బీఆరెస్ పుట్టుక సంచలనం.. పాలన ఆదర్శనీయం

తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా కేసీఆర్ 2001ఏర్పాటు చేసిన బీఆరెస్ పార్టీ(గతంలో టీఆరెస్‌) పార్టీ పుట్టుక ఒక సంచలనమని,దారి పొడవునా రాజీనేని రణమని, అలాగే తొమ్మిదిన్నరేళ్ల పాలన దేశానికి ఆదర్శనీయమని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

  • Publish Date - April 27, 2024 / 03:01 PM IST

పార్టీ ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్

విధాత : తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా కేసీఆర్ 2001ఏర్పాటు చేసిన బీఆరెస్ పార్టీ(గతంలో టీఆరెస్‌) పార్టీ పుట్టుక ఒక సంచలనమని,దారి పొడవునా రాజీనేని రణమని, అలాగే తొమ్మిదిన్నరేళ్ల పాలన దేశానికి ఆదర్శనీయమని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్‌లో పార్టీ పతాకావిష్కరణ చేసి మాట్లాడారు. ప్రతికూలతల మధ్య పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ ప్రజల సహకారంతోనే రాష్ట్రం సాకారం అయ్యిందన్నారు.

తెలంగాణ మట్లిలో పుట్టిన ఇంటి పార్టీ, ఈ నేల మేలుకోరే పార్టీ బీఆరెస్ పార్టీ అని, పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నతెలంగాణ ప్రజల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేమని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పరిమళాలు అందుకున్న స్వీయ రాజకీయ పార్టీ అని చెప్పారు. పడేళ్ల పాటు తమకు ప్రజలు అధికారం ఇచ్చారని, దానిని తాము సద్వినియోగం చేశామన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. తొమ్మిదిన్నరేళ్ల పరిపాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అహర్నిశలు కృషి చేశామని వెల్లడించారు.

తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న సదుద్దేశంతో భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చెందిందని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో బీఆరెస్‌కు అద్భుతమైన స్పందన లభించిందన్నారు. దురదృష్టవశాత్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాలేదని, అయినా వెనకడుగు వేయం.. రెట్టింపు వేగంతో దూసుకొస్తామన్నారు.

ఈ సమయంలో తమకు అండగా ఉన్న పార్టీ శ్రేణులు, నాయకులు అందరికీ ధన్యవాదాలు చెప్పారు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కృంగిపోమని ఇదే తీరుగా మా ప్రస్థానం సాగిందని గుర్తుచేశారు. తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అవసరం.. తెలంగాణ కంటూ ఉన్న ఒక ఇంటి పార్టీ అవసరం.. అదే బీఆరెస్ అని కేటీఆర్ చెప్పారు.

ట్విటర్‌లో బీఆరెస్ ప్రస్థానాన్ని కీర్తించిన కేటీఆర్‌

ట్విటర్‌లో బీఆరెస్ పార్టీ పుట్టుక..ప్రస్థానాన్ని కీర్తిసూ కేటీఆర్ కవితాత్మక ట్వీట్ చేశారు. తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటి పార్టీ..ఈ భూమి పుత్రుల పార్టీ..పేగు తెంచుకున్న ప్రేమబంధం..సమరంలో సంబురంలో కలబోసుకున్న అనుబంధం..తెంచలేని సంబంధం..తెలంగాణ దళం..గళం బీఆరెస్ అని పేర్కోన్నారు. అలాగే వేయి దాడులు.. లక్ష కుట్రలు, విష ప్రచారాలు, విచ్ఛిన్న పన్నాగాలను ఎదిరించి నిలిచిన దండి గుండె దళపతి నెత్తురు మండి ఎత్తిన జెండా అని, ఏ పాత్రలో వున్నా జనమే ఎజెండా, మొన్నటి పోరాటం ప్రపంచానికే పాఠం, నిన్నటి పాలన దేశానికే నయా నమూనా. నేడు.. ప్రజాపక్షంవహించే సమర్థ ప్రతిపక్షం అని చెప్పుకొచ్చారు.

Latest News