తెలంగాణ ఉద్యమంలో కార్మికులది ఎనలేని పాత్ర
తెలంగాణ ఉద్యమంలో కార్మికవర్గం నిర్వహించిన పాత్ర ఎనలేనిదని, సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు జంగ్ సైరన్ చేయడంతో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయిందన్నారు

- లంగలకు దొంగలకు ఓట్లు వేయోద్దు
- కేసీఆర్ ఆనవాళ్లు తొలగించడం
- రేవంత్‌రెడ్డి జేజమ్మ తరం కాదు
- బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
విధాత: తెలంగాణ ఉద్యమంలో కార్మికవర్గం నిర్వహించిన పాత్ర ఎనలేనిదని, సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు జంగ్ సైరన్ చేయడంతో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయిందన్నారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులు నిరవధికంగా అండగా నిలిచారు. పబ్లిక్ సెక్టార్‌లో పని చేసే కార్మికులు కూడా తమ విధులను బహిష్కరించి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. ఇలా అనేక పోరాటాల తరువాత సాధించుకున్న తెలంగాణలో అద్భుతాలు జరిగాయన్నారు. మే డే సందర్భంగా కేటీఆర్ కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ అనవాళ్లు లేకుండా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలంటే రేవంత్ రెడ్డి కాదు కదా ఆయన జేజమ్మ వల్ల కూడా కాదన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలన్నారు. ఎందుకంటే తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కేసీఆర్ అని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ తన పాత బాస్‌తో కలిసి అటు ఇటు చేసి కలుపుకుంటే తప్ప కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసే సత్తా తనకు గానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ లేదన్నారు.
కరోనా సమయంలో మోదీ కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఆ రోజులు మరిచిపోవద్దు. మరిచిపోయి లంగలకు ఓట్లు వేస్తే మన నెత్తి మీద కూర్చుంటారన్నారు. ముడి చమురు ధర తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ఘనత మోదీదేనని వెల్లడించారు. అదానీ, అంబానీలకు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణాలు మాఫీ ఆ భారమంతా ప్రజలపై మోపుతున్నాడన్నారు. తాను చెప్పింది తప్పు అని బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు రుజువు చేస్తే రేపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చిరుద్యోగులను కేసీఆర్ మంచిగా చూసుకున్నాడు. 20,455 వీఆర్ఏలను, 25 వేల ఔటో సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగులను క్రమబద్దీకరించామన్నారు. 5 వేల మంది పీఏసీఎస్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని కేసీఆర్ అమలు చేశారన్నారు. 3,974 మంది సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మినీ అంగన్‌వాడీలను మెయిన్ అంగన్‌వాడీలుగా నియమించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేశారు. సింగరేణి లాభాల్లో 20 శాతం వాటా కార్మికులకు ఉండేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత లాభాల్లో 32 శాతం వాటా ఇచ్చారు. అంతేకాకుండా అంగన్‌వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, సెర్ప్ ఉద్యోగులకు, జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికులకు కేసీఆర్ జీతాలు పెంచారని తెలిపారు.
లంగలకు, దొంగలకుఓట్లు వేయమని శ్రీరాముడు చెప్పలేదు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల తరపున పోరాటం చేస్తాం. ఎంపీ ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటించాం. ఈ ఎన్నికల్లో 12 సీట్లు గెలిపిస్తే రాబోయే సంవత్సర కాలంలో తెలంగాణ రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారని కేటీఆర్ వెల్లడించారు.