ఆరు గ్యారంటీలపై ప్రైవేట్ మెంబర్ బిల్లు : కేటీఆర్

ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ 800 రోజుల మోసంపై బీఆర్ఎస్ పోరాటం.

KTR

విధాత, హైదరాబాద్ : ఆరు గ్యారంటీల పేర్లు చెప్పి అడ్డగోలుగా ఓట్లు వేయించుకొని రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడుతున్నాం అని బీఆర్ఎస్ వర్కంగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రైవేట్ మెంబర్ బిల్లుపై పార్టీ లీగల్ సెల్ విభాగంతో పాటు, సీనియర్ నేతలతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ గ్యారంటీల గ్యారంటీల గారడీతో నాలుగు కోట్ల మందికి కాంగ్రెస్ పార్టీ టోపీ పెట్టింది అని, అధికారంలోకి వచ్చిన తొలిరోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల అభయహస్తం దస్త్రంపై తొలి సంతకం చేశారన్నారు. సరిగ్గా వారం రోజుల తర్వాత అప్పటి రాష్ట్ర గవర్నర్‌తో అసెంబ్లీ ఉభయ సభల సమావేశంలో చెప్పించారు అని గుర్తు చేశారు. 800 రోజులైనా 6 గ్యారంటీల అమలుకు అతీగతీ లేదు అన్నారు. సీఎం సంతకం చేసిన దస్త్రం కనిపించకుండా పోయిందని, అందుకే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోరుతూ ప్రైవేటు మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును సభలో అనుమతించాలని డిమాండ్ చేశారు.

ఆరు గ్యారంటీలను మూడు బడ్జెట్లు దాటినా కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం లేదని, అవసరమైన నిధులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు భారత రాష్ట్ర సమితి ప్రయత్నం చేస్తుందన్నారు. ఇందులో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అంశంపై ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలిపారు. ప్రపంచ ఎన్నికల వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో అత్యంత పెద్ద ఫ్రాడ్ అని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 840 రోజులు గడిచిపోయాయి కానీ అర గ్యారంటీ కూడా అమలు కాలేదు అన్నారు. శుక్రవారం నాడు శాసనసభలో మేం ప్రైవేటు బిల్లు పెట్టాలని నిర్ణయించాం. అందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను కోరుతున్నాం. కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన అంశమే కాబట్టి ఆ పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు.

మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు.. వెంటనే అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పింఛను రూ.2వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామన్నారు.. వెంటనే పెంచాలి. విద్యార్థులకు విద్యాభరోసా కార్డులు ఇస్తామన్నారు.. వెంటనే ఇవ్వాలి. కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తామన్నారు.. అదీ అమలు చేయాలి. మేం పెట్టే బిల్లు పాస్‌ అయితే, హామీలన్నీ చట్టప్రకారంగా అమలవుతాయి అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

Expiry Date On Eggs : మీకు తెలుసా? కోడిగుడ్డుకూ ఉంది..ఓ ఎక్స్ పైరీ డేట్ !
ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీకి కేంద్రం నిర్ణయం

Latest News