నారు.
బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డి
జగిత్యాలలో జీవన్‌రెడ్డిని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించి ప్రధాన కార్యదర్శి పదవి ప్రకటించిన కేసీఆర్
జగిత్యాల సభలో మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేసీఆర్ ప్రకటించారు. “జీవన్‌రెడ్డి నిఖార్సైన నేత.. మేం 40-45 ఏళ్లుగా మంచి స్నేహితులం” అని తెలిపిన కేసీఆర్, “జగిత్యాల యుద్ధం మీ వంతు… తెలంగాణ యుద్ధం మావంతు” అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. జీవన్‌రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్‌కు కొత్త ఊపు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చివరగా “నూరు శాతం బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తది” అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. జగిత్యాల సభతో కేసీఆర్ మళ్లీ రాజకీయ యుద్ధరంగంలోకి దిగినట్టు స్పష్టమైంది.
జగిత్యాల సభతో కేసీఆర్ మళ్లీ రాజకీయ రంగంలో ఇదివరకటి దూకుడును ప్రదర్శించడంతో కార్యకర్తల్లో ఉత్సాహం పెల్లుబికింది. హైడ్రా రద్దు హామీ, కాంగ్రెస్‌పై దాడులు, కొత్త నాయకత్వ సమీకరణాలు—ఇవి అన్నీ కలిపి తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది.
