నేను సీబీఐ విచార‌ణ‌కు రెడీ.. అబ్బాకొడుకులు రెడీనా..?: వైఎస్. జగన్

వైఎస్ జగన్ కీలక సవాల్ చేశారు. డీఎస్సీ-2025, ఏపీపీఎస్సీ-2018పై సీబీఐ విచారణకు తాము సిద్ధమని, చంద్రబాబు, లోకేశ్ సిద్ధమైతే వెంటనే లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Aug 20, 2026, 2:20 pm IST
Read Time: 5 mins
నేను సీబీఐ విచార‌ణ‌కు రెడీ.. అబ్బాకొడుకులు రెడీనా..?: వైఎస్. జగన్

డీఎస్సీ-2025, ఏపీపీఎస్సీ-2018పై సీబీఐ విచార‌ణ‌కు మేము రెడీ అని, అబ్బాకొడుకులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ లు రెడీ అయితే.. వెంట‌నే లేఖ రాసి ఇవ్వు అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి సవాల్ చేశారు. మేము త‌ప్పుచేయ‌లేదు కాబ‌ట్టి.. త‌లెత్తుకొని మ‌రీ స‌వాల్ చేస్తున్నామని, మీరు తప్పుచేయకపోతే విచారణకు సీబీఐకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు . డీఎస్సీలో లీకేజీల నుంచి బేరసారాల వరకు అంతా విచారించాలని, మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాల్సిందేనని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగా..రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాల్సిందే అని వైఎస్‌ జగన్‌ ఉద్ఘాటించారు. మేం డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే ..వారు ఏపీపీఎస్సీ గ్రూప్‌-1లో అవకతవకలు జరిగాయని దుష్ప్రచారానికి దిగారని, కానీ చంద్రబాబు ప్రభుత్వం చివర్లోనే ప్రిలిమ్స్‌ జరిగిందన్న సంగతి మరిచిపోరాదన్నారు. డీఎస్సీ స్కాంపై ఆడియో, వీడియో టేపులు బయటకు వచ్చాయి. టేపులు బయటకు వచ్చినట్లు బాబు, లోకేశ్‌లు ఒప్పుకున్నారని…నిందితులను కాపాడుతున్నారు అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

డీఎస్సీ నియామకాల్లో పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకునేందుకే స్పోర్ట్స్‌ కోటాను ఉపయోగించుకున్నారని మండిపడ్డారు.డీఎస్సీ పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని జగన్‌ నిలదీశారు. పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అసలు ఎలా అనగలిగిందని ప్రశ్నించారు. స్పోర్ట్‌ కోటాలో ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా జీవోలు కూడా జారీ చేశారని.. రిక్రూట్‌మెంట్‌లు అయ్యాక వాటిని వెనక్కి కూడా తీసుకున్నారని వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు. పీవీ సింధుకు ఇచ్చినట్లుగానే ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు.. కానీ పీవీ సింధులా ఎంతమంది అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని పతకాలు సాధించారు? అని ప్రశ్నించారు.

డీఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని, ఆ ఆధారాలు ప్రజల ముందు ఉంచాం. ఆ అవకతకవలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని జగన్ డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రం తయారీ విభాగంలో పనిచేసే ఉద్యోగికి ఫస్ట్‌ ర్యాంక్‌ రావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. నవీన్‌ ఒక్కడి వరకే పేపర్‌ లీక్‌ పరిమితమైందా? లేక ఇంకా ఎంతమందికి చేరింది? అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. నవీన్‌ విషయంలోనే ఇలా జరిగిందా? డీఎస్సీ వ్యవహారంలో మరెవరైనా లబ్ధి పొందారా? అనే అంశాలపైనా సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని.. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని చెప్పారు. చట్టసభల్లో ప్రధాన ప్రతిపక్షానికి సమయం ఇవ్వాల్సి వస్తుందని తమకు ఆ హోదా ఇవ్వడం లేదు. కౌన్సిల్‌లోనూ మాట్లాడడానికీ సమయం ఇవ్వడం లేదు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌ లేకుండా తండ్రీకొడుకులు బ్యాటింగ్‌ చేస్తున్నారు అని చంద్రబాబు, నారా లోకేశ్‌లను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.