విధాత, హైదరాబాద్ : సెప్టెంబర్ మాసంలో తెలంగాణ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరుగనుందని పీసీసీ చీఫ్ బీ.మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ నెలలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అసమ్మతికి, ప్రభుత్వ పాలనలో నెలకొన్న సమస్యలకు కేబినెట్ పునర్ వ్యవస్థీకరణతో సమాధానం లభిస్తుందని చెప్పుకొచ్చారు. కేబినెట్ ప్రక్షాళన జరుగాలన్నది నా అభిప్రాయం అని, కేబినెట్ లో మార్పులు, చేర్పులపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. మంత్రివర్గం కూర్పు సీఎంకు సంబంధించిన అంశం అని..రాజగోపాల్ రెడ్డి గతంలో పార్టీ హైకమాండ్ మంత్రి పదవి ఇస్తామన్నది నిజమేనన్నారు.
నాకు మంత్రి పదవి ఇస్తే తీసుకుంటా..
నేను స్వతహాగా మంత్రి పదవి కోరుకోవడం లేదని, హైకమాండ్ కేబినెట్ లో చేరమంటే మంత్రి పదవి స్వీకరిస్తానని స్పష్టం చేశారు. బీసీ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించి నాకు మంత్రి పదవి ఇస్తారనడంలో వాస్తవం లేదన్నారు. బీసీలకు మంత్రివర్గంలో ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని కోరడంలో తప్పులేదు అన్నారు. రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ కులగణన, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేసిందని, అదే బీసీ పీఎం నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం కులగణనకు, బీసీ రిజర్వేషన్ల ఆమోదానికి వెనుకడుగు వేస్తుందని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.
అంతర్గత విబేధాలు కాంగ్రెస్ లో సహజం…
సీఎం రేవంత్ రెడ్డితో తనకు అభిప్రాయ బేధాలు లేవని, కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని, అందుకే గ్రూప్ తగాదాలు సాధారణంగా కనిపిస్తుంటాయన్నారు. పార్టీ లైన్ ధాటితే పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకుంటుందన్నారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి వివాదంపై నివేదికను హైకమాండ్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. రీజినల్ పార్టీ మాదిరిగా కాంగ్రెస్ పార్టీలో వెంటనే చర్యలు తీసుకోవడం జరుగకపోయినా..క్రమశిక్షణా చర్యలు ఉంటాయన్నారు. పీసీసీ చీఫ్ గా నేను గ్రూపులు కట్టలేనని, న్యూట్రల్ గా కొనసాగుతానన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అని, పార్టీ అధ్యక్షుడిగా ప్రభుత్వానికి అవసరమైన సలహాలు,సూచనలు ఇస్తాం అన్నారు.
హామీలన్ని అమలు చేస్తాం…మళ్లీ వస్తాం..
30 నెలల్లో పార్టీ ఇచ్చిన హామీలను కొన్నింటిని అమలు చేశామని, పెన్షన్ల పెంపు వంటి మరిన్ని హామీలను మా ప్రభుత్వం పదవీ కాలం ముగిసేలోగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి..మళ్లీ అధికారంలోకి వస్తాం అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మరోసారి అధికారం దక్కదని, ఆ పార్టీ కథ ముగిసిపోయిందన్నారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన వారు తప్పకుండా మా ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెస్తారన్నారు. సోషల్ మీడియా ప్రభావం ఓటర్లపై తక్కువగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం అప్పులు, భూముల అమ్మకాలు చేయడానికి..మాకు తేడా ఉందని, మేం కేవలం గత అప్పులతో దెబ్బతిన్న వ్యవస్థను గాడిన పెట్టేందుకు, సంక్షేమ పథకాలకు మాత్రమే అప్పులు, భూముల అమ్మకాలు చేస్తున్నామని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
కాంగ్రెస్ హైకమాండ్ కు తెలంగాణ ఏటీఎం అన్న ఆరోపణలు ప్రతిపక్షాల దుష్ప్రచారం మాత్రమేనన్నారు. మిగతా పార్టీల కంటే మా పార్టీ ఫండ్ చాల తక్కువగా ఉందన్నది గుర్తించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి, 30శాతం కమిషన్ల ఆరోపణలు అవాస్తవం అన్నారు. 22ఏతో ప్రభుత్వానికి నష్టం జరుగుతుందన్న వాదనపై ప్రభుత్వం ఇప్పటికే దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని, సీఎం, మంత్రి జరిగిన తప్పులను వెంటనే సరిచేయాలని ఆదేశాలు ఇచ్చారని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ, ఉద్యోగాల కల్పన, కులగణన సహా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మాకు మళ్లీ అధికారం అందిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
