KTR| మెట్రోపై ప్రభుత్వ నిర్ణయం బాధ్యతారాహిత్యం-కేటీఆర్
మెట్రో నిర్వహణ నుంచి ఎల్ఆండ్ టీ తప్పకోవడం.. రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాలని నిర్ణయించడం సరైంది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

విధాత, హైదరాబాద్ : మెట్రో రైలు(Hyderabad Metro) నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ తప్పుకోవడం( L&T Exit) ప్రభుత్వ బాధ్యతారాహిత్యం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. మెట్రో నిర్వహణ నుంచి ఎల్ఆండ్ టీ తప్పకోవడం.. రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాలని నిర్ణయించడం సరైంది కాదన్నారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 2070 వరకు లీజు ఉన్న కూడా అర్ధాంతరంగా ఎల్ అండ్ టీ సంస్థ హైదరాబాద్ మెట్రోను ఎందుకు విడిచిపెట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి అహంకారం, నియంతృత్వ పోకడల వల్ల ప్రపంచంలోనే పేరొందిన ఎల్ అండ్ టీ సంస్థ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి ఆర్టీసీనే నడిపే మొఖం లేదు కానీ రూ. 15 వేల కోట్లు మీద వేసుకొని హైదరాబాద్ మెట్రోను నడుపుతాడా? అని ప్రశ్నించారు. పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న తెలంగాణకు మెట్రో నుంచి ఎల్ ఆండ్ టీ వెళ్లిపోవడం ఒక మాయని మచ్చ అని కేటీఆర్ అభివర్ణించారు.ఫ్రీ బస్ వల్ల మెట్రోకు జరుగుతున్న నష్టం గురించి మాట్లాడినందుకు.. స్వయాన ముఖ్యమంత్రినే ఎల్ అండ్ టీ సీఎఫ్‌వోను జైల్లో వేయమని చెప్పినా అన్నాడని.. ఇంత అరాచకమా? తప్పులు ఎత్తి చూపితే జైల్లో వేస్తారా? అని కేటీఆర్ నిలదీశారు.
కేసీఆర్ హయాంలోనే మెట్రోకు ఊతం
కేసీఆర్ ప్రభుత్వం హయాంలో మెట్రోకు మరింత ఊతమిచ్చాం అని..మెట్రో మొదటి దశను మూడేళ్లలో పూర్తి చేశాం అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. . 2008లో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు పబ్లిక్ ప్రయివేటు పార్ట్‌నర్‌షిప్‌లో మెట్రో కోసం టెండర్లు పిలిచారు. ముందుగా మెటాస్ సంస్థ వచ్చిందని..తర్వాత ఆ సంస్థ వెనక్కిపోయి ఎల్ అండ్ టీ టెండర్ తీసుకుందని గుర్తు చేశారు. 2014లో మేము వచ్చే సరికి 20 శాతం మెట్రో పనులు పూర్తయ్యాయి. కేసీఆర్ పట్టుబట్టి 2017 వరకు మొదటి దశమెట్రో పూర్తి చేశారు. 69 కిలోమీటర్ల మెట్రోను పూర్తి చేశాం. మేము దిగిపోయేనాటికి దేశంలో రెండో అతిపెద్ద మెట్రోగా తయారు చేశాం. మెట్రోను మైండ్‌స్పేస్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు తీసుకెళ్లాలి అనుకున్నాం. దశలవారీగా మెట్రో విస్తరణ పూర్తి చేయాలని అనుకున్నామని..37 కిలోమీటర్ల ఎయిర్‌పోర్టు మెట్రోకు బీఆర్ఎస్ ప్రభుత్వం అంకురార్పణ చేసిందన్నారు. అన్నివైపుల మెట్రో విస్తరణకు సమగ్రమైన ప్రణాళిక రూపొందించాం అని తెలిపారు. మెట్రోకు రూ. 900 కోట్లు రుణం కూడా ఇచ్చాం అని గుర్తు చేశారు. పీక్ అవర్స్‌లో సరిపోవట్లేదు కోచ్‌లో పెంచండి అని అడిగారు. అందుకు అనుగుణంగా కోచ్‌లు కూడా పెంచామని కేటీఆర్ తెలిపారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం మెట్రో నిర్వహణ తీసుకోవడాన్ని గొప్ప పని అన్నట్లుగా మీడియా కొనియాడటాన్ని కేటీఆర్ తప్పుబట్టారు.
ఎల్ఆండ్ టీ తో సీఎం రేవంత్ రెడ్డికి పంచాయితీ
400 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు కేసీఆర్ కేబినెట్ పచ్చజెండా ఊపిందని తెలిపారు. 160 కిలోమీటర్లు ఓఆర్ఆర్ చుట్టూ, అలాగే భువనగిరి, సంగారెడ్డి, షాద్‌నగర్, కడ్తాల్ దాకా కేబినెట్ ఆమోదం ఇచ్చాం అని.. దశల వారీగా చేస్తామని చెప్పాం. ప్రజా రవాణాకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మెట్రోను కాపాడుకుంటూ, విస్తరణకు ఏర్పాట్లు చేసుకుంటూ.. సమగ్రమైన ప్రణాళికతో ముందుకు పోయామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి రాగానే మొదట్టమొదటి నిర్ణయం.. ఎయిర్ పోర్టు మెట్రోను అనాలోచితంగా రద్దు చేశారన్నారు. మేం అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి నిర్మాణం అయిపోయేది.. రెండేండ్లు దాని టర్మ్ అని.. కేటీఆర్ భూములు ఉన్నాయన్న ఆరోపణలో దానిని రద్దు చేసి..ఎల్ అండ్ టీకి దెబ్బ కొట్టారన్నారు. వాళ్లను వెళ్లగొట్టారని..అక్కడ్నుంచి రేవంత్ రెడ్డికి ఎల్ అండ్ టీకి పంచాయతీ మొదలైంది అని కేటీఆర్ గుర్తు చేశారు.