కాంగ్రెస్ లో కొండా కల్లోలం.!

తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పరకాలలో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేసిన విమర్శలు అలజడి రేపుతున్నాయి. కూతురు చేసిన వ్యాఖ్యలపై పార్టీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు మంత్రి కొండా సురేఖ ఏం సమాధానం ఇవ్వబోతున్నారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పరకాలలో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేసిన విమర్శలు అలజడి రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబం తెలంగాణను దోచుకుంటున్నారని..తన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తే రేవంత్ కుటుంబం అవినీతి వ్యవహారాలను మరిన్ని బయటపెడుతానని కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో పీసీసీ క్రమశిక్షణా కమిటీ సుస్మిత చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది.

ఇటీవల కొండా సురేఖకు, వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలకు మధ్య నెలకొన్న విభేధాలు, కుదిరిన సయోధ్య వ్యవహారం మరవకముందే కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేయడంతో మరోసారి కొండా కుటుంబం చిక్కుల్లో పడినట్లయ్యింది.

పరకాల టికెట్ పంచాయతీతో రేగిన రచ్చ..

తాజాగా పరకాల సభలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని మరోసారి గెలిపించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ నియోజకవర్గం టికెట్ పై ఆశలు పెట్టుకున్న కొండా సుస్మితకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ నేపథ్యంలో టికెట్లు ఇచ్చేది రేవంత్ కాదని..కాంగ్రెస్ హైకమాండ్ అని..పరకాల నుంచి పోటీ చేసేది నేనే..గెలిచేది నేనే అంటూ సుస్మిత వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పరకాల టికెట్ రేవూరి ప్రకాశ్ రెడ్డిదే అన్నట్లుగా మాట్లడటాన్ని ఆమె తప్పుబట్టారు.

అంతేకాదు సీఎం రేవంత్, ఆయన సోదరులు తెలంగాణలో దోపిడి కొనసాగిస్తున్నారని, సీఎం సోదరుడి కంపెనీకి రూ.200కోట్ల ప్రభుత్వ భూములను కట్టబెట్టారంటూ ఆరోపించారు. బీసీలను, కొండా కుటుంబాన్ని తొక్కేసే ప్రయత్నం రేవంత్ చేస్తున్నారని, కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తానని మోసం చేశారని సుస్మిత తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సుస్మిత చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వైరల్ చేయడంతో సహజంగానే ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణా కమిటీ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది.

కొండా సురేఖ స్పందనపై సర్వత్రా ఆసక్తి

సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాత్రమే తను మాట్లాడానని, ఎక్కడా పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నష్టం చేసేలా తాను మాట్లాడలేదని ఇప్పటికే కొండా సుస్మిత స్పష్టం చేశారు. అయితే పార్టీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు మంత్రి కొండా సురేఖ ఏం సమాధానం ఇవ్వబోతున్నారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే కూతురు చేసిన వ్యాఖ్యలతో తన సంబంధం లేదని సురేఖ సమాధానం ఇవ్వబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

పార్టీ లైన్ ధాటితే చర్యలు తప్పవు : పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

మంత్రి కొండా సురేఖ కుటుంబం చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నారని, కొండా సుస్మిత లేదా చిన్నారెడ్డి సహా ఎవరు పార్టీ లైన్ దాటి మాట్లాడినా అది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుందని పీసీసీ చీఫ్ బీ.మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సుస్మిత సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే కొండా సురేఖని వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చాం అని, పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడిన ఉపేక్షించేది లేదు అన్నారు. కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చాక ఏం చేయాలో ఆలోచిస్తాం అని తెలిపారు.

 

Latest News