కేంద్రం బాసటతోనే తెలంగాణ సర్కార్.. రైతాంగం మనుగడ: ఎంపీ కొండా

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బాసటతోనే తెలంగాణ ప్రభుత్వం.. రైతాంగం మనుగడ సాగుతందని...దేశంలోనే తెలంగాణ నుంచే ఎక్కువ ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

విధాత, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బాసటతోనే తెలంగాణ రైతాంగం మనుగడ సాగుతందని…దేశంలోనే తెలంగాణ నుంచే ఎక్కువ ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం పలు పథకాలతో ఆర్థిక సహాయం చేస్తుందని గుర్తు చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందని కొండా పేర్కొన్నారు. నిధులు, అప్పుల కోసం ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు, మంత్రులు చిప్ప చేతిలో పట్టుకుని తిరుగుతున్నారని, కేంద్ర మంత్రులను కలుస్తున్నారని కొండా సెటైర్లు వేశారు. పైగా తెలంగాణకి ప్రధాని మోదీ ఏం చేశారని కొంతమంది కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని ఆరోపించారు. నన్ను చీల్చినా మా దగ్గర ఒక్క పైసా లేదని సీఎం రేవంత్ రెడ్డినే స్వయంగా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో సత్సంబంధాలు సాగిస్తూ..రాష్ట్రానికి వచ్చి కేంద్రం ఏమిచ్చిందంటూ రాజకీయ విమర్శలు చేయడం బాగా లేదన్నారు.

తెలంగాణ టాక్స్ కట్టేదంతా హైదరాబాద్ అయితే..నిధులన్ని ఇక్కడే ఖర్చు చేయలేం కదా అని కాంగ్రెస్ కు చురకలేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో కంటే ఇప్పుడు రాష్ట్రాలకు అదనంగా నిధులు వస్తున్నాయన్నారు. పంచాయతీలకు, మున్సిపాల్టీలకు, కేంద్ర ప్రభుత్వ పథకాలలో భాగంగా ఉన్న పథకాలకు భారీ ఎత్తున కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని కొండా వెల్లడించారు. వేల కోట్ల రూపాయలను ఏటా కేంద్రం నుంచి తెలంగాణకు వస్తుంటే..రూపాయి ఇవ్వలేదని కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రాజకీయ విమర్శలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 10న ప్రధాని మోదీ పర్యటనతో కొత్తగా మరిన్ని వేలకోట్ల అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టబోతున్నారని, ఈ సందర్బంగా నిర్వహించే మోదీ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Latest News