భూదందాలు, అవినీతి అక్రమార్జనల సొమ్మును మళ్లించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సోదరులు కొత్త కొత్త కంపెనీలకు యజమానులు అవుతున్నారని, ఒక్క ఉద్యోగి కూడా లేకుండా కొత్తకొత్త కంపెనీలు ఏర్పాటుచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ర ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ సీఎం సోదరులు చిన్నచిన్న ఇంటి అడ్రస్‌లతో పెద్దపెద్ద కంపెనీలు రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. ఊరుపేరు లేని అనుముల కొండల్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న ‘టెసారాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్’ అనే దొంగ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి రూ.200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. ఆ కంపెనీ ఫోన్ నెంబర్ చూస్తే “123456789”గా ఉందని, ఆఫీసులో పనిచేసేందుకు ఒక్క ఉద్యోగైనా ఉన్నాడా అంటే అదీ లేదు అన్నారు. అసలు మంత్రి శ్రీధర్ బాబుకు ఆయన శాఖలో ఏం జరుగుతుందో ఆయనకే తెలియడం లేదని, బహిరంగంగా టెస్సరాక్ట్ కంపెనీ చైర్మన్ నేనే అని కొండల్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని, ఆయన కొడుకు సీఈవోగా ఉన్నారని, మరోవైపు రేవంత్ రెడ్డి సోదరుడికి దీనికి సంబంధం లేదని శ్రీధర్ బాబు సిగ్గులేకుండా బుకాయిస్తున్నాడని కేటీఆర్ తప్పుబట్టారు.
రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి ఏ అధికారం లేకపోయినా.. కలెక్టర్, ఎస్పీల సమక్షంలో కొడంగల్‌లో అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని, సీఎం అల్లుడి కోసం.. ఆయన పార్ట్‌నర్‌గా ఉన్న కంపెనీ కోసం.. కొడంగల్‌లోని లగచర్లలో గిరిజనుల భూములని లాక్కున్నారని కేటీఆర్ విమర్శించారు.
రేవంత్ రెడ్డి తన మరో సోదరుడు అనుముల జగదీష్ రెడ్డితో అమెరికాలో రూ.1000 కోట్లతో స్వచ్ బయో అనే కంపెనీ పేరు మీద MOU చేసుకున్నాడని, జగదీష్ రెడ్డికి కూడా ఎక్కడ భూమి ఇచ్చారో తవ్వి తీయాలి అన్నారు. మోదీ ప్రభుత్వంతో కలిసి రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డికి రూ.1137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చాడని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం కలిసి నడుపుతున్న సింగరేణిలో వేల కోట్ల కుంభకోణాలు సృజన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి అన్నారు. చదువూ, సంధ్యా లేని అనుముల అన్నదమ్ములు కోట్లు, సూట్లు వేసుకుని కొత్త దందాలకు తెరలేపారని ఆరోపించారు.
కొండల్ రెడ్డికి కంపెనీ కోసం స్పెషల్ రూల్స్, తిరుపతి రెడ్డికి ఏ హోదా లేకపోయినా ప్రోటోకాల్స్, అనుముల జగదీశ్ రెడ్డికి వెయ్యి కోట్ల MOUలు, సూదిని సృజన్ రెడ్డికి వేల కోట్ల కాంట్రాక్టులు, సత్యనారాయణ రెడ్డికి మెడికవర్ హాస్పిటల్స్, ఫార్మాలు అందించారని, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ దోపిడీని తప్పకుండా బయటపెడతాం అన్నారు. బినామీ బాగోతాలు, షెల్ కంపెనీల పేరిట రేవంత్ సోదరులు చేస్తున్న దోపిడీని బట్టబయలు చేస్తాం అని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు కంపెనీకి కొడంగల్ లో వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారన్నారు.
తెలంగాణలో 7 ప్రాజెక్టులను రద్దు చేసే అంశంపై GRMBలో జరిగే మీటింగ్‌ను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాయ్‌కాట్ చేయకపోతే జలసౌధని ముట్టడిస్తాం అని కేటీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ నాయకత్వంలో 7 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం అని, ఇవాళ ఆ అనుమతులు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పట్టుబడితే GRMB అజెండాలో పెట్టారు అని, తెలంగాణ బీజేపీ ఎంపీలకు సిగ్గుంటే ఆ మీటింగ్‌ను బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి సిగ్గుంటే మీరు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని మీ పార్టనర్ అడుగుతుంటే సిగ్గులేకుండా మాట్లాడటానికి మీకు నోరు ఏ విధంగా వస్తుందని ప్రశ్నించారు. కేంద్రం జుట్టు నా చేతుల్లో ఉందని నేను ఆడించినట్లే ఆడాలని చంద్రబాబు అనుకుంటే మేము ఊరుకోబోమని, తెలంగాణలో రైతుల తరపున మేము పోరాడుతాం అని స్పష్టం చేశారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వము అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటిస్తే ఒక్క బీజేపీ, కాంగ్రెస్ ఎంపీ కూడా నోరు మెదపలేదు అని, అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే కచ్చితంగా పోరాడి ఉండేవారు అన్నారు. గురువు చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి నీళ్లను ఎత్తిపోయకుండా కిందకు వదిలిన రేవంత్ రెడ్డి..ఇప్పుడు యాగాలు చేస్తే ఉపయోగం ఏం ఉంటుంది అని, ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే యాగం చేసినట్టు ఉంది అని కేటీఆర్ విమర్శించారు.
SIR ప్రక్రియ ద్వారా దాదాపు 74 లక్షల ఓట్లను తెలంగాణలో తొలగిస్తున్నారని, అలాగే.. మరో 60 లక్షల ఓట్లలో అవకతవకలు ఉన్నాయని అంటున్నారని, ఓవరాల్‌గా చూస్తే.. SIR ప్రక్రియ ముగిశాక 2 కోట్ల ఓట్లు మాత్రమే సక్రమంగా ఉన్నాయంటున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన వారి ఓట్లు పోకుండా ఉండేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం అన్నారు.
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మీడియా సమావేశంhttps://t.co/HHUyCrQPaV
— BRS Party (@BRSparty) August 11, 2026
