KCR | 2 కేసులలో కేసీఆర్‌ పేరు!.. ‘ట్యాపింగ్‌’లో విస్మయకర అంశాలు

టెలిఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ పేరు బయటకు రావడం ఒకవైపు సంచలనం రేపుతుండగా.. మరోవైపు తాజాగా లిక్కర్‌ స్కామ్‌లోనూ ఆయన ప్రమేయం ప్రస్తావనకు వస్తున్నది.

KCR | 2 కేసులలో కేసీఆర్‌ పేరు!.. ‘ట్యాపింగ్‌’లో విస్మయకర అంశాలు

ఇప్పటికే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో
మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వెల్లడి
తాజాగా కవిత బెయిల్‌ పిటిషన్‌పై
వాదనల సందర్భంగా ఈడీ ప్రస్తావన
కాంగ్రెస్‌, బీజేపీ నేతలే లక్ష్యంగా ట్యాపింగ్‌
కార్యాలయాల్లో సోదాలు, డబ్బుల సీజ్‌
ఎన్నికల్లో బీఆరెస్‌ గెలుపే అంతిమ లక్ష్యం!
మాజీ ముఖ్యమంత్రి చుట్టూ ఉచ్చు!

విధాత, హైదరాబాద్ : టెలిఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ పేరు బయటకు రావడం ఒకవైపు సంచలనం రేపుతుండగా.. మరోవైపు తాజాగా లిక్కర్‌ స్కామ్‌లోనూ ఆయన ప్రమేయం ప్రస్తావనకు వస్తున్నది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనల సందర్భంగా కొత్త బాంబు పేల్చిన ఈడీ.. లిక్కర్ పాలసీ వ్యవహారమంతా కేసీఆర్‌కు ముందే తెలుసని, సహ నిందితులను కవిత స్వయంగా కేసీఆర్‌కు పరిచయం చేశారని పేర్కొంది. ఈ కేసులో అనూహ్యంగా కేసీఆర్ పేరును ఈడీ ప్రస్తావించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

అటు ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ గులాబీ బాస్ కేసీఆర్ సూత్రధారి అని టాస్క్‌ఫోర్సు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు తన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొనడం మరింత సంచలనమైంది. లిక్కర్ కేసులో కవితను తప్పించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ నేత బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేసేందుకు కేసీఆర్ ట్యాపింగ్ బృందంతో మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ నడిపించారని రాథాకిషన్‌రావు తన స్టేట్‌మెంట్‌లో పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. ఇలా రెండు కీలక కేసుల్లో ఒకే సమయంలో కేసీఆర్ పేరు తెరపైకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది మునుముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందోన్న చర్చ నడుస్తున్నది.

ఈడీ వాదనలో కేసీఆర్ పేరు

కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా కేసీఆర్‌ పేరును తొలిసారి ఈడీ ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, రిటైల్ వ్యాపారం గురించి ముందే కేసీఆర్‌కు సమాచారం ఉందని పేర్కొంది. ఈ వ్యాపారం గురించి కేసీఆర్‌కు కవిత ముందే వివరాలు చెప్పారని తెలిపింది. ఢిల్లీలోని తెలంగాణ సీఎం అధికారిక నివాసంలోనే కవిత తన టీమ్లోని బుచ్చిబాబు, అభిషేక్, అరుణ్ పిళ్లైలను కేసీఆర్‌కు పరిచయం చేశారని పేర్కొన్నది. కేసీఆర్‌కు సమీర్ మహేంద్రను బుచ్చిబాబు పరిచయం చేశారని, లిక్కర్‌ వ్యాపారం వివరాలను సమీర్‌ను అడిగి కేసీఆర్ తెలుసుకున్నారని ఈడీ తన వాదనల్లో వివరించింది. కేసీఆర్‌తో భేటీ వివరాలను గోపీ కుమరన్ వాంగ్మూలంలో రికార్డు చేసినట్లు వెల్లడించింది. కవితకు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని ఈడీ, సీబీఐ పేర్కొన్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అక్రమ సొమ్ము నేరుగా కవితకు చేరిందని కోర్టు దృష్టికి తెచ్చాయి. కేసులో కవిత కీలక పాత్రధారి అని, ఇందుకు వాట్సాప్ చాట్, ఇతర ఆధారాలు ఉన్నాయని తెలిపాయి. కవిత ఈడీకి ఇచ్చిన ఫోన్లలో డాటాను ఫార్మాట్‌ చేసి ఇచ్చారని ఫోరెన్సిక్ నివేదిక పేర్కొన్నదని ఈడీ తెలిపింది. కవిత రెండేళ్లలో సుమారు 11 మొబైల్ ఫోన్లు వాడారని, నాలుగు ఫోన్లలో ఉన్న ఆధారాలను కవిత ధ్వంసం చేశారని, అందువల్ల కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, సాక్ష్యాలను తారుమారు చేస్తారని దర్యాప్తు సంస్థ వాదించింది. సూర్యాస్తమయానికి ముందే కవితను అరెస్టు చేశామని.. ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదని.. గోప్యత హక్కును భంగపరచలేదని ఈడీ వాదించింది.

కవిత తరఫున న్యాయవాది నితీష్‌ రాణా కౌంటర్‌ వాదనలు వినిపించారు. కేసులో బుచ్చిబాబును నిందితుడిగా చేర్చకపోవడం.. అరెస్టు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. బుచ్చిబాబు స్టేట్‌మెంట్లు కోర్టు పట్టించుకోవద్దని.. ఆగస్టు 2023 తర్వాత ఎలాంటి కొత్త సాక్ష్యాలు ఈడీ చూపించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సాక్ష్యాల ధ్వంసం చేసిన సమయంలో ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కవిత తన పాత ఫోన్లు పని మనుషులకు ఇచ్చారని తెలిపారు. రూ.190 కోట్ల అక్రమ సొమ్ము చేరిందన్న ఈడీ వాదనలో నిజం లేదన్నారు. దీనిపై ఎలాంటి సాక్ష్యాలు ఈడీ చూపలేదన్నారు. కవిత అరెస్ట్ విషయంలో సీబీఐ చట్ట ప్రకారం నడుచుకోలేదని.. కవిత అరెస్ట్‌కు సీబీఐ కారణాలు చెప్పలేదని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.

టాపింగ్‌ కేసులో తవ్విన కొద్దీ నిజాలు!

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తవ్విన కొద్ది కొత్త కొత్త నిజాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతల ఫోన్లను, బీఆరెస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన, బీఆరెస్‌లోని అసమ్మతి నేతల ఫోన్లను, పత్రికాధిపతులు, జర్నలిస్టులు, జ్యూడిషియల్ ప్రతినిధులు, న్యాయవాదులు, రియల్టర్లు, బడా పారిశ్రామిక వేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా ఇప్పటిదాకా సమాచారం వెల్లడైంది. ట్యాపింగ్ బృందం ప్రధానంగా బీఆరెస్ అధినేతలు ఆదేశించిన ప్రతిపక్ష నేతలను ఎన్నికల్లో ఓడించే లక్ష్యంతో వారి డబ్బులు సీజ్ చేయడంలో చురుగ్గా పనిచేసినట్లుగా తాజాగా తేలింది. ఈ విషయం నిందితులు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్నల కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌లలో పోలీసులు నమోదు చేయడం ద్వారా వెలుగులోకి వచ్చింది.

ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆసరగా చేసుకుని అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేతలు సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన స్నేహితుల వద్ద, ప్రస్తుత మంత్రులకు సంబంధించి పెద్ద ఎత్తున డబ్బును సీజ్ చేసినట్లు అదనపు ఎస్పీ తిరుపతన్న బయటపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డబ్బు చేరకుండా పీఓఎల్- 2023 పేరుతో ప్రత్యేక ఎలక్షన్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులపై, సానుభూతి పరుల కార్యాలయాలు, నివాసాల్లో తనిఖీలు నిర్వహించి, పెద్ద మొత్తంలో డబ్బులు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

కొల్లూరులో రేవంత్ రెడ్డి మిత్రుడు గాలి అనిల్ కుమార్‌ నుంచి రూ.90 లక్షలు, రేవంత్ రెడ్డి మరో మిత్రుడు కె. వినయ్ రెడ్డి దగ్గర నుంచి రూ.1.95 కోట్లు సీజ్ చేసినట్లు ఈ రిపోర్టులో వెల్లడించారు. ప్రస్తుత మంత్రులైన ఉత్తమ్, పొంగులేటి, కోమటిరెడ్డి డబ్బులను తిరుపతన్న పట్టుకున్నారని, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ ఇన్‌ఫ్రా నుంచి రూ.10.5 కోట్లు సీజ్ చేయగా, పొంగులేటి మిత్రుడు ఖమ్మంలో ఫర్టిలైజర్ సంస్థ యజమాని నుంచి రూ.10 లక్షలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

రాజగోపాల్‌రెడ్డి మిత్రుడు సీహెచ్ వేణు దగ్గర రూ.3 కోట్లు, ఎమ్మెల్యే జి.వినోద్‌కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ నుంచి రూ.50 లక్షలు, ఉత్తమ్ మిత్రుడు గిరిధర్ నుంచి రూ.35 లక్షలు, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి నుంచి రూ.90 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్న తిరుపతన్న.. రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితోపాటు కామారెడ్డి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డిపైనా నిఘా పెట్టినట్లు దర్యాప్తు అధికారులు వారి రిపోర్ట్ లో పేర్కొన్నారు.

ట్యాపింగ్ దాడుల సారధి తిరుపతన్ననే

ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఆధారంగా బీఆరెస్‌ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడ రవాణా అవుతుంటే అక్కడికి వెళ్లి పట్టుకోవడంలో తిరుపతన్న కీలకంగా వ్యవహరించినట్లుగా పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించిన తిరుపతన్న.. ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, 10 పదిమంది కానిస్టేబుళ్లు, 10 హెడ్ కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకున్నారని, ప్రతి రోజు కూడా 40 మంది సెల్ ఫోన్లను ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఈ కస్టడీ రిపోర్ట్‌లో వెల్లడించారు. ఇలా మొత్తం 300 మంది ఫోన్లను ట్యాపింగ్ చేశారు.

దుబ్బాక, హుజూర్‌నగర్‌, నాగార్జున సాగర్‌ మూడు ఉప ఎన్నికలతో పాటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తో కలిసి పని చేసి, ప్రణీత్ కుమార్ ఇచ్చిన సమాచారంతో 15 ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో తిరుపతన్న… తన దగ్గర ఉన్న 3 కంప్యూటర్లతోపాటు 9 లాకర్స్‌లలో ఉన్న డేటా మొత్తం ధ్వంసం చేశారని, దీంతో దశాబ్దాల తరబడి నిల్వ ఉంచిన మావోయిస్టుల సమాచారం సైతం ధ్వంసమైందని పేర్కొన్నారు.

భుజంగరావు వాంగ్మూలంలోనూ కీలక విషయాలు

ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలోనూ మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. దర్యాప్తు బృందానికి భుజంగరావు కీలక విషయాలు వెల్లడించారు. బీఆరెస్‌కు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లు ట్యాప్ చేశామని, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సహకారంతో ట్యాపింగ్ చేశామని, బీజేపీ, కాంగ్రెస్‌లకు ఆర్థికంగా సాయపడే వారి ఫోన్లు ట్యాప్ చేశామని, బీఆరెస్‌లో వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు ట్యాప్ చేశామని తన వాంగ్మూలంలో వెల్లడించాడు. ఎస్ఓటీ, టాస్క్‌ఫోర్సు టీమ్‌ల సహకారంతో ఫోన్ ట్యాపింగ్ చేశామని, విపక్ష నేతలు, విద్యార్థి నేతలు, జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేశామని భుజంగరావు చెప్పినట్లు సమాచారం.

విపక్ష నేతల కుటుంబసభ్యుల ఫోన్లు, వాహనాలు ట్రాప్‌ చేశామని, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేశామని, మూడు ఉప ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్ చేశామని, మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ,కాంగ్రెస్ మద్దతుదారుల పోన్లు ట్యాప్ చేశామని రిపోర్టులో పేర్కొన్నారు. మూడోసారి బీఆరెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, మాదాపూర్ ఎస్ఓటీ పోలీసుల మద్దతుతో ఆపరేషన్ చేపట్టామని, బీఆరెస్‌ నేతల సూచనలతో పలు సెటిల్మెంట్లు చేశామని, కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల వివాదాలు సెటిల్ చేశామని చెప్పినట్టు రిపోర్టులో పొందుపరిచారు.

రెండు ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి భారీగా డబ్బు తరలించామని, బీఆరెస్‌ నేతల ఆదేశాలతో టాస్క్‌ఫోర్సు వాహనాల్లో డబ్బు తీసుకెళ్లామని, వారికి పోలీసులు స్వయంగా అందించారని భుజంగరావు వెల్లడించారు. రియల్టర్ సంధ్యా శ్రీధర్ రావుతో 13కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లు కొనేలా చేశామని, మాట వినకపోతే కేసులతో ఇబ్బంది పెడతామని హెచ్చరించామని భుజంగరావు వాంగ్మూలంలో పేర్కొన్నారు. కామారెడ్డి అసెంబ్లీ ఎన్నిక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, వెంకటరమణారెడ్డి, రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డిపై నిఘా పెట్టామని, పేపర్ లీకేజీపై కేటీఆర్‌ను విమర్శించిన వారి ఫోన్లు ట్యాప్ చేశామని భుజంగరావు చెప్పినట్లు రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

రాధాకిషన్ బదిలీతో

నవీన్ చంద్ర ఇచ్చిన ఆధునిక పరికరాలతో ఫోన్ ట్యాపింగ్‌ చేశామని భుజంగరావు వెల్లడించారు. రాజకీయ సమాచారాన్ని అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, టీవీ ఛానల్ హెడ్ శ్రవణ్ కుమార్ తో పాటు మరో ప్రైవేటు వ్యక్తి ద్వారా తెలుసుకుని ట్యాపింగ్‌, దాడులు సాగించామని, మాదాపూర్ సైబర్ క్రైమ్‌ ఎస్ఓటి డీసీపీ నారాయణ సపోర్ట్ తో ఆపరేషన్ చేసినట్లు పేర్కొన్నారు. అక్టోబర్‌లో ఎన్నికల సంఘం రాధాకిషన్‌ను బదిలీ చేయడంతో ప్రభాకర్ రావు సైబరాబాద్ డీసీపీని సంప్రదించారని భుజంగరావు తన స్టేట్‌మెంట్‌లో తెలిపారు.

అటు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు సైతం ఏప్రిల్ 9న ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో సైతం జీహెచ్‌ఎంసీ, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో మొదలైన ట్యాపింగ్ ఆపరేషన్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగిందని వెల్లడైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను తప్పించే కోణంలో బీజేపీని టార్గెట్ చేసిన కేసీఆర్ చివరకు బిఎల్ సంతోశ్‌ను అరెస్టు చేసేందుకు ఫామ్‌హౌజ్ ఎపిసోడ్ కథను ఫోన్ ట్యాపింగ్ బృందంతో నడిపించారని, అప్పటి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఆడియో వీడియో రికార్డింగ్ సైతం కేసీఆర్ డైరక్షన్‌లో జరిగిందని ఆ స్టేట్‌మెంటలో కేసీఆర్ పేరును కూడా ప్రస్తావించడం గమనార్హం.

నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్

భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీరు గతంలోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా వారి పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. దీంతో తాజాగా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టు బుధవారం విచారణ జరపనున్నది.