KTR | కొండా సురేఖ వ్యాఖ్యలు చాలా అసహ్యంగా ఉన్నాయి :  కోర్టులో కేటీఆర్ వాంగ్మూలం

కేటీఆర్ కొండా సురేఖ‌పై(Konda Surekha) దాఖ‌లు చేసిన ప‌రువు న‌ష్టం కేసులో వాంగ్మూలాన్ని నాంప‌ల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న‌మోదు చేసింది మంత్రి కొండా సురేఖపై క్రమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి ప్రత్యేక కోర్టును ఈ సందర్బంగా కేటీఆర్ అభ్యర్థించారు

KTR | కొండా సురేఖ వ్యాఖ్యలు చాలా అసహ్యంగా ఉన్నాయి :  కోర్టులో కేటీఆర్ వాంగ్మూలం

KTR | హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నీచమైన వ్యాఖ్యల‌(Nasty comments)తో త‌న ప‌రువు, ప్రతిష్ట దెబ్బతిన్నాయ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పేర్కొన్నారు. కొండా సురేఖ‌పై(Konda Surekha) దాఖ‌లు చేసిన ప‌రువు న‌ష్టం కేసులో కేటీఆర్ వాంగ్మూలాన్ని నాంప‌ల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న‌మోదు చేసింది. తనపై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి ప్రత్యేక కోర్టును ఈ సందర్బంగా కేటీఆర్ అభ్యర్థించారు.

న్యాయస్థానంలో కేటీఆర్ వాంగ్మూలం

సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉన్న నాకు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర మనస్తాపం  కలిగించాయన్న కేటీఆర్​ను కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏమిటి అని, వాటి గురించి వివరాలు చెప్పగలరా అని న్యాయమూర్తి కేటీఆర్‌ను ప్రశ్నించింది. దీంతో ఫిర్యాదు కాపీలో వివరాలన్నీ సమగ్రంగా ఉన్నాయని న్యాయస్థానానికి కేటీఆర్ తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో వాటినే ప్రామాణికంగా తీసుకోవాలా? లేకుంటే ప్రత్యేకంగా వివరిస్తారా? అని కోర్టు మళ్లీ ప్రశ్నించగా, మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చాలా అసహ్యంగా ఉన్నాయన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల తాలూకు సవివర రాతపూర్వక ఫిర్యాదును కోర్టు  ముందుంచాన‌ని, తను చేసిన చౌకబారు వ్యాఖ్యల‌ను నేరుగా తన నోటితో చెప్పలేను అని న్యాయమూర్తికి కేటీఆర్ విన్నవించారు.  ఒక బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ,  కుట్రపూరితంగా, తీవ్ర ఆగ్రహావేశాలతో ఉచ్ఛనీచాలు మరిచి తనపై అసత్యపూరిత వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ ఆరోపించారు.

బాధ్యత గ‌ల ప‌ద‌విలో ఉన్న మ‌హిళా మంత్రి నా ప‌రువుకు భంగం(defamed) క‌లిగించేలా వ్యాఖ్యానించారని, సాక్షులు దాసోజు శ్రవ‌ణ్, బాల్క సుమ‌న్, స‌త్యవ‌తి రాథోడ్.. తనకు 18 ఏండ్లుగా నాకు తెలుసని,  కొండా సురేఖ వ్యాఖ్యల‌ను టీవీలో చూసి వాళ్లు తనకు ఫోన్ చేసి చెప్పారన్నారు. సురేఖ వ్యాఖ్యలు తన ప‌రువు, ప్రతిష్టలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి కూడా న‌ష్టం చేయడానికి ఉద్దేశించినవని తాను భావిస్తున్నట్లు కేటీఆర్ త‌న వాంగ్మూలంలో పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఆమె ఇలాంటి వాఖ్యలు చేసిందని కేటీఆర్ ఆరోపించారు.

ఈ కేసులో మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 30వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. కాగా, ఇదే విషయంపై సినీనటుడు నాగార్జున కూడా కొండా సురేఖపై మరో దావా వేసారు.