బీసీల మెడలు కోసి మజ్లిస్ చేతిలో పెట్టడం న్యాయమా: కిషన్ రెడ్డి
మజ్లిస్ కనుసన్నల్లో 12శాతం బీసీ రిజర్వేషన్లను ముస్లింలకు ఇచ్చే ప్రయత్నం చేశారని, ఇవాళ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కూడా 34శాతం ఉన్న రిజర్వేషన్లను 32శాతానికి తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు

- బీసీల మెడలు కోసి మజ్లిస్ చేతిలో పెట్టడం న్యాయమా?
- మోదీకి సవాల్ విసరడం అంటే సూర్యుడిపై ఉమ్మేసినట్టే
- కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు
విధాత, హైదరాబాద్: మజ్లిస్ కనుసన్నల్లో 12శాతం బీసీ రిజర్వేషన్లను ముస్లింలకు ఇచ్చే ప్రయత్నం చేశారని, ఇవాళ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కూడా 34శాతం ఉన్న రిజర్వేషన్లను 32శాతానికి తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ జంతర్ మంతర్‌లో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ఇండియా కూటమి నేతలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ల అంశంపై ధర్నా చేయడంపై గురువారం కేంద్ర మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలంగాణలో.. స్థానిక సంస్థల్లో 34శాతం బీసీ రిజర్వేషన్లు అమలైందన్నారు. కానీ, దాన్ని కేసీఆర్ 27 శాతానికి తగ్గించారని, ఆయన 12శాతాం ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చేందుకు అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేశారని విమర్శించారు. బీసీ జనాభా ప్రాతిపదికన 42శాతం ఉండాల్సిన బీసీ రిజర్వేషన్‌కు అన్యాయం చేశారని మండిపడ్డారు. సర్వేలోనూ అనేక రకాల తప్పులు చేశారన్నారు. బీసీల సంఖ్యను తగ్గించడమే కాకుండా అందులో 10శాతం ముస్లింలను చేర్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లు పెట్టి దేశంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారా? ఇదేనా మీ తెలంగాణ మోడల్ అని ప్రశ్నించారు.
బీసీ సామాజిక వర్గానికి మోసం చేయడమే తెలంగాణ మోడలా అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, గత ఎన్నికల్లో బీసీలకు 50 సీట్లు రిజర్వ్ చేస్తే ఇందులో 31 మంది నాన్-బీసీలు గెలిచారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీలకు ఎలా న్యాయం చేస్తారో రాహుల్, రేవంత్, కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. బీసీల మెడలు కోసి మజ్లిస్ పార్టీ చేతుల్లో పెట్టడం ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందా అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా.. మజ్లిస్ చెప్పినట్లే నాటకాలు చేస్తారని, వారు చెప్పినట్లే అసెంబ్లీలో వ్యవహరిస్తున్నారి ఆరోపించారు. వారు చెప్పినట్లే తెలంగాణలో పాలిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదే విధమైన పరిస్థితి కొనసాగితే.. ఒవైసీ కుటుంబానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసంరం లేదన్నారు. ప్రజల దృష్టిని తమ ప్రభుత్వ వైఫల్యాలనుంచి మళ్లించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద, మోదీ మీద అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారు. మోదీకి సవాల్ విసరడం అంటే సూర్యుడిపై ఉమ్మేసినట్టే.. అలా చేస్తే మీ మీదే పడుతుందనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ప్రజలు పశ్చాత్తాపం పడుతున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.