Local Body Elections | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు షురూ.. డిపాజిట్ ఎంత చేయాలంటే..?
Local Body Elections | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. తొలి విడుతలో 292 జడ్పీటీసీ, 2,964 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Local Body Elections | హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. తొలి విడుతలో 292 జడ్పీటీసీ, 2,964 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది.
నామినేషన్ల దాఖలు ఎక్కడంటే..?
జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు జిల్లా పరిషత్ కార్యాలయంలో, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది.
డిపాజిట్ ఎంత చేయాలి..?
జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు విషయంలో జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ. 5 వేలు, అదే రిజర్వేషన్ అభ్యర్థి అయితే రూ. 2500 డిపాజిట్ చేయాలి. ఎంపీటీసీ నామినేషన్ దాఖలు చేసే జనరల్ అభ్యర్థి రూ. 2500, రిజర్వేషన్ అభ్యర్థి రూ. 1250 డిపాజిట్ చేయాలని ఎన్నికల సంఘం సూచించింది.
ఐదుగురికే అనుమతి..!
ఇక నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అభ్యర్థితో కలిపి ఐదుగురికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయం ఉంది. ఆ తర్వాత నామినేషన్లను స్వీకరించే అవకాశం లేదు.