విధాత ప్రతినిధి ఉమ్మడి, అదిలాబాద్: కొడుకును సీఎం చేయాలనే ఆలోచన తప్ప ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరే ఆలోచన లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దుయ్యబట్టారు. ఈ పదేళ్ల కాలంలో పేదల సమస్యల, వారి సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉన్నదన్న అమిత్‌షా.. డిసెంబర్ 3న తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లో బీజేపీ నిర్వహించిన జనగర్జన సభలో ఆయన పాల్గొన్నారు.
రాజకార్లపై పోరాడిన వీర భూమికి నమస్కరిస్తున్నానంటూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించిన అమిత్‌షా.. బీఆరెస్‌పైన, ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. తెలంగాణలో ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ రాజ్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి మూలంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఆలస్యమైందని ఆయన ఆరోపించారు. గిరిజన యూనివర్సిటీకి కేసీఆర్ సర్కార్ స్థలం చూపించలేకపోయిందని విమర్శించారు.
కృష్ణా జలాలపై తెలంగాణకు న్యాయం
కృష్ణానది ట్రిబ్యునల్‌లో నిబంధనలు మార్చి తెలంగాణకు ప్రధాని మోదీ న్యాయం చేశారని అమిత్‌షా చెప్పారు. ‘ఆదివాసీలకు కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు. ఇచ్చారా? దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు. ఇచ్చారా?’ అని ప్రశ్నించారు. ఆదివాసుల అభివృద్ధి కోసం బీజేపీ ఎంతో కృషి చేస్తుందని చెప్పకొన్నారు. ఒడిశాలో పుట్టిన నిరుపేద ఆదివాసీ మహిళను మోదీ దేశానికి రాష్ట్రపతిని చేశారని పేర్కొన్నారు.
ఆధునిక రజాకార్ కేసీఆర్
రైతుల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం ప్రతి రైతు ఖాతాలో ఆరు వేల రూపాయలు జమ చేస్తున్నదని అమిత్‌షా చెప్పారు. తెలంగాణ సర్కార్ ఎన్నికల గుర్తు కారు అయినప్పటికీ ఆ కారు స్టీరింగ్ మాత్రం ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఉన్నదని ఆరోపించారు. అలాంటి పార్టీ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఆధునిక రజాకార్‌గా అభివర్ణించిన మోదీ.. ఈ రజాకార్ నుంచి తెలంగాణను బీజేపీ మాత్రమే కాపాడుతుందని చెప్పారు. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ చేశానని కేసీఆర్ చెబుతుంటారని, కానీ.. అవినీతి విషయంలో తెలంగాణను నంబర్ వన్ చేశారని, రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణను నంబర్ వన్ చేశారని ఎద్దేవా చేశారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల వేషాలు
ఎన్నికల వస్తున్నాయంటే కాంగ్రెస్ నాయకులు వేషాలు వేసుకుని వస్తారని అమిత్‌షా విమర్శించారు. వారు పేదల సంక్షేమ గురించి చెప్తుంటారు కానీ దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆరెస్.. ఈ మూడు పార్టీలూ ఒక్కటేనని చెప్పారు. వారికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. అయోధ్య రామమందిరం అంశాన్ని అమిత్‌షా ప్రస్తావించారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలా? వద్దా? అని జనాన్ని ప్రశ్నించారు. ఎంతో కష్టపడి అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు.
మోదీపై ఒక్క అవినీతి ఆరోపణ లేదు
తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో ప్రధాని మోదీపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని అమిత్‌షా చెప్పారు. కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా టీకాలు ఇచ్చి, ప్రజలను కాపాడిందన్నారు. సర్జికల్ స్ట్రైక్ చేసి శత్రువులను తరిమికొట్టిన చరిత్ర బీజేపీకి ఉందని చెప్పారు. దేశంలో జీ20 శిఖరాగ్ర సదస్సులు నిర్వహించడం వల్ల ప్రపంచ దేశాలు భారతదేశంపై ప్రశంసలు కురిపించాయని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ప్రేమేందర్ రెడ్డి, జిల్లా బీజేపీ నాయకులు పాయల శంకర్, సుహాసిని రెడ్డి, రాథోడ్ రమేశ్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సభతో తమలో ఉత్సాహం మరింత పెరిగిందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి.