వెలిగొండ ప్రారంభం..సొరంగాలు దాటని ఎస్ఎల్బీసీ పనులు!

ఆంధ్రప్రదేశ్ సాగు, తాగునీటి వనరుల విస్తరణలో కీలకమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఆగస్టు 31న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జాతికి అంకితం కానుంది. వెలిగొండ ప్రాజెక్టు పనులతోనే ప్రారంభమైన తెలంగాణ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు నేటికి పూర్తి కాకపోవడం విమర్శలకు తావిస్తుంది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Aug 30, 2026, 2:30 pm IST
Read Time: 14 mins
వెలిగొండ ప్రారంభం..సొరంగాలు దాటని ఎస్ఎల్బీసీ పనులు!

విధాత : ఆంధ్రప్రదేశ్ సాగు, తాగునీటి వనరుల విస్తరణలో కీలకమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఆగస్టు 31న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జాతికి అంకితం కానుంది. 1989లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సూచన మేరకు, డాక్టర్ కె. రామకృష్ణయ్య ప్రతిపాదనల ఆధారంగా వెలిగొండ ప్రాజెక్టు రూపకల్పన చేయబడింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక 1994లో ఖరారైంది. 30 ఏళ్ల కిందట గొట్టిపడియ దగ్గర మార్చి 5, 1996న చంద్రబాబునాయుడు పునాది రాయి వేసి భూమి పూజ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2004 అక్టోబరు 27న మళ్ళీ అదే గొట్టిపడియ దగ్గర వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జల యజ్ఞంలో భాగంగా పరిపాలన అనుమతులు మంజూరీ చేసి శంకుస్థాపన చేసి నిధులు విడుదల చేశారు. 1996లో 980 కోట్ల అంచనా వ్యయం ఉన్న ప్రాజెక్టు విలువ 2005 నాటికి 5,500 కోట్లకు చేరింది. ప్రస్తుతం అంచనా వ్యయం 10,200 కోట్లు చేరగా..ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తవ్వడంతో సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవం చేయబోతున్నారు.

వెలిగొండ ప్రాజెక్టు స్వరూపం..లక్ష్యం

కృష్ణా బేసిన్ లోని  శ్రీశైలం జలాశయం నుంచి వరదల సమయంలో 30 రోజుల్లో 43.50 టీఎంసీల నీటిని తరలించే లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టును డిజైన్ చేశారు. కృష్ణాలో వరద కొనసాగుతున్న సమయంలో శ్రీశైలం రిజర్వాయర్ 841 అడుగుల వద్ద బ్యాక్ వాటర్ నుంచి 43.50 టీఎంసీలు తరలించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా రెండు సొరంగాలు.. ఒక టన్నెల్ 7 మీటర్ల వ్యాసంతో, మరొకటి 9.2 వ్యాసంతో 18.8 కిలోమీటర్ల పొడవున నిర్మించేందుకు నిర్ణయించారు. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల పరిధిలోని మొత్తం 30మండలాల పరిధిలోని  4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.

కరువు కాటకాలు, ఫ్లోరైడ్‌ సమస్యలకు చెక్‌ పెట్టడంలో వెలిగొండ కీలకం కానుంది. సొరంగాలను పూర్తి చేయడంతో మెయిన్ కెనాల్స్, హెడ్ రెగ్యులేటర్లు, అప్రోచ్ ఛానళ్లు, ఫీడర్ ఛానళ్లు, రిజర్వాయర్లు నిర్మించారు. ప్రాజెక్టులో భాగంగా వెలుగొండ కొండల మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన ప్రాంతంలో 53.85 టీఎంసీలు సామర్థ్యంతో ‘నల్లమల సాగర్’ రిజర్వాయర్‌ను ఏర్పాటు చేశారు.

సొరంగాలలోనే ఎస్ఎల్బీసీ పనులు

శ్రీశైలం రిజర్వాయర్ కు ఏపీ పరిధిలో కుడి వైపున వెలిగొండ, తెలంగాణ పరిధిలో ఎడమవైపున శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్(ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టుల పనులను  ఒకేసారి ప్రారంభించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయ్యి ఆగస్టు 31న జాతికి అంకితం కాబడుతుండగా..శ్రీశైలం లెప్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టు పనులు మాత్రం ఇంకా సొరంగాలను దాటకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒకే రోజు ప్రారంభమైన వెలిగొండ, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల డిజైన్ల ఖరారు..నిధుల కేటాయింపులలోనూ వివక్షత కొనసాగింది. వెలిగొండకు 30రోజుల వరద జలాలను లెక్క గట్టి 43.50టీఎంసీతో డిజైన్ చేయగా..ఎస్ఎల్బీసీకి వరద రోజులను 90 రోజులుగా లెక్కగట్టి 30 టీంసీలతో  డిజైన్ చేశారు.

వెలిగొండ ప్రాజెక్టు నీటి తరలింపు సామర్యం 17వేల క్యూసెక్కులు కాగా, ఎస్ఎల్బీసీ సొరంగం నీటి తరలింపు సమర్థం 4వేల క్యూసెక్కులే కావడం గమనార్హం. రెండు ప్రాజెక్టులు కూడా టీబీఎం మిషన్ల సమస్యలతో ఆగి, సాగినప్పటికి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ పాలకుల చొరవతో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి నోచుకుంది. తెలంగాణ స్వరాష్ట్రంలోనూ ఎస్ఎల్బీసీ పనులలో..నిధుల కేటాయింపులలో పాలకుల వివక్షత నేపథ్యంలో పనులలొ  తీవ్ర జాప్యం ఏర్పడి..నది జలాల వినియోగంలో రాష్ట్రం వెనుకబడే పరిస్థితి దాపురించింది.

ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు స్వరూపం..లక్ష్యం

కృష్ణా నది పరిధిలోని  శ్రీశైలం రిజర్వాయర్  బ్యాక్ వాటర్ నుంచి 30టీఎంసీలను  ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు  సొరంగం మార్గం ద్వారా తరలించాలని నిర్ణయించారు. కరవు, ఫ్లోరైడ్ పీడిత ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలోని 3 లక్షల ఎకరాలకు సాగునీరు,  516 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టు డిజైన్ చేశారు.  1983లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు పునాదిరాయి పడగా..రెండు దశాబ్దాలు పాటు ఎలాంటి పనులు జరగలేదు. 2004లో వైఎస్సార్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. 1,968కోట్ల అంచనా వ్యయంతో వైఎస్సార్ ప్రభుత్వం 2005 ఆగస్టు 11న పరిపాలన అనుమతులు ఇచ్చి 2006లో పనులకు శంకుస్థాపన చేసి 2007లో పనులు ప్రారంభించింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పూర్తి గ్రావిటీ ద్వారా అచ్చంపేట మండలం మన్నెవారి పల్లి వరకు కృష్ణా నీటిని తరలించేందుకు 43.930కిలోమీటర్ల సొరంగం తవ్వాలని నిర్ణయించారు.

మిగిలిపోయిన  9 కిలో మీటర్ల సొరంగం పనులు

ఎస్ ఎల్బీసీ సొరంగాన్ని రెండు వైపుల నుంచి ఇన్ లెట్, ఔట్ లెట్ పద్దతిలో తవ్వుతున్నారు. సొరంగంలో రెండు వైపుల నుంచి తవ్వకం పనులు మొదలు పెట్టి ఇప్పటిదాకా 34.71కిలోమీటర్లు పూర్తి చేశారు. మరో 9.56 కిలో మీటర్లు తవ్వాల్సి ఉంది. ఔట్ లెట్ లో 20.796 కిలో మీటర్లు తవ్వగా..మరో 3.545కిలో మీటర్లు తవ్వాల్సి ఉంది. 2023లో టీబీఎం బోరింగ్ మిషన్ పాడైపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఇన్ లెట్ లో దోమలపెంట నుంచి 13.936కిలో మీటర్ల పనులు పూర్తవ్వగా..6.015కిలో మీటర్లు తవ్వాల్సి ఉంది.ప్రస్తుత ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ. 4,637కోట్లకు చేరింది. ఇప్పటివరకు సుమారు రూ.మూడువేల కోట్లకు పైగా ఖర్చు చేశారు.

సొరంగం కూలిన ప్రమాదంతో  పనులు మరింత ఆలస్యం..

షీయర్ జోన కారణంగా ఇన్ లెట్ సొరంగంలో పెద్ద ఎత్తున నీరు, బురద ఉబికి వస్తుండటంతో 2019లోనే పనులు ఆగిపోయాయి. తిరిగి సొరంగంలో 14వ కిలోమీటర్ వద్ద 2025 ఫిబ్రవరి 22న టీబీఎంతో పనులు కొనసాగిస్తున్న నేపథ్యంలో సొరంగం కుప్పకూలింది. ప్రమాదంలో 8 మంది కార్మికులు మరణించిన ఘటనతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులలో మరింత ఆటంకం,ఆలస్యం అనివార్యమైపోయింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఇద్దరి మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. శాస్త్రీయ అధ్యయనం అనంతరం ఏడాది ఫిబ్రవరి 16 నుంచి పనులు పునః ప్రారంభించారు. ప్రమాదం జరిగిన చోట సొరంగం త్రవ్వకం నిలిపివేసి..పక్క నుంచి బైపాస్ సొరంగం త్రవ్వకం పనులతో ముందుకెలుతున్నారు.

జపాన్ నుంచి రూ.15 కోట్ల వ్యయంతో తెప్పించిన అత్యాధునిక త్రీ ఆర్మ్ బూమర్ ద్వారా ప్రమాదం జరిగిన షీర్ జోన్​ కు సమాంతరంగా చేపట్టిన బైపాస్ సొరంగం తవ్వకం పూర్తయింది. ప్రమాదం తర్వాత ఇప్పటి వరకు సుమారు 500 మీటర్ల మేర సొరంగం తవ్వకం పూర్తయింది. ఇంకా దాదాపు 9.2 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంది. ఇన్ లెట్ నుంచి బైపాస్ టన్నెల్ తవ్వకం 141మీటర్లు పూర్తవ్వగా..మరో 240మీటర్లు తవ్వితే ఔట్ లైట్ వైపు అలైన్మెంట్ లో కలవనుంది. ప్రమాదం జరిగినప్పుడు ఇన్ లెట్ లో టీబీఎంను కట్ చేసి తొలగించగా..ఔట్ లెట్ వైపు టీబీఎంను కూడా తొలగించి డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్దతిలో పనులు కొనసాగిస్తున్నారు.

మరో నాలుగు డేంజర్ జోన్లు..మే 2028నాటికి పనుల పూర్తి?

ఎస్ఎల్బీసీ సొరంగంలోని మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగ మార్గంలో నాలుగు డెంజర్ జోన్లు ఉన్నట్లుగా జాతీయ భూభౌతిక పరిశోధన కేంద్రం(ఎన్ జీఆర్ఐ) గుర్తించింది. 15, 17, 19-20 కిలోమీటర్ల మధ్య నాలుగు షీయర్ జోన్లు ఉన్నాయని, వాటికి నల్లవాగు కారణమని పేర్కొంది. వాటిని జాగ్రత్తగా దాటుకుంటూ 2028 మే నాటికి సొరంగం పనులు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రమాదం జరిగిన 14వ కిలో మీటర్ వద్ద బైపాస్ తో ప్రమాదకరమైన షీర్ జోన్ దాటేశామని, ప్రమాదం తర్వాత ఇప్పటి వరకు సుమారు 500 మీటర్ల మేర సొరంగం తవ్వకం పూర్తయిందని, ఇంకా దాదాపు 9.2 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉందని తెలిపారు.

సెప్టెంబర్ నుంచి ప్రతినెల 350కిలోమీటర్ల టన్నెల్ తవ్వుతామని, డిసెంబర్ -జనవరి తర్వాతా ప్రతినెల 425మీటర్ల చొప్పున తవ్వుతామని అధికారులు వెల్లడించారు. ఇరువైపులా కలిపి రోజుకు సుమారు 17 మీటర్ల మేర సొరంగం తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, రెండు వైపుల మూడు షిప్టులలో 400మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు.