- కొండా రాజకీయ భవిష్యత్తు పై ఊహాగానాలు
- పార్టీ మారుతారారంటూ జోరుగా ప్రచారం
- రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు
- సొంత పార్టీ కాంగ్రెస్లో తీవ్రమైన సవాళ్ళు
- ఒక్కటైన కాంగ్రెస్ నేతలు, ఒంటరైన కొండా
- కాంగ్రెస్లో సాగుతారా? గుడ్ బై చెబుతారా?
- బీఆర్ఎస్, బీజేపీతో అంతర్గత మంతనాలు!
- జనసేన వైపు దృష్టి సారించవచ్చంటూ ప్రచారం
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
పార్టీ ఏదైనా నిత్య అసమ్మతివాదులుగా ముద్రపడిన కొండా ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్తు ఒక్కసారిగా ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారిందా? అంటే ఔనననే సమాధానం వస్తోంది. రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా కొనసాగిన కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో కొండా కుటుంబం భవిష్యత్తు నిర్ణయం ఏ విధంగా ఉంటుందనే ఊహాగానాలు, జోరుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ తూర్పు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానంటూ కొండా సురేఖ మీడియా ముందు వెల్లడించినప్పటికీ, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా? లేదా? అనే అనుమానాలు నలువైపులా వ్యక్తమవుతున్నాయి. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం తీవ్రమైన అవమానంగా భావిస్తున్న కొండా ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో తాజాగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో ఆ పార్టీలో కొనసాగడం తీవ్ర ఇబ్బందికరమైన అంశంగా పరిశీలకులు భావిస్తున్నారు. ఇది ఆ కుటుంబానికి అగ్నిపరీక్షగా పేర్కొంటున్నారు. పైగా, ముఖ్యమంత్రి రేవంత్ నుంచి పార్టీ అధిష్ఠానంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కొండా కుటుంబం పట్ల వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో తమ సహజ శైలికి భిన్నంగా పార్టీలో అణిగిమణిగి ఉంటారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమ భవిష్యత్ నిర్ణయాన్ని రెండు, మూడు రోజుల్లోనే ప్రకటిస్తామంటూ కొండా సురేఖ ప్రకటించడంలో మతలబేమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ భవిష్యత్తు పై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారా? లేక రానున్న రోజుల్లో పరిస్థితులనుబట్టి తీసుకుంటారా? అనే అనేది కీలకంగా మారింది.
పొలిటికల్ చౌరస్తా సెంటర్ లో కొండా ఫ్యామిలీ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన కొండా సురేఖ, ఎమ్మెల్సీగా పనిచేసిన కొండా మురళీ కుటుంబం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో వారి రాజకీయ భవిష్యత్తు కీలక చౌరస్తాకు చేరిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో తాత్కాలికంగా కాంగ్రెస్ లో కొనసాగుతూ తమకు అనుకూలమైన ఆఫర్ ఇచ్చే రాజకీయ పార్టీలో చేరుతారనే చర్చ ఒక వైపు సాగుతోంది. ఈ మేరకు కొండా ఫ్యామిటీ ఒక నిర్ణయానికి వచ్చి అంతర్గతంగా తమకు టచ్ లోకి వచ్చిన రాజకీయ పక్షాల నేతలు, ఆ పార్టీలో తమ సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. త్వరలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారని భావిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోవడం వల్ల కొంత కాలం వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తారనే మరో చర్చ కూడా సాగుతోంది. మరో వైపు వచ్చే ఎన్నికలకు కొద్ది కాలం ముందు పార్టీ మారుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శుక్రవారం సోషల్ మీడియాలో కొండా సురేఖ పేరుతో వచ్చిన పోస్టు ఈ రాజకీయ వేడిని మరింత తీవ్రం చేసింది. “ఎదురుచూపులు ముగిశాయి… త్వరలో బిగ్ అప్ డేట్ వస్తోంది. ఎదురు చూడండంటూ” వచ్చిన సందేశం కలకలం సృష్టించగా, ఈ సందేశం తాము చేసింది కాదంటూ సురేఖ ఎక్స్ లో ట్వీట్ చేయడం గమనార్హం.
కొండా ఫ్యామిలికీ మూడు అవకాశాలు
కాంగ్రెస్ పార్టీని వీడితే ఆ ఫ్యామిలీ ముందు మూడు పార్టీల అవకాశాలున్నాయి. మొదటి వరుసలో బీజేపీ ఉంటోంది. రెండవ వరుసలో బీఆర్ఎస్, మూడో పార్టీగా జనసేన పార్టీ ఉందనే ప్రచారం ఉంది. దీనికి తోడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో తమ కుటుంబ సభ్యుల పోటీకి అవకాశం ఇచ్చే పార్టీలో చేరుతారనే మరో చర్చ సాగుతోంది. ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు? ఎప్పుడు పార్టీ మారుతారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసినప్పటి నుంచి ఈ అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, నిజామాబాద్, మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, డీకే అరుణ తదితరులు తీవ్రంగా ఖండించడం గమనార్హం. ఒక విధంగా కొండా సురేఖ పట్ల బీజేపీ నాయకులు సానుకూల వైఖరిని ప్రదర్శిస్తూ వస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ నాయకులు సైతం కాంగ్రెస్ ను విమర్శిస్తున్నప్పటికీ తమ రాజకీయ ప్రయోజనానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండా ఫ్యామిలీ బీజేపీలో చేరుతారా? చేరితే వీరి ‘స్వభావానికి’ ఆ పార్టీలో ఇముడ గలుగుతారా? అనే ప్రశ్నలు ఉండగా మరో వైపు బీజేపీలో చేరితే ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలనే షరతు విధించే అవకాశం ఉంటుందంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతారా? అనేది పెద్ద ప్రశ్న. బీజేపీలో చేరేందుకు సిద్ధమైతే కొండా ఫ్యామిలీ డిమాండ్ చేసే పరకాల, వరంగల్ తూర్పు రెండు టికెట్లు ఇచ్చేందుకు బీజేపీ లాంటి జాతీయ పార్టీలు అంగీకరిస్తాయా? అనే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే తెలంగాణలో అధికారంపై కన్నేసిన బీజేపీ.. కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెట్టేందుకు, రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేందుకు కొండా కుటుంబానికి పార్టీలో అవకాశం కల్పించే అవకాశాలు లేక పోలేదంటున్నారు. పైగా బీజేపీ తెలంగాణలో బీసీ జపం చేస్తున్న విషయాన్ని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. ఇక రెండవ అవకాశంగా బీఆర్ఎస్ పార్టీలో చేరే ఛాన్సు ఉంది. అయితే గతంలో బీఆర్ఎస్ లో కొండా ఫ్యామిలీ పనిచేసింది. ఆ పార్టీని వీడిన సందర్భంలో తీవ్ర విమర్శలు చేసిన సందర్భాన్ని ప్రస్తుతం గుర్తుచేస్తున్నారు. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే అంశాన్ని లేవనెత్తుతూ, వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఉన్న బీఆర్ఎస్ కొండా కుటుంబాన్ని చేర్చుకుని కాంగ్రెస్ ను ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. దీనికి తోడు వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని, ఈ నేపథ్యంలో వీరికి అవకాశం కల్పించే అవకాశం కూడా ఉందనే చర్చ సాగుతోంది. అయితే కొండా ఫ్యామిలీతో ఆ పార్టీకి చేదు అనుభవం ఉన్నందున తమ పార్టీలో చేర్చుకునే అంశం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొండా కుటుంబాన్ని తమ పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచన లేదని ఆ పార్టీ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. మా వైపు నుండి ఆ ప్రయత్నం లేదని ప్రకటించడంతో ఆ పార్టీలో ద్వారాలు మూసేశారా? లేక రాజకీయ వ్యూహంలో భాగంగా ఆ ప్రకటన చేశారా? అనే చర్చ సాగుతోంది.
ఇదిలా ఉండగా మూడవ అవకాశంగా జనసేన పార్టీలో చేరుతారనే చర్చ ఉంది. అయితే తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితిలో రానున్న కాలంలో ఆ పార్టీకి లభించే ఆదరణ ఎంతనే ప్రశ్నలున్నాయి. మరో వైపు ఆ పార్టీలో చేరి తమ రాజకీయ భవిష్యత్తును నిలబెట్టుకోవడం కూడా కష్టమనే ప్రశ్నలున్నాయి. కొండా సుస్మిత జనసేన వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అంటూ మారితే ఏ పార్టీలో చేరుతారు? ఆ పార్టీలో వీరికి దక్కే గౌరవం, ప్రాధాన్యం ప్రధానమంటున్నారు.
కాంగ్రెస్ పార్టీయే దిక్కా?
ఇదిలా ఉండగా, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జరిగే నష్టం జరిగినప్పటికీ ఉన్న ఎమ్మెల్యే పదవిని కాపాడుకుంటూ తిరిగి ఆ పార్టీలో తమ ప్రాధాన్యతను పెంచుకునే అవకాశం లేకపోలేదంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ సహజమనే అభిప్రాయం కూడా ఉంది. అయితే ఇంత రాద్ధాంతం, విమర్శలు, వ్యతిరేకత నెలకొన్న స్థితిలో ఆ పార్టీలో కొనసాగడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే అలా అని తమ రాజకీయ భవిష్యత్తును అగాథంలో వారే పడవేసుకుంటారా? అనే అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా నిన్నటి వరకు మంత్రిగా వెలుగువెలిగిన కొండా ఫ్యామిలీని ఒక్కసారిగా రాజకీయ కష్టాలు చుట్టుముట్టాయంటున్నారు. అందుకే జరిగిన నష్టమేదో జరిగినప్పటికీ ఆచితూచి వ్యహరిస్తారా? ఆత్మగౌరవం పేరిట అనూహ్య నిర్ణయం తీసుకుంటారా? అనే మరో అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్వంత పార్టీలో తీవ్ర సవాళ్ళు!
కాంగ్రెస్ పార్టీలో కొండా ఫ్యామిలీ ఇంత కాలం కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ అనేక కారణాల నేపథ్యంలో నెగ్గుకొచ్చారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితం, అందులో కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ కాలం కొనసాగడం, బీసీ సామాజిక వర్గం, మహిళ అనే అనేక అంశాలు కలిసొచ్చాయి. స్వంత జిల్లాల్లో అందరితో విభేదాలు నెలకొన్నా ఒంటరిగా ముందుకు నడిచారు. కానీ, ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితులన్నీ తిరుగబడ్డాయి. కాంగ్రెస్ లో కొనసాగితే రానున్న రోజులు అంత సానుకూలంగా ఉండకపోవచ్చంటున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ తో విభేదాలు, జిల్లాకు చెందిన సహచర ఎమ్మెల్యేలు కడియం, రేవూరి, నాయినిలతో మనస్పర్ధలు, జిల్లాకు చెందిన సీఎం సన్నిహితుడైన ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఇంచార్జ్ మంత్రి పొంగులేటిలను టార్గెట్ చేయడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అదే విధంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పులో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో వైరం, సురేఖ సామాజిక వర్గానికి చెందిన తాజా కుడా చైర్మన్ గుండు సుధారాణితో పొసగని తీరు ఇవన్నీ ఇప్పుడు ఇబ్బంది కరంగా మారుతాయంటున్నారు.
‘ఇప్పటికే బస్వరాజు బస్తీమే సవాల్ అంటున్నారు. ఇద్దరం బీసీలం, ఇద్దరం ఇండిపెండెంట్‌గా తూర్పులో పోటీ చేద్దాం? ఎమ్మెల్యేగా రాజీనామా చేయ్ అంటూ సవాల్ విసిరారు?
‘నెగటివ్ పబ్లిసిటి కోసం కొండా సురేఖ సీఎం రేవంత్ ను విమర్శిస్తున్నారంటూ గుండు సుధారాణి స్వరం పెంచారు. సీఎం రేవంత్ ను విమర్శిస్తే సహించేదిలేదంటూ విమర్శించారు. ఇదిలా ఉండగా కొండా ఫ్యామిలీ తీరును తొలి నుంచి వ్యతిరేకిస్తున్న పశ్చిమ ఎమ్మెల్యే నాయిని సురేఖ బర్తరఫ్ న్యాయమైందంటూ ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్టానం చర్యను గట్టిగా సమర్ధించారు.
ఇదిలా ఉండగా మూడేళ్ళ పాటు మంత్రిగా పనిచేసినప్పటికీ, రెండవ పర్యాయం తూర్పు ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినప్పటికీ నియోజకవర్గంలో కనీస అభివృద్ధి చేపట్టలేదనే తీవ్ర విమర్శ ఉంది. ఒకరిద్దరు వ్యక్తులతో కొండా ఫ్యామిలీ తూర్పులో ఆధిపత్యం చెలాయించారనే విమర్శలు కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగా విమర్శిస్తున్నారు. ఇదంతా కొండా ఫ్యామిలీ స్వయం కృతమంటున్నారు. దీనికి తోడు నిన్నటి వరకు కొండా ఫ్యామిలీ వెంట నడిచిన అనుచరులు ఇప్పుడు అంతర్మథనంలో పడ్డారని చెబుతున్నారు. సురేఖ బర్తరఫ్ నిర్ణయం తర్వాత ఎక్కువ మంది ఆలోచనలో పడ్డారు. గతంలో బీఆర్ఎస్ లో ఉన్పప్పుడు తమ రాజకీయ భవిష్యత్తును ఇబ్బందుల్లో పడేశారని, తిరిగి కాంగ్రెస్ లో చేరితే ఇప్పుడు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు మరోసారి తమను కష్టాల్లోకి నెట్టారనే అభిప్రాయంతో ఉన్నారు. తాజా పరిస్థితుల్లో కొండా ఫ్యామిలీని నమ్ముకుని వారికి అండగా గట్టిగా నిలబడే వారెంతమందనే అనుమానాలున్నాయి. గతంలో మాదిరి సానుకూల పరిస్థితులు, అనుచరులు, వర్గాలు కొనసాగే స్థితి లేదంటున్నారు. ఈ నేపథ్యంలో కొండా ఫ్యామిలీ భవిష్యత్తు రాజకీయ నిర్ణయం ఎలా? ఉంటుందనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. మరోవైపు కొండా దంపతులు కొత్త పార్టీ పెడతారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
