Elections Campaign | ముగిసిన ప్రచారం… మూగబోయిన మైకులు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు ఏపీలోని 25 పార్లమెంట్‌, 175 అసెంబ్లీ స్థానాలకు 13న పోలింగ్‌ జరగనున్న సంగతి తెలిసిందే

Elections Campaign | ముగిసిన ప్రచారం… మూగబోయిన మైకులు
  • మూడు వారాల పాటు ప్రధాన పార్టీల ఉధృత ప్రచారం
  • ప్రధాని, కాంగ్రెస్‌ అగ్రనేతల రాకతో రాష్ట్రంలో హీటెక్కిన ప్రచారం
  • కేసీఆర్‌ బస్సు యాత్రతో పార్టీ శ్రేణులకు భరోసా
  • ప్రచార బాధ్యతంతా తనపై వేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు ఏపీలోని 25 పార్లమెంట్‌, 175 అసెంబ్లీ స్థానాలకు 13న పోలింగ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల ప్రచారం శనివారం సాయంత్రం వరకు ఉధృతంగా సాగింది. ప్రచారంలో నేతల మధ్య మాటల యుద్ధం రాజకీయ వేడిని రగిలించింది. శనివారం సాయంత్రంలో ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి.

తెలంగాణలో శుక్రవారం ప్రధాని మోడీ, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ సహా అనేకమంది ముఖ్యనేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. రాష్ట్రంలోని 16 స్థానాల్లో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నది. బహిరంగ సభలు, కార్నర్‌ మీటింగ్‌లు, సమావేశాలు, రోడ్‌షోలకు అన్ని పార్టీలు అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. చివరి రోజు కేంద్ర హోం మంత్రి, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రచారంలో పాల్గొని ఆయా పార్టీల కార్యకర్తల్లో ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి 27 రోజుల్లో 57 సభల్లో ప్రచారం చేశారు. ఒకే రోజు వివిధ నియోజకవర్గాల్లో 4 రోడ్‌ షోలు, సమావేశాల్లో పాల్గొన్నారు. కేసీఆర్‌, మోడీలపై విరుచుకుపడుతూ.. 100 రోజుల్లో తమ పాలనలో అమలు చేసిన ఐదు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీలతోకలిసి ప్రచార సభల్లోనూ పాల్గొన్నారు. తన ప్రసంగాల్లో విపక్ష నేతలపై పదునైన విమర్శలు చేస్తూ కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు కేకే, కడియం లాంటి కీలక నేతలు చివరి నిమిషంలో పార్టీని వీడి కేసీఆర్‌కు షాక్‌ ఇచ్చారు. దీంతో నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణులను, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికి కేసీఆర్‌ బస్సు యాత్ర చేపట్టారు. 16 రోజుల్లో 13 నియోజకవర్గాల్లో కేసీఆర్‌ యాత్ర సాగింది. ఏప్రిల్‌ 24న మిర్యాల గూడలో ప్రారంభమైన బస్సు యాత్ర శుక్రవారం (మే 10న ) సిరిసిల్లలో రోడ్‌ షో, సిద్ధిపేటలో బహిరంగ సభతో ముగిసింది.

బీజేపీకి ఉత్తరాదిన గత ఎన్నికల్లో గెలిచిన సీట్లకు గండి పడుతుందనే ప్రచారం జరిగింది. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఈసారి ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యంగా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సహా ఆపార్టీ జాతీయ నేతలు బీజేపీ లోక్ సభ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. గతంలో గెలిచిన నాలుగు సీట్లను నిలబెట్టుకోవడంతోపాటు డబుల్‌ డిజిట్ సీట్లను దక్కించుకోవాలనే ఆ పార్టీ అగ్రనేతలు ప్రచారం చేశారు.