విధాత :నాపై తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన రాజకీయ విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నానని.,ఆయన విమర్శలు “వినాశకాలే విపరీత బుద్ధి” అంటూ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పై సామేల్ చేసిన విమర్శలపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో తాను కూడా కీలక పాత్ర పోషించానని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశానని గుర్తు చేశారు. సామేల్ ఒక్కడే ఉద్యమకారుడు కాదన్నారు.
తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేసిన సామేల్ కు గత అసెంబ్లీ ఎన్నికలలో తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని తానే కృషి చేశానని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. టికెట్ కోసం ఆయన నా ఇంటికి వందసార్లు వచ్చారు. నా ఎమ్మెల్యే టికెట్‌తో పాటు తుంగతుర్తి, బాన్సువాడ టికెట్లను వరుసగా మందుల సామేల్, ఏనుగు రవీందర్‌లకు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించి ఇప్పించుకున్నానని వెల్లడించారు.
తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను తప్పుడు వ్యక్తికి ఇవ్వడం జరిగిందని..తనను నమ్మి సామేల్ కు ఓటు వేసిన కార్యకర్తలందరికీ క్షమాపణలు కోరుతున్నానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే సామేల్ కు వ్యతిరేకంగా పార్టీ నాయకులు ఎవరు కూడా మీడియా సమావేశాలు నిర్వహించవద్దని, నిరసనలు చేపట్టవద్దని, పార్టీ కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించాలని ఆయన సూచించారు.
పార్లమెంట్ ఎంపీగా, ఎమ్మెల్సీగా, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పని చేశానని గుర్తు చేశారు. నా సేవలను గుర్తించి, నేను పార్టీ మారినప్పటికి..కాంగ్రెస్ కోసం గతంలో ఉమ్మడి జిల్లాలో చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని అధిష్ఠానం నన్ను తిరిగి పార్టీలో చేర్చుకుందన్నారు. 2009ఎన్నికల సమయంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనంగా ఉందని, నేను వచ్చిన తర్వాత పార్టీ బలోపేతం అయ్యిందన్నారు.
మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పని చేసిన కార్యకర్తలకు అన్యాయం జరగకూడదన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి వల్ల పాత కార్యకర్తలకు ఇబ్బంది కలిగితే ఊరుకునేది లేదన్నారు. అసలైన కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్తాం. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్ తో పాటు మా లాంటి నాయకుల పై ఉందని స్పష్టం చేశారు.
