రూ.కోటి పెట్టి 600గజాలు కొన్నాను..నిషేధిత జాబితాలో పెట్టారు: బాధితుడి వేదన

రూ.కోటి పెట్టి కొన్న 600 గజాల భూమిని 22ఏ నిషేధిత జాబితాలో పెట్టారని ఓ బాధితుడు హరీశ్‌రావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో 22ఏ బాధితులు తమ సమస్యలను వెల్లడించారు.

నేను రూ.కోటి పెట్టి కొత్తపేటలో 600 గజాల భూమి కొంటే దాన్ని 22A కింద నిషేధిత జాబితాలో పెట్టారని, నా వద్ద 1979నుంచి డాక్యుమెంట్లు, అనుమతులు అన్ని ఉన్నాయని..అక్కడ మొత్తం 151 ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారని ఓ బాధితుడు బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావుకు తన గోడు వెళ్లబోసుకున్నారు. 22ఏ బాధితులు తెలంగాణ భవన్‌లో హరీష్ రావును కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధుల్లోని బాధితులు భారీ సంఖ్యలో ఈ సందర్బంగా తమ సమస్యలను ఏకరవు పట్టారు. కొత్త పేట పరిధిలో దాదాపు 50 వేల ఇళ్లు నిషేధిత జాబితా కిందకు వచ్చాయని, గత 8 రోజుల నుంచి సరూర్ నగర్లో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదు అని, ప్రభుత్వం వెంటనే ఈ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని బాధితుడు తన మొర వినిపించాడు. అటు డబ్బులు పోయాయి, ఇటు రిజిస్ట్రేషన్ కూడా అవ్వట్లేదు.. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అని బాధితుడు వాపోయాడు. రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి వెళ్తే.. 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ కాదని అధికారులు చెప్తున్నారని వెల్లడించాడు.

చర్లపల్లి బీఎన్ రెడ్డి నగర్ లో 150ఎకరాలను 22ఏలో పెట్టారని ఒకరు, అమిన్ పూర్ గ్రామంలో కొనుగోలు చేసిన ఇల్లును నిషేధిత జాబితాలో పెట్టారని, దానిపై బ్యాంకు లోన్ కూడా ఉందని, కొత్తగా నిషేధిత జాబితాలో పెట్టడంతో అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందని మరో బాధితుడు వాపోయాడు.

22ఏ బాధితులకు బీఆర్ఎస్ లీగల్ సెల్ అండ : హరీశ్ రావు

22ఏ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ, లీగల్ సెల్ అండగా ఉంటుందని,ప్రభుత్వం మెడలు వంచి, ప్రజల ఆస్తులు కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం అని మాజీ మంత్రి టి.హరీశ్ రావు భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు రియల్ ఎస్టేట్ తెలిస్తే, మాకు పోరాటాలు తెలుసు అన్నారు. 22ఏలో భూములు పెట్టించడం వాళ్ళకు తెలిస్తే, అవి ఎలా తీయించాలో మాకు తెలుసు అని స్పష్టం చేశారు.

Latest News