విజయవాడ-హైదరాబాద్ రహదారిని విస్తరించండి: మంత్రి కోమటిరెడ్డి

కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరితో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. డెత్ రోడ్డుగా పిలిచే హైదరాబాద్-విజయవాడ రహదారి (ఎన్‌హెచ్-65)ను విస్తరించాలని కేంద్ర మంత్రి గడ్కరిని కోరారు.

విజయవాడ-హైదరాబాద్ రహదారిని విస్తరించండి: మంత్రి కోమటిరెడ్డి

ఢిల్లీ: కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరితో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. డెత్ రోడ్డుగా పిలిచే హైదరాబాద్-విజయవాడ రహదారి (ఎన్‌హెచ్-65)ను విస్తరించాలని కేంద్ర మంత్రి గడ్కరిని కోరారు. ఈ రహదారిపై గత నెల 27న జరిగిన ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్సీలు మరణించిన విషయాన్ని గడ్కరికి చెప్పారు. హైదరాబాద్-విజయవాడ: మల్కాపూర్ నుంచి విజయవాడ (అమరావతి) వరకు రహదారిని 4 వరుసల నుంచి 6 వరుసలు గా విస్తరించడంతో పాటు సర్వీస్ రోడ్లను నిర్మించాలని కోరారు. దీనికి కేంద్ర మంత్రి గడ్కరి సానుకూలంగా స్పందిచారని కోమటిరెడ్డి వెల్లడించారు.

ఆగష్టు 15న నిర్వహించే ఫైనాన్స్ మీటింగ్ లో ఎన్‌హెచ్-65 విస్తరణను ఆమోదిస్తామని.. త్వరితగతిన అంచనాలు రూపొందించి పంపాలని, వెంటనే టెండర్లు పిలుస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. చింతల్ కుంట చెక్ పోస్ట్ నుంచి హయత్ నగర్, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు దాదాపు 5.5 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎలివేటెడ్ కారిడార్ గా నిర్మించడంతో పాటు నాగ్ పూర్ లో మాదిరిగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ గా నిర్మాణం చేపట్టాలని కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్–శ్రీశైలం రోడ్డ్ జాతీయ రహదారి(ఎన్ హెచ్ -765)లో టైగర్ రిజర్వ్ నుంచి వెళ్తున్న ప్రాంతాన్ని ఎలివేటెడ్ కారిడార్ గా గుర్తించాలన్న మంత్రి కోమటిరెడ్డి విజ్ఞాపనకు.. అలైన్ మెంట్ అప్రూవల్ ఇస్తూ మంజూరీ చేస్తానని గడ్కరి హామీ ఇచ్చారు. వీటితోపాటు హైదరాబాద్ –మన్నెగూడ రహదారికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉన్న అంశాన్ని త్వరగా పూర్తి చేసి కాంట్రాక్టర్ ను ఒప్పించి త్వరితగతిన పనులు పూర్తిచేయడానికి సహకరించాలని మంత్రి కోమటిరెడ్డి కోరారు. వీటితోపాటు పెంగింగ్‌లో ఉన్న మరిన్ని రహదారుల విషయాలపై కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి సానుకూలంగా స్పందించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.