కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే పనిలో కేసీఆర్: బండి సంజయ్
బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేపనిలో ఉన్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు

విధాత : బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేపనిలో ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదివారం ఆయన భోగి వేడుకల్లో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల అనంతరం తెలంగాణ రాజకీయాల్లో ఏదైనా జరుగవచ్చన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొంతమంది కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారని, అధికారం కోల్పోయి తీవ్ర అసహనంలో ఉన్న కేసీఆర్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా కేసీఆర్ కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేయడం మానేసి ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలన్నారు.
వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఇంటలిజెన్స్ ను అప్రమత్తం చేయాలని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ఆ నింద బీజేపీ మీద నెట్టివేస్తారని విమర్శించారు. కాంగ్రెస్ ముందు బీఆరెస్‌ను బొంద పెట్టాలన్నారు. బీజేపీ, బీఆరెస్ అంటే జనం నమ్మరని, కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆ గుడ్డి ఆలోచనలోనే ఉందన్నారు. కుట్రలకు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ కల్వకుంట్ల ఫ్యామిలీ అని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం, గౌరవం రెండూ లేవని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ గట్టిగా కొట్లాడితే ఇంకోడు బయటపడే అవకాశం ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మొండి పట్టుకు పోవద్దని, బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రానికి నిధులు వస్తాయని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన తమకు లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బీఆరెస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాలేవని అన్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అంతా ట్రస్టు ఆధ్వర్యంలోనే జరుగతుందన్నారు. యాదాద్రి పునఃనిర్మాణం ముసుగులో భారీ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని ఆరోపించారు. కేసీఅర్ మాదిరిగా అయోధ్యలో ప్రధాని మోదీ భూములు కొనుగోలు చేయలేదని ఎద్దేవా చేశారు.