కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై విచారణ వచ్చే నెల 12కు వాయిదా
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దంటూ కేసీఆర్, హరీష్ రావులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ నవంబర్ 12కు వాయిదా పడింది.

విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిసి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీష్ రావులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ వచ్చే నెల 12కు వాయిదా పడింది. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. ఇదే ఉత్తర్వులు మాజీ సీఎస్ ఎస్.కే.జోషి, ఐఏఎస్ స్మిత సబర్వాల్ కు కూడా వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది.
కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై కమిషన్ తరుపు న్యాయవాది నిరంజన్ రెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయలేకపోయినందుకు నిరంజన్ రెడ్డి కోర్టుకు క్షమాపణలు చెప్పారు. మరోసారి కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ..విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేసింది. అప్పటిదాక పిటిషనర్లపై కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొంది.