KTR | ఓయూలో జర్నలిస్టులపై పోలీసుల దురుసు ప్రవర్తన … ఖండించిన కేటీఆర్‌, హరీశ్‌రావులు

డీఎస్సీ వాయిదా వేయాల‌ని నిరుద్యోగ అభ్య‌ర్థుల‌తో పాటు బీఆరెస్సీ కార్యకర్తలు ఉస్మానియా యూనివర్సిటీలో చేసిన ఆందోళనపై విరుచకపడిన ఘటనను చిత్రీకరించే ప్రయత్నం చేసిన జర్నలిస్టుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడం వివాదస్పదమైంది.

KTR | ఓయూలో జర్నలిస్టులపై పోలీసుల దురుసు ప్రవర్తన … ఖండించిన కేటీఆర్‌, హరీశ్‌రావులు

విధాత, హైదరాబాద్ : డీఎస్సీ వాయిదా వేయాల‌ని నిరుద్యోగ అభ్య‌ర్థుల‌తో పాటు బీఆరెస్సీ కార్యకర్తలు ఉస్మానియా యూనివర్సిటీలో చేసిన ఆందోళనపై విరుచకపడిన ఘటనను చిత్రీకరించే ప్రయత్నం చేసిన జర్నలిస్టుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడం వివాదస్పదమైంది. పోలీసులు జీ 24చానల్‌ జర్నలిస్టును, కెమెరామెన్‌ను గల్లా పట్టి లాక్కెళ్లడం, తాము జర్నలిస్టులమని చెబుతున్నా పట్టించుకోకుండా దురుసుగా వ్యవహారించడం విమర్శలకు దారితీసింది. జర్నలిస్టుల పట్ల పోలీసుల వైఖరిని మార్చుకోవాలని, వెంటనే వారిని విడుదల చేయాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్య‌క్షుడు ప‌ల్లె ర‌వికుమార్ గౌడ్, డిప్యూటీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ మ‌హేశ్వ‌రం మ‌హేంద్ర డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ట్విటర్ వేదికగా బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఉస్మానియా యూనివర్సిటీలో..జీన్యూస్ రిపోర్టర్, కెమెరామెన్ లను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. విధి నిర్వహణలో భాగంగా…జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా ? డీఎస్సీ సమస్యపై నిరుద్యోగుల నిరసన చూపిస్తే పాపమా అని ప్రశ్నించారు. నిన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద.. మహిళా జర్నలిస్టులతో దురుసు ప్రవర్తన..ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జీన్యూస్ రిపోర్టర్ గల్లాపట్టి అక్రమ అరెస్టు విచారకరమన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా ? ప్రజాపాలన అంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమా..ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకింత నిర్బంధం ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి.. ఉస్మానియాలో ఉద్యమం నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయని, మళ్లీ పోలీసుల బూట్ల చప్పుళ్లు, ముళ్లకంచెలు అడగడుగునా దర్శనమిస్తున్నాయన్నారు. జర్నలిస్టులపట్ల పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో పత్రికాస్వేచ్ఛను హరిస్తే సహించే ప్రసక్తే లేదని, వెంటనే జీన్యూస్ జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

అటు మాజీ మంత్రి టి.హరీశ్‌రావు సైతం ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ట్విటర్ వేదికగా తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా? జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమేనని విమర్శించారు. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని, అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.