నువ్వు సొంతంగా ఎలక్షన్ అఫిడవిట్ నింపితే.. నేను ఏ ఛాలెంజ్‌కైనా రెడీ అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో కీలక సవాల్ విసిరారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ మోసాలపైన, ఇంజనీరింగ్ విద్యార్థులను “క్రిమినల్ వేస్ట్” అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడంపైన కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఇంజనీరింగ్ విద్యార్ధులను విమర్శిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తన జీవితంలో ఒక పోటీ పరీక్ష అయినా రాశాడా?, ఒక్క ఇంటర్వ్యూకైనా హాజరయ్యాడా? అని కేటీఆర్ ప్రశ్నించారు. నకల్ కొట్టి పాస్ అయినోడికి, గోడల మీద సున్నం వేసుకొని బతికినోడికే అంత ఉంటే…ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఎంత ఉండాలని.. ఎంతసేపూ పిల్లల మీద ఎడ్వడమేనా? అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విరుచుకపడ్డారు.
ఇంజనీర్లు కాదు..కాంగ్రెస్ పాలకులే క్రిమినల్ వెస్ట్
ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అంటే అందరం బాధపడ్డామని, విదేశాల్లో పనిచేస్తున్న మన ఇంజనీర్లు క్రిమినల్ వేస్టా? లేక రాహుల్ గాంధీ, రేవంత్ కలిసి ప్రకటించిన డిక్లరేషన్లు క్రిమినల్ వేస్టా? అని కేటీఆర్ నిలదీశారు. నీళ్లు పుష్కలంగా ఉన్నా.. వాటిని ఎత్తిపోయకుండా, వందల టీఎంసీల నీళ్లను సముద్రంలోకి వదలడం క్రిమినల్ వేస్ట్ అని, రూ.200 కోట్లతో అందాల పోటీలు పెట్టడం క్రిమినల్ వేస్ట్ అని, మెస్సీతో ఫుట్‌బాల్ ఆటకు రూ.100 కోట్ల ప్రజాధనం తగలేయడం క్రిమినల్ వేస్ట్ అని, తెలంగాణకు రేవంత్ అనే సన్నాసిని సీఎంగా పెట్టడమే క్రిమినల్ వేస్ట్ అని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్లో ఫ్లై ఓవర్లు కట్టిందెవరు? మన ఇంజనీర్లు కాదా? ఎల్లంపల్లి నుంచి రివర్స్ పంపింగ్ చేస్తున్నది ఇంజనీర్లు కాదా? నువ్వు కూసునే కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం కట్టింది ఇంజనీర్లు కాదా? అని రేవంత్ ను ప్రశ్నించారు. ఇంజనీర్లకు కట్టడం తెలుసు.. మీ పార్టీకి సమాధి కట్టడం కూడా తెలుసు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
జాబ్ క్యాలెండర్ పేరుత యువతకు కాంగ్రెస్ భారీ మోసం
తెలంగాణ యువతను కాంగ్రెస్, బీజేపీ మోసం చేసిందని, చట్ట సభల్లో పెట్టిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ కూడా దిక్కు లేదు అని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ కాదు.. జాబ్ లెస్ క్యాలెండర్ అని, ఎన్నికల ముందు డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని, రాష్ట్రంలో నిరుద్యోగులు నిర్వేదంలో ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలాకాలో ఒక నిరుద్యోగ యువకుడు లేఖ రాసి ఆత్మహత్యయత్నం చేశాడని, రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు ఒక చార్జ్‌షీట్ ఆ నిరుద్యోగి వేణు సూసైడ్ నోట్ అని కేటీఆర్ విమర్శించారు. ఆ సూసైడ్ నోట్‌కు సమాధానం చెప్పే సత్తా రేవంత్ రెడ్డికి, భట్టి విక్రమార్కకి, ఈ సర్కార్‌కి ఉందా? అని ప్రశ్నించారు.
నిరుద్యోగుల హామీల అమలుపై రాహుల్ గాంధీ ఎక్కడా..?
తెలంగాణ పిల్లలు ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడుతుంటే… ఎన్నికల్లో నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడని? కేటీఆర్ ప్రశ్నించారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికినట్టుగా రాహుల్ ఫోజులిస్తున్నాడని, ఇక్కడ ఆయన పార్టీ సీఎం ఇంజనీర్లను క్రిమినల్ వెస్ట్ అంటూ అవమానిస్తున్నాడని విమర్శించారు. రేవంత్ వ్యాఖ్యలపై ఈ రాహుల్ గాంధీ ఉలకడు, పలకడు అని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో 10 వేల ఉద్యోగాలు కూడా ఈ కాంగ్రెస్ సన్నాసులు ఇవ్వలేదన్నారు. నిరుద్యోగులు దయచేసి బలవన్మరణాలకు పాల్పడవద్దు అని, మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని భరోసా ఇచ్చారు. రాహుల్‌కు, రేవంత్‌కు విద్యార్థుల ముందుకొచ్చి మాట్లాడే దమ్ములేదు అని, ఇతర రాష్ట్రాల్లో లాఠీఛార్జీలు జరిగితే రాహుల్ పరిగెత్తుకొని పోతాడని, కానీ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లాఠీఛార్జీలు జరిగితే మాత్రం రాహుల్ గాంధీ రాడని కేటీఆర్ మండిపడ్డారు. నిరుద్యోగుల తరఫున రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తున్నామని, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నడపాల్సిందేనని, నిరుద్యోగుల తరఫున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ హయాంలో 7వేల ఐటీ ఉద్యోగాలు పోయాయి..
బీసీ రిజర్వేషన్లు ప్రధాని మోదీ ఆపారని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడని, ఆయన చేసిన తీర్మానం ఓ చిత్తు కాగితం వంటిదని కేటీఆర్ విమర్శించారు. విద్యా హక్కు చట్టాన్ని సోనియా గాంధీ తీసుకువస్తే.. ఆ చట్టాన్ని రేవంత్ తుంగలో తొక్కుతున్నారని, గురుకులాల్లో 150 మంది విద్యార్థులను చంపడం కాంగ్రెస్ సక్సెసా? అని, నిరుద్యోగులను ఎండ్రిన్ తాగి చావండని తిట్టడం సక్సెసా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చాక తెలంగాణలో టెక్ ఉద్యోగాలు తగ్గిపోయాయని, దాదాపు ఏడు వేల ఐటీ ఉద్యోగాలు తగ్గిపోయాయని, ఎందుకు పోయాయో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. విద్యా శాఖగా మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారని, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు.
ఆ నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ లతోనే వస్తున్నాయి..
జూలై నెల అంతా గోదావరిలో నీళ్లు పోతున్నా.. ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని, నీళ్లు ఎత్తకుండా రైతాంగాన్ని ఎండబెట్టిన వేస్ట్, క్రిమినల్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీదేనని కేటీఆర్ దుయ్యబట్టారు. నాలుగు టీఎంసీలు రాగానే.. హెలికాప్టర్ వేసుకొని వెళ్లి ఉత్తమ్ కుమార్ పోజులు కొట్టాడని, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీళ్లెలా వస్తున్నాయి? అని..కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన గాయత్రి పంప్ హౌస్, నందిమేడారం పంప్ హౌస్ నుంచి కాదా? అని, అసలు కాళేశ్వరంపై ఉత్తమ్ కుమార్‌కు అవగాహన ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులకు నీళ్లిచ్చే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని రైతులకు అర్థమైందని అన్నారు.
రేవంత్ రెడ్డి ప్రతి స్కీమ్ వెనుక ఓ స్కామ్
రేవంత్ రెడ్డి చేసే ప్రతి స్కీమ్ వెనక.. పక్కా ఒక స్కామ్ ఉంటదని, మెట్రోను ఎందుకు టేకోవర్ చేశాడు? అని, 280 ఎకరాలు కొట్టేయడానికి రేవంత్, ఆయన సోదరులు స్కెచ్ వేశారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో మెట్రోను అడ్డుకున్నదే ఈ కాంగ్రెస్, బీజేపీలేనన్నారు. లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు ట్రాఫిక్ ఉండదని అబద్ధం చెప్పారు అని విమర్శించారు. కాంగ్రెస్ దొంగల స్కామ్‌లను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామని, కాంగ్రెస్ అబద్ధాలను చీల్చిచెండాడుతున్నామనే బీఆర్ఎస్ నాయకులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందన్నారు.
ఈ మీడియా సమావేశంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు రాకేశ్ రెడ్డి పాల్గొన్నారు.
